Wednesday, December 17, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిచైనాతో చిప్‌ యుద్ధం 2.0లో గెలుపెవరిది?

చైనాతో చిప్‌ యుద్ధం 2.0లో గెలుపెవరిది?

- Advertisement -

సాంకేతిక రంగంలో ముందుకు పోకుండా చైనాను అడ్డుకొనేందుకు ఇప్పటి వరకు ఒంటరిగా ప్రయత్నించిన అమెరికా తాజాగా తనకు తోడుగా మరికొన్ని దేశాలను కూడగట్టుకొని గోదాలోకి దిగింది. బహుశా అందుకే కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో పూర్తి స్థాయి యుద్ధ ముప్పు ఉందని ప్రపంచ ధనికుడు ఎలన్‌ మస్క్‌ వ్యాఖ్యానించాడు. అమెరికా దిగ్గజ సంస్థ ఎన్‌విడియా తదుపరి తరం హార్డ్‌వేర్‌ బ్లాక్‌వెల్‌ చిప్‌తో అది ప్రారంభమైనట్లే అన్నాడు. వచ్చే ఏడాది మార్కెట్‌లోకి అది రానుందనే వార్తల పూర్వరంగంలో జరుగుతున్న పరిణామాలపై తాజాగా మస్క్‌ స్పందించాడు. ఈ చర్యతో పోటీదారులు వేగం,ఖర్చు,విస్తృతి అంశాల్లో తమ సత్తా చూపేందుకు పూనుకుంటారన్నాడు. ద్రవ్య పెట్టుబడిదారు గవిన్‌ బేకర్‌ మాట్లాడిన అంశాల మీద మస్క్‌ స్పందించాడు.

బ్లాక్‌వెల్‌ చిప్స్‌ తయారీలో అనేక సవాళ్లు ఉన్నట్లు బెకర్‌ చెప్పాడు. అందుకే అది ఆలస్యమవుతున్నదని అన్నాడు. ఏది ఏమైనప్పటికీ ఈ రంగంలో ఉన్న గూగుల్‌, ఎలన్‌మస్క్‌ ఎక్స్‌ ఏఐ, మేటా (ఫేస్‌బుక్‌ ) వంటి కంపెనీలన్నీ పోటీపడతాయని వేరే చెప్పనవసరం లేదు. మరోవైపు పశ్చిమ దేశాల సంస్థలకు చైనా పెద్ద సవాలు విసురుతున్నది. గత పదిహేనేండ్లుగా సాంకేతిక రంగంలో బీజింగ్‌ ఎదగకుండా చూసేందుకు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు చేయని యత్నం లేదు. వాణిజ్యపోరుతో పాటు చిప్స్‌ పోరును కూడా ప్రారంభించాయి. తాజా పరిణామాలను బట్టి ఈ యుద్ధంలో అమెరికాకు ఊహించని దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. అందుకే అది కొత్త ఎత్తుగడలతో పోరును కొనసాగించేందుకు పాక్స్‌ సిలికా పేరుతో కొత్త కూటమిని రంగంలోకి తెచ్చింది.

భారత్‌ను మినహాయించిన అమెరికా!
చిప్‌ యుద్ధంలో చైనా ఒక్కటే ఒకవైపు, అనేక దేశాలు మరోవైపు ఉన్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా చైనాకు అధునాతన చిప్స్‌ ఎగుమతులపై వాషింగ్టన్‌ ఆంక్షలు విధించింది. ఇటీవలనే ఎన్‌విడియా కంపెనీకి అనుమతి ఇచ్చింది. అయితే అధికారికంగా ఎలాంటి సమాచారం లేనప్పటికీ ఆ చిప్స్‌ తమకు అవసరం లేదన్నట్లుగా చైనా తీరు ఉందని, తిరస్కరించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ పూర్వరంగంలో చిప్‌ యుద్ధంలో తన బలం ఒక్కటే చాలదని భావించిన అమెరికా డిసెంబరు 12న తొలిసారిగా పాక్స్‌ సిలికా పేరుతో ఒక కూటమికి శ్రీకారం చుట్టింది. పాక్స్‌ అంటే లాటిన్‌ భాషలో శాంతి, స్థిరత్వం, సిలికా అంటే ఇసుకతో సహా వివిధ రూపాల్లో ఉండే ఖనిజం. దాన్నుంచి కంప్యూటర్లకు అవసరమైన చిప్స్‌ తయారు చేస్తారు.

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఐటి, సాంకేతిక పరిజ్ఞానం కేంద్రాలు కేంద్రీకృతమైన ప్రాంతాన్ని సిలికాన్‌ వ్యాలీ అని పిలుస్తున్న సంగతి తెలిసిందే. పాక్స్‌ సిలికా లక్ష్యం ఏమిటంటే విలువైన ఖనిజాల సరఫరా, సాంకేతిక పరిజ్ఞాన సహకారంతో ఆ కూటమిలోని దేశాలు బలపడటం, చైనా ఆధిపత్యాన్ని ఉమ్మడిగా సవాలు చేయటం. అమెరికా వైపు నుంచి ఇలాంటి చొరవ చూపటం అంటే కమ్యూనిస్టు చైనా ముందు ఒక విధంగా తన ఓటమిని అంగీకరించటమే. చిత్రం ఏమిటంటే ఈ బృందం నుంచి భారత్‌ను మినహాయించింది. దీని అర్ధం మనలను చేర్చుకున్నందున తమకు ఉపయోగం లేదని భావించినట్లేనా? లేక తమకు అనుకూలమైన షరతులతో వాణిజ్య ఒప్పందానికి ఒప్పించటానికి మరోవిధంగా ఒత్తిడి చేయటమా?

ప్రస్తుతం ప్రపంచంలో విలువైన ఖనిజాలు, వాటి ఉత్పత్తుల విషయంలో డెబ్బయి శాతంతో చైనా అగ్రభాగాన ఉంది. వాటి ఎగుమతుల నిలిపివేతతో ఇటీవల ప్రపంచంలోని అనేక దేశాలు గిజగిజలాడిన సంగతి తెలిసిందే.ఈ ఖనిజాలతో పాటు కృత్రిమ మేథ(ఏఐ), చిప్స్‌ తయారీ వంటి కీలక రంగాలలో పరస్పరం సహకరించుకునేందుకు అమెరికా,దక్షిణ కొరియా, సింగపూర్‌, జపాన్‌, ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్‌, నెదర్లాండ్స్‌, బ్రిటన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ స్థాపక సభ్యులుగా పాక్స్‌ సిలికా ఏర్పడింది. ఆర్థిక కూటములు తప్ప సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి ఏర్పడటం ఇదే ప్రధమం.దీన్ని అమెరికా కృత్రిమ మేధ దౌత్యంగా వర్ణించారు. ఈ కూటమికి సహకరించేందుకు లేదా అతిధులుగా తైవాన్‌, ఐరోపా యూనియన్‌, కెనడా, ఓయిసిడి ఉంటాయి.

ఈ సంస్థలకు చెందిన దేశాలు తమవంతు సహకారాన్ని అందిస్తాయి. అమెరికా ఆర్థిక వ్యవహారాల సహాయమంత్రి జాకబ్‌ హెల్‌బర్గ్‌ ఈ చొరవను ”నూతన స్వర్ణ యుగం” అని వర్ణించాడు. దీని గురించి చైనా ఇంతవరకు అధికారికంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. ఇతరులపై ఆధారపడకుండా చైనా స్వయంశక్తితో ఎదిగేందుకు దీర్ఘకాలిక పథకాలను రూపొందించింది. దాన్లో భాగంగానే అక్కడి ప్రభుత్వం పెద్ద మొత్తాలలో పరిశోధన, అభివృద్ధికి ఖర్చు చేస్తున్నది. స్వయంగా ఉత్పత్తులను చేస్తున్నది. ఇప్పుడు పాక్స్‌ సిలికాను కూడా సవాలుగా తీసుకొని మరింతగా తన సంస్థలను ప్రోత్సహిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో అమెరికా, పశ్చిమ దేశాలు ఎంతగా ఒంటరిపాటు చేయాలని చూస్తే ఎలాంటి ఆర్భాటం లేకుండా అంతగా నూతన విజయాలతో ముందుకు వచ్చి సమాధానం చెప్పింది.

ప్రపంచాన్ని కుదిపేసిన ‘డీప్‌సీక్‌’
చైనా గురించి అనేక అబద్దాలను ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఎన్‌విడియా కంపెనీ తయారు చేసిన చిప్స్‌ను చైనాకు ఎగుమతి చేయరాదని అమెరికా ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే వాటిని అక్రమ పద్ధతుల్లో సేకరించి డీప్‌సీక్‌లో వినియోగిస్తున్నట్లు వార్తలు రాశారు. అయితే అలాంటిదేమీ లేదని ఎన్‌విడియా ప్రకటించి వాటి గాలి తీసింది. సదరు ఆరోపణకు ఎలాంటి ఆధారాలు లేవని, తాము అమెరికా నిబంధనలకు అనుగుణంగానే పని చేస్తున్నట్లు పేర్కొన్నది. అత్యంత తక్కువ ఖర్చుతో స్వల్పకాలంలోనే ఏఐ డీప్‌సీక్‌ను తయారు చేసి 2025లో ప్రపంచాన్ని కుదిపివేసింది. చాట్‌ జిపిటి వంటి ఏఐ వ్యవస్థలను తయారు చేసేందుకు భారీ మొత్తాలలో ఖర్చు చేసిన సంస్థలు తలలు పట్టుకున్నాయి.

కంపెనీల వాటాల ధరలు పతనమయ్యాయి. ఆధునికమైన చిప్స్‌తో పనిలేకుండానే తక్కువ ఖర్చుతో ఏఐ వ్యవస్థలను తయారు చేయవచ్చని ఇప్పుడు అనేకమంది భావిస్తున్నారు. సాంకేతిక రంగంలో కొన్నింటిలో ఇప్పటికీ ముందున్నప్పటికీ మొత్తంగా చూసినపుడు గతంలో మాదిరి అమెరికా ఒక నిర్ణయాత్మక శక్తిగా లేదు. ఎన్‌విడియా హెచ్‌ 200 రకం చిప్‌లను చైనాకు ఎగుమతి చేయవచ్చని ట్రంప్‌ అనుమతించాడు.చైనా మార్కెట్‌లో ప్రవేశించటం ఒకటైతే, వాటిని కొనుగోలు చేసిన చైనా తనపరిశోధనలను పక్కన పెట్టి వాటిపైనే ఆధారపడుతుందనే అంచనాతో ఈ చర్య తీసుకున్నాడు. అయితే అలా జరుగుతుందని చెప్పలేమని అధ్యక్ష భవనంలో ఏఐ జార్‌గా పరిగణించే డేవిడ్‌ శాక్స్‌ చెప్పాడు. ఎగుమతులపై నిషేధం పెట్టిన అమెరికా తానే ఏకపక్షంగా ఎత్తివేసింది. ఆట నిబంధనలను తానే రూపొందించి తానే మార్చినట్లయింది.

ఇతర దేశాలపై ఆధారపడ్డ అగ్రరాజ్యం
కొన్ని దశాబ్దాల పాటు తన నిబంధనలతో అమెరికా ప్రపంచాన్ని ఏలింది. ఇతర దేశాల తలరాతలను రాసేందుకు ప్రయత్నించింది. మనతో సహా అలీన దేశాలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తే అది సోవియట్‌, ఇతర సోషలిస్టు దేశాలకు, పెట్టుబడిదారీ దేశాల్లోనే తమ ప్రత్యర్ధులకు చేరుతుందనే భయంతో అనేక చర్యలు తీసుకుంది. పోటీదారులు తలెత్త కుండా చూసుకుంది, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా తన రాజకీయ అవసరాల కోసం ఒక ఆయుధంగా వాడుకుంది. మన దేశానికి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం అందకుండా అన్ని విధాలుగా అడ్డుకుంది. సోవియట్‌ యూనియన్‌, తరువాత రష్యా అండతో దాన్ని అధిగమించాం. అణుపరీక్షలు జరిపితే ఆంక్షలు విధించింది. ఆహార ధాన్యాలు కావాలంటే మాకేంటని బేరం పెట్టింది. ఇలా అనేక అంశాలను చెప్పుకోవచ్చు.

కానీ ఇప్పుడు కుదరదు, పరిస్థితులు మారాయి. అది చేసిన చారిత్రక తప్పిదం వలన ఇతర దేశాల మీద ఆధారపడక తప్పని స్థితి. వస్తు ఉత్పాదక పరిశ్రమలన్నింటినీ మూసివేసింది, లేదా ఇతర దేశాలకు తరలించింది. ఇప్పుడు టాయిలెట్లలో తుడుచుకొనేందుకు అవసరమైన కాగితాన్ని కూడా అది ఏదో ఒక దేశం నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. కోట్లకు వేసుకొనే టై దగ్గర నుంచి కాళ్లకు వేసుకొనే బూట్ల వరకు ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటే తప్ప గడవదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సంపా దించిన సొమ్ముతో వాటన్నింటినీ ఎక్కడో అక్కడనుంచి తెచ్చుకుంది. ఇప్పుడు అలాంటి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఉదాహరణకు ఎన్‌విడియా చిప్స్‌ను చైనాకు ఎగుమతి చేసి రాబడిలో 25శాతం ఖజానాకు జమచేస్తానని ట్రంప్‌ చెప్పాడు.

ఎలా అంటే 25శాతం ఎగుమతి పన్ను విధించి అన్నాడు. ఆ కంపెనీ ఏటా పది బిలియన్‌ డాలర్ల వరకు హెచ్‌ 200 రకం చిప్స్‌ను ఎగుమతి చేస్తే దాని మీద 25శాతం పన్నుతో రెండున్నర బిలియన్‌ డాలర్ల మేర రాబడి వస్తుందని ట్రంప్‌ లెక్కలు వేసుకున్నాడు. తీరా ఏమైంది. అమెరికా చిప్సా అసలు మనకు వాటి అవసరం ఉందో లేదో సమీక్షించాలని, ప్రభుత్వ రంగంలో వాటిని వాడవద్దని తన అధికారులు, సంస్థలను చైనా ప్రభుత్వం ఆదేశించినట్లు మీడియాలో వచ్చింది. మన చిప్స్‌ను చైనా తిరస్కరిస్తున్నదని అధ్యక్ష భవన అధికారి డేవిడ్‌ శాక్స్‌ బ్లూమ్‌బెర్గ్‌ వార్తా సంస్థతో చెప్పాడు. అదే నిజమైతే ట్రంప్‌ వ్రతం చెడ్డా ఫలం దక్కలేదని చెప్పాల్సి ఉంటుంది. 2023 నుంచి నిషేధం అమలు చేసినందున మూడు సంవత్సరాల్లో ఎంతో నష్టపోయినట్లు ఎన్‌విడియా కంపెనీ వాపోయింది. ఈ నిషేధం కారణంగా ఎవరిమీదో ఎందుకు ఆధారపడటం మీరే తయారు చేయండని స్థానిక కంపెనీలకు 70 బిలియన్‌ డాలర్ల ప్రోత్సాహక ప్యాకెజ్‌ను చైనా ప్రకటించింది.

పరిశోధనల్లో చైనా ముందంజ
ముందే చెప్పుకున్నట్లు చైనా పరిశోధనా రంగంలో చేస్తున్న ఖర్చుకు ఫలితాలు కనిపిస్తున్నాయి.2025 డిసెంబరు ఒకటవ తేదీన ఆస్ట్రేలియన్‌ స్ట్రాటజిక్‌ పాలసీ ఇనిస్టిట్యూట్‌ విడుదల చేసిన సమాచారం ప్రకారం అది విశ్లేషించిన 74 కీలక రంగాలకుగాను 66లో చైనా పరిశోధనలు ముందున్నాయి.అమెరికా కేవలం ఎనిమిదింటిలో మాత్రమే ఉంది. 2000 దశకంలో అమెరికా అగ్రస్థానంలో ఉంది, ఇప్పుడు తిరగబడింది. అయితే చైనా ఆ తరువాత అల్లా ఉద్దీన్‌ అద్బుతదీపాన్ని సంపాదించిందా ? లేదు, ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ప్రకారం ప్రాధాన్యత రంగాలను ఎంచుకొని సాగించిన కృషికి ఫలితమిది.అమెరికా ఎప్పుడైతే అడ్డుకోవాలని చూసిందో అప్పటి నుంచి మరింత పట్టుదల పెరిగింది.అనేక రంగాలలో విదేశాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఇప్పుడు లేదు. అలా అని తలుపులు మూసుకోలేదు, అవసరమైన వాటికోసం వెంపర్లాడటం లేదు.

చిప్స్‌ కొనటం లేదని అమెరికా అధికారి వాపోవటానికి కారణం చైనా కాదు, అమెరికా అనుసరించిన ఎత్తుగడలే అన్నది స్పష్టం. అవసరమైనప్పుడు అమ్మకుండా తీరిన తరువాత ఇస్తామంటే ఎవరైనా కొనుగోలు చేస్తారా? చైనా కొన్ని అంశాలలో తన విధానాలను ఇతర దేశాలను చూసి నిర్ణయించుకోవాల్సిన స్థితిలో లేదు. చైనాతో సహా వర్ధమానదేశాలన్నింటినీ తమ గుప్పిటలోకి తెచ్చుకోవాలని అమెరికా శ్వేతసౌధంలో రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఎవరు ఉన్నా అనుసరించిన విధానం ఒక్కటే.అక్కడి అధికారం కోసం వారిలో వారు పోట్లాడుకుంటారు తప్ప ఇతర దేశాలను దోచుకోవటంలో, తంపులు పెట్టి ఆయుధాలు అమ్ముకోవటంలో ఎవరికెవరూ తీసిపోలేదు. ట్రంప్‌ రెండవసారి అధికారానికి వచ్చిన తర్వాత చైనాపై చిప్‌ యుద్ధం 2.0 ప్రారంభించాడు, ఇది ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారితీస్తుందో చూద్దాం!

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -