కీలక అంశాలపై పెదవి విప్పని ప్రధాని
న్యూఢిల్లీ : గాజా శాంతి ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఉత్సాహంగా స్పందించారు. రష్యా నుంచి చమురును కొనుగోలు చేయబోమని తనకు మోడీ హామీ ఇచ్చారంటూ ట్రంప్ చేసిన ప్రకటనను మాత్రం ఆయన పట్టించుకోవడం లేదు. భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని నివారించింది తానేనని ట్రంప్ పలు సందర్భాలలో చెప్పినప్పుడు కూడా ఆయన మౌనాన్నే ఆశ్రయించారు. అమెరికా అధికారులు మన దేశానికి చెందిన వలసదారులకు సంకెళ్లు వేసి, సైనిక విమానాలలో కుక్కి పంపించినప్పుడు కూడా ఆయన మౌనంగానే ఉండిపోయారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన విషయాలలో మోడీ ఎందుకు సరిగా స్పందించలేకపోతున్నారన్నదే ఇక్కడ ప్రశ్న. ‘ఇండియా ఫస్ట్’ అనే మోడీ నినాదం ఏమైపోయింది?
పుండు మీద కారం
ట్రంప్ తన స్నేహితుడని మోడీ ఆప్యాయంగా ప్రశంసించారు. అయితే ఆ స్నేహితుడు ఏం చేశాడు? మతపరమైన శతృత్వంపై ద్వేషపూరిత అభిప్రాయాలు వ్యక్తం చేసి ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసిన పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అశి మునీర్‌పై అసాధారణ అభిమానం ప్రదర్శించి పుండు మీద కారం చల్లారు. ఈ విషయాన్ని కూడా మోడీ విస్మరించారు. ఈ లక్షణాలు దృఢమైన నాయకత్వానికి చిహ్నాలు కావని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
బలమైన ప్రధాని అంటే…
బలమైన ప్రధాని రాజకీయ లేదా వ్యక్తిగత పరిస్థితులు, పరిణామాలతో నిమిత్తం లేకుండా జాతి ప్రయోజనాల గురించి మాట్లాడతారు. తనపై తీవ్రమైన ఆరోపణలు వస్తే దర్యాప్తులను అడ్డుకోవడానికి న్యాయస్థానాలను ఆశ్రయించకుండా తన నిజాయితీపై వచ్చిన సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. అవసరమైతే ధైర్యంగా విచారణను కూడా ఎదుర్కొంటారు. బలమైన ప్రధాని వివిధ దేశాలలో పత్రికా సమావేశాలు నిర్వహిస్తారు. ప్రశ్నలు సంధించే విలేకరులను ఏమార్చకుండా నిజాయితీగా సమాధానాలు ఇస్తారు. అన్నింటినీ మించి అంతర్జాతీయ సంఘర్షణల విషయంలో దేశం యొక్క విశిష్టమైన నైతిక వైఖరిని గట్టిగా వినిపిస్తారు.
ఏం చేయాలంటే…
గాజా మారణహోమాన్ని నిరసిస్తూ ఐరాసలో అనేక పర్యాయాలు ఓటింగ్ జరిగినప్పుడు భారత్ ఊగిసలాట వైఖరిని ప్రదర్శించింది. తాజాగా ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై స్పష్టంగా అభిప్రాయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ సాగించిన జాతి విధ్వంసకాండను మన జ్ఞాపకాల నుంచి తొలగించలేమని గట్టిగా చెప్పాల్సి ఉంటుంది. గాజా పునర్నిర్మాణం, పాలస్తీనా భవిష్యత్తు, ఇజ్రాయిల్ దురాక్రమణపై మన వైఖరిని స్పష్టం చేయాలి. నెతన్యాహూపై ప్రేమ కురిపించే ఏ నాయకుడి శాంతి ప్రయత్నాలను గుడ్డిగా నమ్మకూడదు. భారత ప్రస్తుత నాయకత్వం గాంధీ, నెహ్రూ చూపిన మార్గాన్ని అనుసరించి ఉంటే శాంతి స్థాపనలో మనం కీలక పాత్ర పోషించి ఉండే వారం.
బీహార్‌లో ఏం జరుగుతోంది?
దేశంలోని అతి పెద్ద రాష్ట్రాలలో బీహార్ ఒకటి. అక్కడ శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ‘గుంతలు నిండిపోయాయి’ అని హోం మంత్రి అమిత్ షా ఇటీవల గర్వంగా ప్రకటించారు. అందుకు పదిహేను సంవత్సరాలు పట్టిందని కూడా ఆయన చెప్పారు. ఇక రాబోయే అయిదు సంవత్సరాలలో నిజమైన అభివృద్ధి ప్రక్రియ ప్రారంభమవుతుందని అన్నారు. ఇప్పటికే బీహార్ గ్రామాలకు మరుగుదొడ్లు, విద్యుత్, రహదారులు వంటి మౌలిక సదుపాయాలు కల్పించామని, రాబోయే కాలంలో వేగవంతమైన పారిశ్రామికీకరణ జరుగుతుందని అమిత్ తెలిపారు. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదు.
దర్భాంగాలో ఎయిమ్స్‌ను నిర్మిస్తామని 2015 బడ్జెట్‌లో ప్రకటించారు. కానీ పది సంవత్సరాలు గడిచినా పెద్దగా పురోగతి లేదు. దర్భాంగాలో ఎయిమ్స్ సిద్ధంగా ఉన్నదని మోడీ, అమిత్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. అటు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై ఆరోపణలు గుప్పిస్తున్నారు. మహిళలకు పది వేల రూపాయలు ఇవ్వడం గొప్ప విషయమని కొందరు చెబుతున్నారు. రాష్ట్రంలోని మహిళలు ఏడాదికి అంత మొత్తం కూడా సంపాదించలేరని వారు పరోక్షంగా అంగీకరించారు. రాష్ట్రంలో అసలు ఉనికిలోనే లేని ‘చొరబాటు’ సంక్షోభాన్ని మోడీ, షా లేవనెత్తుతున్నారు. రాహుల్ గాంధీకి అసలు అజెండా అంటూ ఏదీ లేదని, ఆయన చొరబాటుదారులతో ర్యాలీ నిర్వహించారని షా ఆరోపించారు.
కానీ రాహుల్ యాత్ర ‘ఓట్ చోరీ’ని ప్రముఖంగా ప్రస్తావించి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. విదేశీ గడ్డపై భారత్‌ను విమర్శించడమే రాహుల్ పని అంటూ బీజేపీ నేతలు ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. పాలకులను విమర్శించడం దేశ వ్యతిరేకతగా భావించడం దురదృష్టకరం. నిజానికి బీహార్‌లో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. అనేక సూచీలలో రాష్ట్రం బాగా వెనుకబడి ఉంది. ఉదాహరణకు శిశు మరణాల రేటును తీసుకుంటే 2023లో కేరళలో ప్రతి వెయ్యి జననాలకు ఐదుగురు చిన్నారులు మరణించారు. అదే బీహార్‌లో 38 మంది ప్రాణాలు విడిచారు. బీహార్‌లో తలసరి ఆదాయం రూ.43,000 అయితే కేరళలో రూ.2.6 లక్షలు.