ఒకరి నిర్లక్ష్యం ఎందరికో శాపంగా మారుతుంది. ఒకరి అజాగ్రత్త ఎందరి జీవితాలలో నో చీకటిని నింపుతుంది. రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ముఖ్యంగా యువతే ఇందులో ఎక్కువగా వుంటున్నారు. ఇది దేశ భవిష్యత్తును ప్రమాదంలో పడేసే అంశం.
ఒక తల్లి చిన్నారుల్ని ఒడిలో పెట్టుకొని తలుపు వైపు ఆశగా చూస్తోంది తన భర్త రాక కోసం. ఒక తండ్రి, కొడుకు రాక కోసం గడప దగ్గరే ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు…
కానీ వారెవరూ ఊహించలేక పోయారు… ఇంకెప్పటికీ తమవారు తిరిగిరారని. అంతటా విషాదాన్ని నింపుతున్నాయి ఈ ప్రమాదాలు.
ఒక క్షణం, ఒక తప్పు జీవితాన్ని తుడిచిపెట్టేసే ప్రమాదం!
శేషంగా మిగిలే శవాలు, శోకాన్ని పంచే జ్ఞాపకాలు, జీవితాంతం ఒళ్లు బిగిసిపోయే రోదనలు!
గణాంకాల్లో గుండె పగిలే నిజాలు
గత ఏడాది భారత్‌లో 4.6 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 1.68 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే రోజుకు 460 మరణాలు!
ప్రతి మూడు ప్రమాదాల్లో ఒకటి ప్రాణాపాయం. ప్రతి 9 మందిలో ఒకరు ప్రమాదానికి గురవుతున్నారు.
అత్యధికంగా చనిపోతున్నది 18-35 ఏళ్ల యువతే.
దేశ భవిష్యత్తే బలైపోతోంది
ప్రధాన కారణాలు
అతివేగం యమలోకానికి దారి. వేగంగా గమ్యం చేరాలనే తొందర… శ్మశానానికి తీసుకెళ్తుంది
మద్యం మత్తు కుటుంబాల కన్నీటి మూలం
తాగిన తర్వాత డ్రైవ్ చేయడం, కూర్చొని మరణంపై సంతకం పెట్టడం లాంటిది.
నిద్ర మత్తు… నిశబ్ద చావు. నిద్రలో వాహనం నడపడం పణాళికతో కూడిన ఆత్మహత్యే.
మైనర్లకు వాహనాలు ఇవ్వడం. తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించి అతి గారబంతో పిల్లలకు బైక్‌లు, కార్లు కొనివ్వడం, వాళ్ళు రోడ్ల మీదికి వచ్చి అమాయకుల ప్రాణాలు తీయడం ఇటీవల ఇలాంటి సంఘటనలు చాలా జారుతున్నాయి
మొబైల్ వాడకం… చేతిలో ఫోన్, మత్యువుకి చాట్. చాలా మంది కారు నడుపుతూ మెసేజ్ టైప్ చేస్తూ, చివరకు రిప్ అనే మెసేజ్‌లా మారుతారు.
హెల్మెట్/ సీట్ బెల్ట్ లేకపోవడం. పట్టించుకోని అజాగ్రత్త జీవితాన్ని ముంచేస్తోంది!
అస్తవ్యస్తమైన రోడ్లు, గుంతలు పడ్డ రోడ్లు, మరమ్మతులు చేయని పాలకులు. ప్రమాదాల బారిన పడే వాహన దారులు
రీల్స్ కోసం రైడ్, లైక్స్ కోసం లైఫ్ త్యాగం చేస్తున్నారు. యూట్యూబ్ రీల్స్‌లో హీరోలా కనిపించాలనే తాపత్రయం, జీవితాన్ని విగ్రహంగా మిగిల్చేస్తోంది. లైక్స్ కోసం లైఫ్ త్యాగం చేయకండి!
ప్రమాదాల దుష్పరిణామాలు జీర్ణించుకోలేని వాస్తవాలు
తల్లి కన్న బిడ్డను శవంగా చూడాల్సిన దుస్థితి.
చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయిన శూన్యత.
తలకొరివి పెట్టాల్సిన కొడుకుకే తల కొరివి పెట్టే దీనస్థితిలో తల్లిదండ్రులు.
అంగవైకల్యం, జీవితాంతం ఒత్తిడిలో జీవితం
లక్షల రూపాయల చికిత్స ఖర్చులు, అప్పుల బారిన పడిన కుటుంబాలు.
”ఆ రోజు తాగకపోయి ఉంటే, ఆ రోజు అలా జరగక పోయి వుంటే నా కొడుకు బతికేవాడు!” ఇలాంటి మాటలెన్నో శాశ్వత మానసిక గాయాలు, ఇలా ఇంకెన్నో విషాదాలు.
పరిష్కార మార్గాలు
ట్రాఫిక్ నియమాలు పాటించండి.
చట్టానికి భయంతో కాదు, ప్రాణాల మీద ప్రేమతో ట్రాఫిక్ నియమాలు పాటించాలి.
మద్యం తాగి డ్రైవింగ్ వద్దు.
సరదా క్షణం శాశ్వత శోకం అవకూడదు!
హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరి. జీవిత రక్షణ గేర్‌గా వాటిని చూడండి, స్టైల్ అంశంగా కాదు.
వేగాన్ని నియంత్రించండి. వేగం కన్నా ప్రాణం మిన్న! పరిమిత వేగంతో ప్రయాణం అందరికి శ్రేయస్కరం
మూల మలుపుల దగ్గర, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలలో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి.
మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. నిర్లక్ష్యంగా వున్న తల్లిదండ్రుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలి. రోడ్లను బాగుచేయాలి
అవగాహన పెంచాలి. బడి నుండి కార్యాలయాల వరకు రోడ్డు భద్రతపై నిరంతర చర్చ అవసరం, అందరిలో అవగాహన పెంచాలి.
ప్రభుత్వ చర్యలు మరింత కఠినంగా ఉండాలి
సిసిటీవీలు, స్పీడ్ గన్లు, ఫైన్లు, డ్రైవింగ్ ట్రైనింగ్ తప్పనిసరి చేయాలి. ప్రభుత్వాలు రోడ్డు ప్రమాదాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్న స్వయ నియాత్రణ లేకపోతే వధానే.
ఎంతో జీవితం ఉన్న చాలా మంది అర్ధాంతరంగా తనువు చాలించి, అయిన వారికి ఆత్మీయులకు తీరని శోకాన్ని మిగిల్చి వెళ్ళిపోతున్నారు
రోడ్డు ప్రమాదాలలో మరణించించే వారి సంఖ్య యుద్ధంలోనో, ఏదైనా మహమ్మారి వల్లనో మరణించే వారి కంటే చాలా అధికంగా ఉంటుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్‌లో చాలా ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
మీ స్టీరింగ్‌పై కేవలం వాహనం మాత్రమే కాదు, కుటుంబపు భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది అని మర్చిపోవద్దు.
ఒక్క క్షణం జాగ్రత్త జీవితకాలం నచ్చిన వాళ్లతో గడిపే అవకాశాన్ని ఇస్తుంది
ఎప్పటికైనా గమ్యం చేరవచ్చు కానీ తొందర పాటు వల్ల ప్రయాణం మధ్యలో ఆగిపోవచ్చు.
జీవితం చాలా విలువైనది నిర్లక్ష్యంతో దానిని చీకటిలి మయం చేసుకోకు. వేగం కన్నా ప్రాణం మిన్నా.
జి. అజయ్ కుమార్
సామాజిక విశ్లేషకులు