Monday, December 15, 2025
E-PAPER
Homeజిల్లాలు2029-ఎన్నికల్లో పోటీ చేస్తా: జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

2029-ఎన్నికల్లో పోటీ చేస్తా: జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: సామాజిక తెలంగాణయే తన లక్ష్యమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో తాము పోటీలో ఉంటామని తేల్చిచెప్పారు. సోమవారం ఆస్క్ కవిత హ్యాష్ ట్యాగ్ పై ట్విట్టర్ (ఎక్స్) లో పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె వివరంగా సమాధానాలు ఇచ్చారు. తెలంగాణ విషయంలో తన విజన్, జాగృతి భవిష్యత్ కార్యాచరణ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు సహా పలు ప్రశ్నలను నెటిజన్లు సంధించారు. వాటికి కవిత ఇచ్చిన సమాధానాలు. ట్విట్టర్ (ఎక్స్) పాలిటిక్స్ విభాగం లో ఆస్క్ కవిత ఇంటరాక్షన్ నంబర్ వన్ గా నిలిచింది.

2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం

సామాజిక తెలంగాణ తన ధ్యేయమని కవిత తెలిపారు. యువత, మహిళలు వారికి నచ్చిన రంగాల్లో అవకాశాలు పొందాలని…అందుకు వారిని ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. యువత, మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించేందుకు జాగృతి కృషి చేస్తుందన్నారు. కొత్త పార్టీకి సంబంధించి అడిగిన ప్రశ్నకు క్లారిటీ ఇచ్చారు. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు సూచించిన పేరునే పార్టీకి పెడుతామన్నారు. తెలంగాణ సాధికారిత సాధించాలంటే మెరుగైన, నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం ప్రజలకు అందాలని అన్నారు. తెలంగాణ లో తల్లితండ్రులు పిల్లల చదువుకోసం ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా ఉండే పరిస్థితి రావాలన్నారు. ఉద్యోగాలు, స్కిల్, భద్రత మూడింటిలో దేనికి ప్రాధాన్యం ఇస్తారని ప్రశ్నించగా… యువతకు ఉద్యోగాలు కల్పించటమే తన ప్రథమ ప్రాధాన్యమని చెప్పారు. ఉద్యోగాలతో పాటు వారికి భద్రత కూడా కల్పించాలన్నారు. సామాజిక న్యాయం కోసం జాగృతి పోరాటం కొనసాగుతుందన్నారు. క్రమంగా జాగృతిని చాలా బలంగా తయారు చేస్తామని చెప్పారు. త్వరలోనే జాగృతి మెంబర్ షిప్ డ్రైవ్ కూడా ప్రారంభిస్తామన్నారు. అదే విధంగా మేము వేసిన కమిటీల్లో ఇప్పటికే అన్ని వర్గాలకు అవకాశం ఇచ్చామని చెప్పారు.

కాంగ్రెస్ పాలన పై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి

రేవంత్ రెడ్డి పరిపాలన గురించి పలువురు నెటిజన్లు కవిత ను ప్రశ్నలు అడిగారు. రేవంత్ పాలన ఎలా ఉందన్న ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకపోవటంతో లక్షలాది మంది విద్యార్థులు చదువులకు దూరం కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం ఆడపిల్లల చదువుకు మరణశాసనంగా మారిందన్నారు. ఇక రైతుల ఆత్మహత్యలు చాలా బాధకరమని చెప్పారు. కాంగ్రెస్ వచ్చాక వరుసగా రైతుల ఆత్మహత్యలు కొనసాగటం బాధకరమన్నారు. ప్రభుత్వం చేతగాని, నిర్లక్ష్య వైఖరిని ఇది నిదర్శనమని చెప్పారు. ఇక ఫార్మా సిటీ కోసం తీసుకున్న భూముల్లో ఫ్యూచర్ సిటీ అంటూ హడావుడి చేయటంపై మండిపడ్డారు. తర్వలోనే అక్కడి రైతులకు మద్దతుగా పోరాటం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ వచ్చాక సింగరేణి సంస్థను తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎంఎస్ తో కలిసి సింగరేణి కోసం ప్రభుత్వం పై పోరాటం చేస్తామన్నారు. హైదరాబాద్ లో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవటంపై కవిత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెస్ట్ సిటీ పై పెట్టిన శ్రద్ధ, ఈస్ట్ సిటీ ని సిటీ అభివృద్ది చేయటంలో పెట్టలేదన్నారు.

చిరంజీవి అభిమానిని..

కవిత వ్యక్తిగత అభిరుచులకు సంబంధించి పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. రామ్ చరణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలని అడగగా…చాలా హంబుల్‌గా ఉండే వ్యక్తి. మంచి డ్యాన్సర్ అన్నారు. ఐతే తాను చిరంజీవి అభిమానిని అని…చిరంజీవి తర్వాతే రామ్ చరణ్ అన్నారు. చిన్నప్పుడు ఎర్రమంజిల్‌ గడిపిన క్షణాలు తనకు చాలా సంతోషానిచ్చాయని అన్నారు. ఐతే రాజకీయాలు కాకుండా ఏదైనా బిజినెస్ పై దృష్టి పెట్టాలంటూ ఓ నెటిజన్ సూచించగా… అందుకు కవిత కూల్‌గా అన్సర్ చేశారు. సోషల్ మీడియాలో ఇలాంటి చాలా నెగిటివీ ఉంటుందని దాన్ని పట్టించుకోకుండా మంచిగా ఆలోచించాలని సూచించారు.

ట్విట్టర్ ట్రెండింగ్‌లో టాప్

ఆస్క్ కవిత ఇంటరాక్షన్ గంటన్నర పాటు సాగింది. వందలాది మంది ట్విట్టర్ (ఎక్స్) లో ప్రశ్నలు అడిగారు .. కవిత వారికి సమాధానాలు ఇచ్చారు. సోమవారం ట్విట్టర్ (ఎక్స్) పాలిటిక్స్ విభాగంలో ఈ ఇంటరాక్షన్ నంబర్ వన్ గా నిలిచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -