విగ్రహం పెట్టడమే కాదు ఆయన ఆదర్శాలను పాటించాలి :
అసెంబ్లీలో బీజేపీకి ఉప ముఖ్యమంత్రి భట్టి డిమాండ్
రూ.197 లక్షల కోట్ల అప్పులో మోడీ చేసిందే రూ.140 లక్షల కోట్లు
రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా వికసిత్ భారత్ ఎలా సాధ్యం
ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చిన కేంద్రం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఆర్ఎస్ఎస్ను నిషేధిస్తారా?అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బీజేపీని ప్రశ్నించారు. గుజరాత్లో పటేల్ విగ్రహం పెట్టడం సంతోషకరమనీ, దాంతోపా టు ఆయన ఆదర్శాలను కూడా పాటించాలని డిమాండ్ చేశారు. ఆయన విగ్రహం పెడతారు తప్ప ఆయన చేసిన పనులను మాత్రం అమలు చేయబోరని అన్నారు. మంగళవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా భట్టి పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నీరుగార్చిందని విమర్శించారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మార్చిందన్నారు. ఇది పేద ప్రజలను చీటింగ్ చేయడం కాదా?అని ప్రశ్నించారు.
గాంధీని భౌతికంగా బతకనీయలేదనీ, ఆయన పేరు కూడా లేకుండా చేశారని అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించా లని డిమాండ్ చేశారు. 1950 నుంచి 2014 వరకు 13 మంది ప్రధాన మంత్రులు రూ.56.66 లక్షల కోట్ల అప్పు తెచ్చారని వివరించారు. 2014 నుంచి ఈ 12 ఏండ్లలో ప్రధాని మోడీ రూ.140 లక్షల కోట్ల అప్పు తెచ్చారని చెప్పారు. అంటే ఏడాదికి సగటున రూ.11 లక్షల కోట్లు అప్పు చేశారని వివరించారు. దీంతో భారత్ అప్పు ప్రస్తుతం రూ.197 లక్షల కోట్లకు చేరిందన్నారు. రాష్ట్రాల నుంచి పన్నులు వెళ్తేనే కేంద్రం వద్ద నిధులుంటాయని అన్నారు. తెలంగాణ నుంచి కేంద్రానికి రూపాయి వెళ్తే తిరిగి 30 పైసలు మాత్రమే వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అందరం కలిసి కేంద్రంపై పోరాడాలన్నారు. రూపాయిలో కర్నాటకకు 15 పైసలు, ఏపీకి 62 పైసలు, తమిళనాడుకు 26 పైసలు, కేరళకు 60 పైసలు వస్తున్నాయని వివరించారు. కానీ బీహార్‌కు రూ.6.69 పైసలు, ఉత్తరప్రదేశ్‌కు రూ.1.96 పైసలు, మధ్యప్రదేశ్‌కు రూ.1.87 పైసలు, రాజస్థాన్‌కు రూ.1.19 పైసలు వెళ్తున్నాయని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలు, తెలంగాణ ఏం పాపం చేశాయని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కేంద్రానికి రూపాయి కడితే రూపాయి తిరిగి ఇచ్చేలా ఒత్తిడి తేవాలని చెప్పారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా మోడీ ప్రకటించిన వికసిత్ భారత్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యమని మోడీ ప్రకటించారని గుర్తు చేశారు. అందులో భాగంగానే తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా నిర్దేశించుకున్నామని వివరించారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా, అవమానాలు చేసినా క్యూర్, ప్యూర్, రేర్ ప్రణాళికలతో తెలంగాణ అభివృద్ధి ఆగేది లేదన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతోపాటు రాజీవ్ యువ వికాసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేస్తామని చెప్పారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను ప్రస్తుతం నెలకు రూ.700 కోట్లు చెల్లిస్తున్నామని అన్నారు. ఇక నుంచి రూ.వెయ్యి కోట్లు చెల్లిస్తామని చెప్పారు. మహిళలకు వడ్డీలేని రుణాలు రూ.లక్ష కోట్లు ఇస్తామన్నారు. విద్యుత్ సబ్సిడీలు ఎత్తేయాలనీ, విద్యుత్ ఉత్పత్తికి ఎంత ఖర్చయితే అంత వసూలు చేయాలనీ, విద్యుత్ రేట్లు పెంచకుంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఇతర ప్రయోజనాలు మోడీ ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. విద్యుత్ సబ్సిడీలను ఎత్తేయబోమనీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను కొనసాగిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి పౌరునికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే తమ పరిపాలన లక్ష్యమని భట్టి విక్రమార్క చెప్పారు. అసెంబ్లీ రికార్డులను తిరగేస్తే పదేండ్లుగా ప్రతిపక్షంలో కూర్చున్న తమకు జరిగిన అవమానాలేంటో తెలుస్తుందన్నారు.
ప్రజాసమస్యలపై మాట్లాడేందుకు సరిగా మైకు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రతిపక్ష సభ్యులుగా తమను గౌరవించకున్నా అర్ధరాత్రి 2 గంటల వరకు ఓపికగా విన్నామే తప్ప వెల్‌లోకి వెళ్లడంగానీ, వాకౌట్ చేయడం గానీ చేయలేదని చెప్పారు. సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నకూ క్లారిఫికేషన్ ఇస్తామన్నా వినే ఓపిక లేకుండా బీఆర్ఎస్ సభ్యులు వెళ్లిపోయారనీ, ప్రజాస్వామ్యంపై వారికున్న గౌరవమిదని విమర్శించారు. బడ్జెట్ కాగితాలను చించి చెవిలో పెట్టుకుని వెళ్లిపోవడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబం అగాధంలోకి వెళ్లొద్దని దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.1.20 కోట్ల ప్రమాద బీమా కల్పించామని తెలిపారు. బిడ్డలు ఖాళీ కడుపుతో బడికి పోవద్దన్న ఆలోచనతో అల్పాహారం ప్రవేశపెట్టామన్నారు. ఇంటర్ పిల్లలకు మొట్టమొదటిసారి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయబోతున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ప్రమాద బీమా కల్పించబోతున్నామన్నారు. ఈ మంచి పథకాలు బీఆర్ఎస్ సభ్యులకు కనిపించడం లేదా? వారికి ఇవి ఇష్టం లేదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎల్పీ నేత సభకు ఎందుకు రావడంలేదని నిలదీశారు. సమస్త తెలంగాణ ప్రజల కోసం, వారి జీవితాల్లో మార్పు కోసం సభ ఉందన్నారు. అలవికాని హామీలిచ్చారని హరీశ్‌రావు అంటున్నారనీ, వాళ్లలాగా అలవికాని హామీలు మేం ఇవ్వలేదని చెప్పారు. అలా ఇస్తే బడ్జెట్ రూ.5 లక్షల కోట్లపైగా పెట్టాల్సి ఉండేదని అన్నారు. రైతులు, ప్రజా, మహిళా సంక్షేమ కోసం రూ.50 వేల కోట్లు కేటాయించామని వివరించారు. రైతు భరోసా కోసం రూ.18 వేల కోట్లు ఖర్చుచేశామనీ, తొమ్మిది రోజుల్లో రైతుల ఖాతాల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు వేసిన చరిత్ర తమదని గర్వంగా చెప్పారు.
రైతు భరోసా స్కీమ్‌ను ఎన్నికల స్కీమ్‌గా మార్చుకున్నది బీఆర్ఎస్ అని విమర్శించారు. హైదరాబాద్‌కు మణిహారంగా ఉన్న ఔటర్ రింగు రోడ్డును బీఆర్ఎస్ సర్కారు ఎన్నికల ముందు కుదవపెట్టింది వాస్తవం కాదా? వచ్చిన డబ్బులను రైతు బంధు పేరిట రైతుల ఖాతాల్లో జమచేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. వరి కాకుండా ఇతర పంటలు ఎవరైనా సాగు చేస్తే వారిని ప్రోత్సహించాలనే ఆలోచనతో తమ ప్రభుత్వం ఉందన్నారు. ఉచిత కరెంటు కాంగ్రెస్ పేటెంట్ అని చెప్పారు. రాష్ట్రంలో 29 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ అందించేందుకు రూ.14 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. శాసనమండలిలో కూడా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సభ్యులు లేవనెత్తిన అంశాలకు సమాధానమిచ్చారు. అనంతరం ఉభయసభలు బుధవారం ఉదయం పది గంటలకు వాయిదా పడ్డాయి.
పటేల్ స్ఫూర్తితో ఆర్ఎస్ఎస్ను నిషేధిస్తారా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



