– మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
– నా ఇంట్లో చొరబడి దాడి చేసింది వారే
– వాళ్లే నా ఇంట్లోకి వచ్చి దాడి చేయడం న్యాయమేనా?
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
నంగి దేవేంధర్ రెడ్డిది వరంగల్.. అతను అక్కడి నుండి నిజామబాద్ జిల్లా వేల్పూర్ ఎందుకు రావాలి? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించారు. గురువారం వేల్పూర్ లోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీలైన గల్ఫ్ సంక్షేమ బోర్డ్, ఎన్ఆర్ఐ బోర్డ్, గల్ఫ్ కార్మికుల టోల్ ఫ్రీ ఏర్పాటు చేయాలని, రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా అందని వారికి వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశానన్నారు. గల్ఫ్ కార్మికులకు పథకాలు ఇవ్వమని అడిగానే కానీ, వద్దు అనలేదు కదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నంగి దేవేందర్ రెడ్డి వరంగల్ నుండి అనుచరులను వెంట పెట్టుకొని డైరెక్ట్ గా వేల్పూర్ లోని నా ఇంటికి ఎందుకు రావాలని? అన్నారు.నా ఇంట్లో చొరబడి నా సోదరుడి పై దాడి చేయడమే కాకుండా, ఫర్నిచర్ ధ్వంసం చేస్తూ గోల చేయడంతో పోలీసులు అతన్ని బయటకు లాగి తీసుకొచ్చారన్నారు. నంగి దేవేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు మానాల మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు గుండాలను వెంటబెట్టుకొని దాడికి వచ్చాడన్నారు.నా ఇంటిలోకి చొరబడి నానా యాగీ చేస్తూ నా కుటుంబీకులపై దాడి చేసింది నంగి దేవేందర్ రెడ్డి, వారి అనుచరులేనని స్పష్టం చేశారు.మేము ఎవరి ఇంటికి పోలేదని,వాళ్లే నా ఇంటికి వచ్చి దాడి చేశారని, ఇది న్యాయమా? అని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
