అసెంబ్లీలో కనిపించని ఎమ్మెల్యేలు
పెరగని హాజరు శాతం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడు రోజులు పూర్తి చేసుకున్నాయి. ప్రజాసమస్యలను ప్రస్తావించి పరిష్కరించాల్సిన ఎమ్మెల్యేలు మాత్రం సభలో తగినంతగా కనిపించడం లేదు. హాజరుశాతం ఆశించినంతగా పెరగడం లేదు. తొలిరోజు, బడ్జెట్ రోజు మినహా ఇతర అన్నీ రోజుల్లోనూ శాసనసభ బోసిబోతున్నది. మొత్తం 119 ఎమ్మెల్యేలకుగాను ప్రతిరోజూ 35 నుంచి 40 మంది మాత్రమే సభకు హాజరవుతున్నారు. కీలకమైన పద్దులపై చర్చించి ఆమోదం తెలిపే అసెంబ్లీలో శాసనసభ్యుల హాజరుశాతం చాలా తక్కువగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. గత రెండు రోజులుగా శాసనసభలో ముఖ్యమైన పద్దులపై చర్చ చోటుచేసుకుంటున్నది.
ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో సమస్యలు, ఇతర అంశాలపై చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సి ఉంటుంది. తద్వారా పరిష్కారానికి అవకాశం కలుగుతుంది. ఎమ్మెల్యేల హాజరు శాతం కనీసం 50 శాతం కూడా ఉండటం లేదు. గురువారం సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల సమయంలో ఎమ్మెల్యేల సంఖ్య పలుచగా కనిపించింది. మొత్తం 119 శాసనసభ్యులకుగాను పద్దుల చర్చ సందర్భంగా సభలో తొలుత కనిపించింది 24 మంది. ఆ తరువాత కొందరు పెరిగారు. నలుగురైదుగురు మాత్రం లోపలికి, బయటకు తిరుగుతూ కనిపించారు. పట్టణ, పురపాలక శాఖ, బీసీల సమస్యలు, ఇతర అంశాలపై చర్చ ముగిసే సమయానికి 40 మందిలోపు సభలో కనిపించారు. దాదాపు 79 మంది ఎమ్మెల్యేలు సభలో లేకపోవడం గమనార్హం. దీంతో ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధి ప్రశ్నార్థకమవుతున్నది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సైతం సమావేశాల కంటే ముందే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అల్టీమేటమ్ జారీచేశారు.
ప్రతిరోజూ అందరూ హాజరుకావాలనీ, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. సభకు ప్రిపేర్ అయి రావాలని చెప్పారు. అకారణంగా రాకుండా ఉండొద్దని సున్నితంగా హెచ్చరించారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ సభ్యులకు సైతం ఆపార్టీ నాయకత్వం నుంచి సూచనలు వెళ్లాయి. ఇకపోతే ఎంఐఎం, బీజేపీ ఎమ్మెల్యేలు సైతం పూర్తిస్థాయిలో కనిపించకపోవడం గమనార్హం. మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క తదితరులు సభలో ఉండగా, ప్రతిపక్షం నుంచి హరీశ్‌రావు, కేటీఆర్, సబితాఇంద్రారెడ్డితోపాటు ఇతర ఎమ్మెల్యేలూ ఉన్నారు. సభా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సమస్యలపై చర్చలో పాల్గొనాలని సభాపతి ప్రసాద్‌కుమార్ అప్పుడప్పుడు సభ్యులకు సూచిస్తునే ఉన్నారు. సభలో మాట్లాడే అవకాశం సభ్యులందరికీ రాకున్నా, హాజరు కావడం కనీస బాధ్యతగా ఎమ్మెల్యేలు గుర్తించాల్సి ఉంది.
ప్రజాసమస్యలపై చిత్తశుద్దేది..!?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



