ప్రధాని మోడీ హయాంలో 5.3 శాతానికి తగ్గిన సామాజిక వ్యయం
ధరలు పెరిగినా సామాన్యులకు అందని ప్రభుత్వ ఫలాలు..
సెస్‌లు, సర్‌చార్జీల పేరుతో రాష్ట్రాలను లూటీ చేస్తున్న వైనం
ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై ఆర్థిక వేధింపులు
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజాసంక్షేమంపై చేస్తున్న ఖర్చును గణనీయంగా తగ్గించేసుకుంది. ఫలితంగా ప్రజలపై ఆర్థిక భారాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని చూస్తుండటంతో పేదల జీవన ప్రమాణాలు మరింత క్షీణిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కూడా మోడీ ప్రభుత్వం సామాజిక బాధ్యతను విస్మరిస్తున్నది. దీనికి కేంద్ర ప్రభుత్వ గణాంకాలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఆర్బీఐ ప్రచురణలు, భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన గణాంకాల హ్యాండ్‌బుక్, రాష్ట్రాల గణాంకాల హ్యాండ్‌బుక్స్, కొన్ని ఆన్‌లైన్ ఎడిషన్స్ మోడీ హయాంలోని సామాజిక వ్యయ నిర్లక్ష్యానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. కేంద్ర బడ్జెట్‌లో సామాజిక వ్యయ సగటు వాటా 2014-15 కంటే ముందు యూపీఏ ప్రభుత్వ హయాంలో 8.5 శాతంగా ఉంది.
గడచిన 11 ఏండ్ల మోడీ పాలనలో ఈ సామాజిక వ్యయ సగటు 5.3 శాతానికి పడిపోయింది. అదే సమయంలో ఆ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలు తమ భుజస్కందాలపై వేసుకున్నాయి. యూపీఏ హయాం కంటే 8 రెట్లు అధికంగా ఖర్చు చేశాయి. దీనివల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక వ్యయంలో భారీ వ్యత్యాసాలు ఏర్పడ్డాయి. అయితే దీనిలోనూ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వివక్ష స్పష్టంగా కనిపిస్తుంది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఏదో ఒక కేంద్రప్రభుత్వ పథకాల ద్వారా అధిక నిధులు కేటాయిస్తున్నది. కేరళ, కర్నాటక, తెలంగాణ, పశ్చిమబెంగాల్ వంటి ప్రతిపక్షపాలిత రాష్ట్రాలపై మాత్రం కేంద్రం రకరకాల సంస్కరణల పేర్లతో ఆంక్షలు విధిస్తూ, ఆర్థిక స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తున్నది.
ధరలు పెరిగినా, పెరగని సామాజిక వ్యయం
సామాన్య ప్రజానీకాన్ని ప్రభావితం చేసే అంశం ధరల పెరుగుదల. మోడీ పాలనలో నిత్యావసరాల ధరలు కొండెక్కాయి. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ తలసరి సామాజిక వ్యయంలో ఏ మాత్రం పెరుగుదల లేదు. అయితే యూపీఏ ప్రభుత్వ హయాంలో తలసరి సామాజిక వ్యయం సుమారు నాలుగు రెట్లు (397 శాతం) పెరిగింది. ఇది వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణ రేటును దాటింది. కానీ మోడీ ప్రభుత్వ తొలి పదేండ్ల పాలనలో నామమాత్రపు తలసరి సామాజిక వ్యయం కేవలం 76 శాతమే పెరిగింది. వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణ రేటు కంటే ఇది తక్కువ.
సెస్‌లు, సర్‌చార్జీల పెరుగుదల
కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధుల బదిలీల్లో తగ్గుదల పెరిగింది. 2014లో 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు నిధుల పంపిణీ వాటాను 32 నుంచి 42 శాతానికి పెంచింది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలపై ఆధారపడకుండా సొంత కార్యక్రమాలను రూపొందించుకోవడానికి రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛ కల్పించే ఉద్దేశంతో ఈ చర్య తీసుకుంది. మోడీ ప్రభుత్వం ప్రారంభంలో దీన్ని అమలు చేసినా, ఆ తర్వాత రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేని పన్నులు, సర్‌చార్జీలను పెంచి సామాజిక వ్యయాన్ని గణనీయంగా తగ్గించేసింది. మోడీ హయాంలో స్థూల పన్ను రాబడిలో సెస్సులు, సర్‌చార్జీల వాటా అంతకుముందు కాలంతో పోలిస్తే 10.4 శాతం పెరిగింది. 2021-22లో అది గరిష్ట స్థాయికి (20 శాతం) చేరింది. అయితే 2023-24లో 14.5 శాతానికి తగ్గింది. అయినప్పటికీ యూపీఏ హయాంతో పోలిస్తే ఇది ఎక్కువే. దీనివల్ల రాష్ట్రాలు కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక బదిలీలపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాల్సి వచ్చింది.
తగ్గిపోతున్న ఆర్థిక బదిలీలు
2016-17లో కేంద్రం నుంచి రాష్ట్రాలకు గరిష్టంగా 32.8 శాతం మేర ఆర్థిక బదిలీలు జరగ్గా, 2022-23లో అది 28.3 శాతానికి పడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికా పథకాలకు ఆర్థిక బదిలీలను కేంద్రం బాగా తగ్గించి వేసింది. పన్నేతర బదిలీలపై దృష్టి పెట్టింది. రాష్ట్రాలకు ఇష్టంలేని, అవి అంగీకరించని షరతులు విధించింది. పైగా రాష్ట్రాలకు ఆర్థిక బదిలీల విషయంలో కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. ప్రతిపక్ష పాలత రాష్ట్రాలకు నిధులను నిరాకరించి, బీజేపీ పాలిత రాష్ట్రాలకు అధిక నిధులు అందిస్తున్నదని తెలంగాణ సహా అనేక రాష్ట్రాలు కేంద్రంపై ఫైర్ అవుతూనే ఉన్నాయి. అయితే సామాజిక వ్యయంలో కోత పెట్టేందుకు యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన హక్కుల ఆధారిత చట్టాలనే ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఉపయోగించుకుంటున్నది. యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధార్, బయోమెట్రిక్ గుర్తింపు వంటి వాటిని ఆధారం చేసుకొని, నిధుల్లో కోతలు పెడుతున్నది.



