దశబ్దాల తరబడి ప్రకటిస్తున్న వ్యవసాయ రాష్ట్ర ప్రణాళికను 2021-22 నుండి నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించడాన్ని నిషేధిం చింది. 09 ఫిబ్రవరి 2023న అధికారానికి వచ్చిన కాంగ్రెస్ 21 మాసాలు గడిచినప్పటికీ, ఈ ప్రభుత్వం కూడా వ్యవసాయ ప్రణాళికను ప్రకటించడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో, దేశంలో ప్రణాళికలు లేకుండానే వ్యవసాయాలు కొనసాగుతున్నాయి. రైతులు ప్రజల అవసరాల కోసం కాకుండా, మార్కెట్ ఆధారితంగా ధర వచ్చే పంటలకే ప్రధాన్యతనిచ్చి పండిస్తున్నారు. తెలంగాణలో వరి, పత్తికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. వరి ధాన్యాన్ని ఎఫ్‌సీఐ, పత్తిని సీసీఐ కొనుగోలు చేస్తుందన్న నమ్మకంతో ఆ పంటలకు ఉపయోగపడని భూముల్లో కూడా పంటలు వేస్తూ, అధిక పెట్టుబడులు పెడుతున్నారు.
ఈ సంవత్సరం 2025 వానాకాలం రాష్ట్రంలో సాధారణ సాగు విస్తీర్ణం 135.44 లక్షల ఎకరాలు కాగా, 127.13 లక్షల ఎకరాల్లో సెప్టెంబర్ 3 వరకు పంటలు సాగుచేశారు. అందులో వరి 69 లక్షల ఎకరాలు కాగా, పత్తి 46 లక్షల ఎకరాలు వేశారు. పప్పుధాన్యాలు 5.65 లక్షల ఎకరాలు, నూనె గింజలు 3.7 లక్షల ఎకరాలు మాత్రమే వేశారు. ముతకధాన్యాలు అనగా, రాగులు, సజ్జలు, కొర్రలు కొరతగా ఉండడం వల్ల విదేశాల నుంచి తెలంగాణకు ఉప ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నాము. ‘డయాబెటిక్” విటమిన్ లోపాలు 60 శాతం ప్రజలకు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. చిన్నపిల్లలతో సహా, అందరికీ ఈ విటమిన్‌లోపం ప్రభావితం చేస్తున్నది. వరి భోజనం వాడకుండా, తృణధాన్యాలను వాడాలని చెపుతున్నప్పటికీ, అందుకు తగిన ఉత్పత్తి రాష్ట్రంలో లేదు. అవకాశాలుండి కూడా, ఆ పంటలు వేయడం లేదు. మార్కెట్‌లో ధర, పంటల దిగుబడి తక్కువ వస్తుందని రైతులు అటువైపు మొగ్గు చూపడం లేదు. చివరకు నూనె గింజల పంటలు కూడా 5లక్షల ఎకరాల నుండి 3.7లక్షల ఎకరాలకు తగ్గింది. వంటనూనెలు కూడా దిగుమతి చేసుకుంటున్నాము. ఈ దిగుమతులను తగ్గించడానికి ప్రణాళికా బద్దమైన పంటలు పండిస్తే రైతులతో పాటు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. వ్యవసాయ కమిషనరేట్ గాని, వ్యవసాయ శాఖ గాని ప్రణాళికలపై దృష్టి పెట్టడం లేదు. భూసారాన్ని బట్టి పంటలు నిర్ణయించి ప్రతి రైతుకు నోట్ ఇవ్వాలి. కానీ ఆ పని చేయడంలేదు.
వ్యవసాయశాఖ నిర్లక్ష్యం
బియ్యం ఉత్పత్తి అవసరానికి మించి జరగడంతో రాష్ట్రం నుండే పిలిఫీన్స్ తదితర దేశాలకు 50వేల టన్నుల వరకు ఎగుమతి చేస్తున్నాము. వానాకాలం, యాసింగ్ రెండు పంటలు వరి పండించడం వల్ల భూసారం కూడా దెబ్బతింటున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రసాయనిక ఎరువులను వినియోగించకూడదని, సేంద్రీయ ఎరువులను, జీవన ఎరువులు వినియోగించాలని ప్రచారం చేస్తున్నారు. పీఎం ప్రమాణ్ పేరుతో ప్రధానమంత్రి రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించినచో, అందువల్ల మిగిలిన సబ్సిడీని రాష్ట్రాలకు, కేంద్రానికి సగం, సగం వాటా ఇస్తానని ప్రచారం చేస్తున్నారు. శాస్త్రీయ పద్ధతిలో ఎరువులు సకాలంలో వాడకపోవడం వల్ల పంటల ఉత్పత్తి, ఉత్పాదకత తగ్గుతున్నది. మునుగోడు లాంటి ప్రాంతంలో పత్తి 3 నుంచి 4 క్వింటాళ్లకు మించి దిగుమతి రాకున్నా, దశబ్దాలుగా పత్తిపంటనే వేస్తున్నారు. దీనికి తోడు, వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం వల్ల ఏటా ఐదారు లక్షల ఎకరాల్లో నాణ్యతలేని విత్తనాలు వేసి దిగబడులకు నష్టపోతున్నారు. గత రెండేండ్లల్లో 400 కల్తీ, నాణ్యతలేని విత్తన కేసులు విజిలెన్స్ శాఖ పట్టుకున్నప్పటికీ ఆ కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోవలేదు. వ్యవస్థీకృతంగా కల్తీ విత్తన వ్యాపారం సాగుతూనే ఉన్నది. రాష్ట్రంలో విత్తన చట్టం లేకపోవడం వల్ల విత్తనోత్పత్తి రైతులు కంపెనీల మోసాలకు నష్టపోయి, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నెల రోజుల క్రితం విత్తనోత్పత్తి రైతుల నుంచి తమ ఉత్పత్తులను రెండు క్వింటాళ్లకు మించి కొనుగోలుళ్లు చేయబోమని తగాదా పెట్టారు. ప్రస్తుత చట్ట ప్రకారం, విత్తనోత్పత్తి రైతు, కంపెనీ మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ ద్వారా ఒప్పందం చేసుకుని వ్యవసాయ కమిషనరేట్ దగ్గర ఆ పత్రాన్ని డిపాజిట్ చేయాలి. కానీ వ్యవసాయ అధికారులు కంపెనీలకు అనుకూలంగానే నిర్ణయాలు అమలు చేస్తున్నారు.
హార్టికల్చర్ పరిస్థితి
రాష్ట్రంలో గత దశాబ్ద కాలంగా పన్నెండు లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ పంటలు వేస్తున్నారు. వినియోగం ఉన్నప్పటికీ, పంటల విస్థీర్ణం గాని, ఉత్పిత్తిగాని హార్టికల్చర్ శాఖ పెంచడం లేదు. ఈ శాఖకు వ్యవసాయ శాఖ నుండి తక్కువ బడ్జెట్ కేటాయించడం వలన విస్తరణ జరగడంలేదు. హార్టికల్చర్ శాఖకు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఉన్నప్పటికీ, పరిశోధనలు గాని, పంటల విస్తరణ గాని జరగకపోవడం విచారకరం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నివేదిక ప్రకారం నెలకు ఒక వ్యక్తి 1.06 కిలోల ఉల్లిగడ్డ వాడాలి. అదేవిధంగా కనీసం కూరగాయలు అరకిలో చొప్పున, ఆకుకూరలు ముప్పావు కిలో చొప్పున నెలలో వాడాలి. మొత్తం రాష్ట్ర అవసరాలకు 5.60 టన్నుల కూరగాయల లోటు ఉన్నట్టు నివేదిక చెబుతున్నది. ఈ లోటును భర్తీ చేయడానికి కనీసం లక్ష ఎకరాల్లో కూరగాయల విస్తీర్ణాన్ని తక్షణమే పెంచాలి. అలాగే పండ్ల దిగుమతులు కూడా పెద్ద ఎత్తున సాగుతున్నాయి. సమశీతోష్ణంలో ఉన్న తెలంగాణలో అన్ని రకాల పండ్లు పండుతాయి. కివీ, స్టార్ ఫ్రూట్స్, డ్రాగన్ ఫ్రూట్స్, పనస, అనాస, జామ, మామిడి, అవకాడో, మకడానో, ద్రాక్ష, అరటి లాంటి పండ్లు ఇప్పటికే పండిస్తున్నారు. కానీ కావాల్సిన రైతులకు నర్సరీ మొక్కలు అందుబాటులో పెట్టడంలో హార్టికల్చర్ శాఖ విఫలమవుతున్నది. తెలంగాణలోని నల్గొండ జిల్లాలో గతంలో ఐదు లక్షల ఎకరాల్లో ఉన్న బత్తాయి ప్రస్తుతం రెండు లక్షల ఎకరాలకు తగ్గింది. మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వం జోక్యం లేకపోవడం వల్ల రైతులు నాగ్‌పూర్ వరకే పరిమితమయ్యారు. చివరకు తోటలు తీసివేస్తున్నారు. అత్యంత ప్రచారం చేసిన పామాయిల్ తోటలు కూడా ఒకవైపున ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నా, మరోవైపున రైతులు నిరాసక్తత వెలిబుచ్చుతున్నారు. ప్రభుత్వం చెప్పిన సబ్సిడీలు ఇవ్వక పోవడం, టన్నుకు నిర్ణయించిన 25వేల రూపాయలు లభించడం లేదు. కంపెనీ వ్యవహారం రైతులను ఇబ్బందులకు గురిచేయడంతో చాలా వరకు ఫామాయిల్ తోటలను కూడా తీసివేస్తున్నారు.
భూ వినియోగంలో అలసత్వం
తెలంగాణ రాష్ట్రంలో హార్టికల్చర్ పంటలకు అత్యంత మంచి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. కూరగాయలు, ఆకుకూరలు (కోతిమీర), పండ్లు, ఔషధ మొక్కలు, ప్లాంటేషన్ తోటలు పెంచే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో 1.63 కోట్ల ఎకరాల సాగు భూములుండగా, 1.35 కోట్ల ఎకరాలు మాత్రమే సాగుచేస్తున్నారు. మిగిలిన భూమి రియల్ ఎస్టేట్‌తో పాటు, ఫామ్‌హౌస్‌ల పేరుతో బీడ్లుగా మారింది. పారిశ్రామిక ప్రయోజనాల కోసం తీసుకున్న సెజ్ భూములు కూడా నిరుప యోగంగా పడి ఉన్నాయి. రాష్ట్రంలో భూ విధానాన్ని సక్రమంగా పాటించకపోవడం వల్లన సాగు భూమిని సాగేతర భూమిగా మార్చివేస్తున్నారు. ”నాలా” చట్టంను కూడా సక్రమంగా అమలు జరపడం లేదు. కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో భూ వినియోగంపై అత్యంత శ్రద్ధ చూపుతున్నారు. తెలంగాణలో మాత్రం భూవినియోగంలో అరాచకత్వం కొనసాగుతున్నది. హార్టికల్చర్‌తో పాటు, ముతక ధాన్యాల, పప్పులు, నూనెలకు మాత్రమే పరిమితంగా వ్యవసాయ ఉత్పత్తులు సాగుతున్నాయి. రాష్ట్ర అవసరాలకు దిగుమతులు చేసు కున్నప్పటికీ, కనీసం ఆ దిగుమతులను తగ్గించడానికి కూడా వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించకపోవడం దయనీయం. భూసారం, నీటి వసతులు, వాతావరణం అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ, వాటిని వినియోగించ డానికి ప్రణాళిక లేకపోవడం వల్ల మౌలిక వసతులు వృథా అవుతున్నాయి. కూరగాయల ఉత్పత్తిలో దేశంలో కోటి హెక్టార్లు కూరగాయలు వేయగా, చైనాలో 2.50 కోట్ల హెక్టార్లల్లో కూరగాయలు మాత్రమే పండిస్తున్నారు. ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తున్నారు.
అంతర్జాతీయ పరిస్థితిని పరిశీలించి రాష్ట్రంలోని మౌలిక వసతులను వినియోగించే విధంగా వ్యవసాయ, హార్టికల్చర్ ప్రణాళికలను రూపొందించి, రైతుల ఆదాయాన్ని మెరుగుపర్చడమే కాక, దిగుమతులను తగ్గించడంతో పాటు, ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా పెంచాలి. అందుకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించాలి.
సారంపల్లి మల్లారెడ్డి 9490098666