స్త్రీలలో అనారోగ్యానికి కారణమయ్యే వ్యాధుల్లో అతి ముఖ్యమైనవి మూత్రానికి సంబంధించిన అంటువ్యాధులు. ‘జ్వరం, మూత్రం వేడిగా వస్తుంది, పచ్చగా ఉంటుంది, మంట ఉంటుంది, మూత్ర విసర్జన నొప్పితో మొదలౌతుంది, విసర్జన తర్వాత పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి, వెన్నులో నొప్పి, మూత్రంలో రక్తం పడుతుంది, మూత్రాశయం దగ్గర దురదగా ఉంటుంది’ ఇలా అనేక ఇబ్బందులతో మహిళలు డాక్టర్ దగ్గరకు వెళుతుంటారు.
చాలా వరకు మూత్ర సమస్యలు ఆడవారిలో పదిహేను నుండి నలభై ఐదేండ్ల వయసులో అంటే రజస్వల తర్వాతి నుండి రుతువిరతి వరకు కలుగవచ్చు. ఈ వయసులో మగవారి కంటే ఆడవారు ఎక్కువగా ఈ సమస్యలతో బాధపడుతుంటారు. దీనికి కారణం స్త్రీలలో మూత్రాశయం నుండి మూత్ర నాళం (మూత్రం వెలుపలికి వచ్చే మార్గం) మధ్య దూరం చాలా తక్కువగా, చిన్నదిగా ఉంటుంది. యోని, మల ద్వారానికి అతి దగ్గరలో ఉండటం వల్ల యోనిలోని హానికారక క్రిములు మూత్ర నాళానికి చేరి అక్కడినుండి సులభంగా మూత్రాశయంలోకి ప్రవేశిస్తాయి. ఈ సమయంలో సరైన చికిత్స అందకపోతే అవి పైకి పాకి మూత్రపిండాలలో చేరే అవకాశముంటుంది. దీనిని ఆంగ్లంలో రెట్రోగ్రేడ్ స్ప్రెడ్ అఫ్ ఇన్ఫెక్షన్ అని అంటారు. అరుదుగా శరీరంలో వేరే చోటెక్కడి నుండైనా క్రిములు మూత్రపిండాల్లో చేరి, మూత్రం ద్వారా మూత్రాశయంలోకి ప్రవహించి అక్కడి నుండి మూత్రనాళం, మూత్ర వ్యవస్థ మొత్తానికి అంటుకుంటాయి.
అంటువ్యాధులు మూడు రకాలు
- మూత్ర నాళానికి పరిమితమైనవి (యూరేత్రైటిస్)
- మూత్రాశయానికి వరకు ప్రసరించినవి (సిస్టైటిస్)
- మూత్ర పిండాలకు చేరినవి (నెఫ్రైటిస్)
అంటు ఎలా సంభవిస్తుంది?
మగవారి మూత్రనాళంలో బ్యాక్టీరియా ఉన్నట్లయితే వారితో సంపర్కించిన స్త్రీలకు వ్యాపించవచ్చు.
మలవిసర్జన తర్వాత తగు పరిశుభ్రత పాటించకపోతే మలంలోని క్రిములు మూత్రనాళంలోనికి చొచ్చుకు పోయి, అవి హానికారకమైనవి అయితే అంటువ్యాధిని వ్యాపింపజేస్తాయి.
నీరు సరిగా తీసుకోకపోతే నిర్జలీకరణంతో శరీరం నుండి వ్యర్థాలను బయటికి వెళ్లే క్రియ కుంటుపడి, అంటు వ్యాధులను వ్యాపింప చేసే క్రిములు మూత్రాశయంలోనే ఉండిపోవచ్చు.
మధుమేహం వల్ల శరీరంలో గ్లూకోస్ స్థాయి ఎక్కువై బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. నరాల బలహీనత వల్ల మూత్రాశయం పని తీరు దెబ్బ తిని, మూత్ర విసర్జన సరిగా కాక, కొంత మూత్రం మూత్రాశయం లోనే ఉండిపోయి అంటు వ్యాధులు రావచ్చు.
యూరెటరల్ రిఫ్లక్స్, పోస్టిరియర్ యురెత్రల్ వాల్వ్ వంటి పుట్టుకతో వచ్చే మూత్రనాళ సమస్యలు.
ఆసుపత్రిలో ఆపరేషన్లు చేసినప్పుడు, కదలలేనప్పుడు, మూత్ర విసర్జన కొరకు కాథెటర్ వాడాల్సిన అవసరం పడినప్పుడు.
గర్భిణీలలో ఎక్కువ మోతాదులో ఉండే ప్రొజెస్టెరోన్, రుతు విరతి తర్వాత ఈస్ట్రోజెన్ లోపం మూత్ర వ్యవస్థకి సంబంధించిన అంటువ్యాధులకు దారి తీయొచ్చు.
సంతాన నిరోధక సాధనాల వాడుక (కాంట్రాసెప్టివ్స్).
మూత్రాన్ని చాల సేపు ఆపుకోవడం వల్ల కూడా క్రిములు అభివృద్ధి చెందే అవకాశముంది.
సూచికలు ఎలా ఉంటాయి?
జ్వరం, వాంతులతో మొదలవ్వచ్చు. మూత్ర విసర్జన సమయంలో తీవ్రమైన మంట, తరచుగా మూత్ర విసర్జన జరగడం, చుక్కలుగా పడటం, విసర్జన పూర్తయిన భావన కలగకపోవడం, మూత్ర విసర్జన పూర్తైన తర్వాత కూడా వత్తిడి ఉండటం, మూత్రానికి పరిగెత్తాల్సి రావడం, వెళ్ళేలోపలే విసర్జన మొదలవ్వడం, పొత్తి కడుపులో నొప్పి, విసర్జన జరుగుతున్నప్పుడూ, ఆ తర్వాత కూడా భరించరాని మంటతో కూడిన నొప్పితో మెలికలు తిరిగిపోవడం… ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతుంటారు.
చికిత్స పరిమితమైతే
బ్యాక్టీరియా ఎక్కడి వరకు వ్యాపించింది, దాని లక్షణాలను బట్టి వ్యాధి తీవ్రత ఉంటుంది. సకాలంలో సరైన చికిత్స తీసుకోకున్నా, కేవలం పైన కనపించే లక్షణాలకు మాత్రమే పరిమితమై చికిత్స తీసుకున్నా అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. బ్యాక్టీరియా మూత్రనాళం నుండి మూత్రాశయానికి విస్తరించవచ్చు. మూత్రపిండాలపై కూడా ప్రభావం పడవచ్చు. వాటిలో చీము చేరవచ్చు. అరుదుగా బ్యాక్టీరియా రక్తంలోకి ప్రవహించి, శరీరంలో వ్యాపించి, ప్రాణాంతకమైన సెప్టిసీమియా అనే స్థితికి కారణమవ్వొచ్చు. గర్భిణీలు మూత్ర సమస్యల బారిన పడితే బిడ్డకు సమస్య కావొచ్చు, గర్భంలోనే మృతి చెందవచ్చు. తరచూ మూత్రాశయ వ్యాధుల బారిన పడుతున్న వారు మూత్రం ఆపుకోలేని స్థితి (యూరినరీ ఇంకంటినెన్స్)కి చేరవచ్చు.
నివారణ ఎలా..?
రోజుకు కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగాలి. మూత్ర విసర్జనను బలవంతంగా ఆపుకోకూడదు. పరిశుభ్రత పాటించాలి. లైనర్ పాంటీస్ వాడడం వల్ల మూత్రనాళాన్ని పొడిగా ఉంచవచ్చు. దీని వల్ల బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది. రుతుస్రావ సమయంలో మరింత జాగ్రత్త వహించాలి. వీలైనంత వరకు ఇంట్లో తయారు చేసుకున్న సానిటరీ పాడ్స్ వాడడం ఉత్తమం. లైంగికసంపర్కం తర్వాత ఆడా మగా ఇద్దరూ పరిశుభ్రత పాటించాలి. సంపర్కం ముందు, తర్వాత కూడా మూత్రవిసర్జన చేయాలి.
చికిత్స ఏమిటీ..?
మూత్ర సమస్యలకు చికిత్సలో అత్యంత ప్రమ్యుమైనది టెస్టులు చేయించుకోవడం. దీనివల్ల మూత్రంలో ఎలాంటి సమస్యలున్నాయో తెలుసుకోవడం సులభమవుతుంది. పరీక్షా ఫలితాలను బట్టి వైద్యలు సమస్యను గుర్తించి దానికి తగిన విధంగా మందులు ఇస్తారు. వ్యాధిని బట్టి లక్షణాలు తగ్గిన తర్వాత కూడా ఆంటిబయోటిక్ అవసరం ఉండొచ్చు. మూత్ర పరీక్ష మళ్ళీ మళ్ళీ చేయిస్తూ బ్యాక్టీరియా పూర్తిగా అంతరించిపోయే వరకు ఆంటిబయోటిక్ తీసుకోవాల్సి రావచ్చు. అప్పుడప్పుడు మందులు మార్చాల్సిన అవసరం కూడా ఏర్పడవచ్చు. లేదంటే మూత్రనాళంలో కొన్ని క్రిములు ఉండిపోయి అవి తిరిగి విజృంభిస్తాయి. అరుదుగా ఆంటిబయోటిక్ కొన్ని నెలలపాటు ఉపయోగించవల్సి రావచ్చు.
- డా|| మీరా, ఎం.డి. రిటైర్డ్ ప్రొఫెసర్, ఉస్మానియా మెడికల్ కాలేజ్