– ఐపీఎల్18 రీ స్టార్ట్ నేటి నుంచి
– కోల్‌కతతో బెంగళూర్ ఢీ నేడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నేటి నుంచి పున ప్రారంభం కానుంది. భారత్, పాకిస్థాన్ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో మే 9న వాయిదా పడిన ఐపీఎల్18.. మళ్లీ నేటి నుంచి రీ స్టార్ట్‌కు సిద్ధమైంది. రీ షెడ్యూల్ తొలి మ్యాచ్‌లో బెంగళూర్, కోల్‌కత నేడు చిన్నస్వామి స్టేడియంలో తలపడనున్నాయి. వారం రోజుల విరామం, విదేశీ క్రికెటర్ల ప్రయాణ అలసటతో రీ స్టార్ట్‌లోనూ గతంలో చూపించిన జోరు కొనసాగుతుందా? లయ అందుకునేందుకు సమయం పడుతుందా? చూడాలి.
నవతెలంగాణ-బెంగళూర
ఐపీఎల్18 పున ప్రారంభానికి రంగం సిద్ధమైంది. వర్షం ప్రమాదం పొంచి ఉండగా నేడు బెంగళూర్‌లోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్, కోల్‌కత నైట్‌రైడర్స్ బరిలోకి దిగుతున్నాయి. వారం రోజుల వాయిదా ప్రభావం ఇరు జట్లపై కనిపిస్తుండగా.. ఐపీఎల్‌లో తొలి టైటిల్ కోసం ఎదురుచూస్తున్న బెంగళూర్‌కు ఈ దెబ్బ బలంగానే తగిలినట్టు అనిపిస్తోంది!. కీలక విదేశీ ఆటగాళ్లు గ్రూప్ దశ చివరి మూడు మ్యాచులకే అందుబాటులో ఉండటంతో… ప్లే ఆఫ్స్ బెర్త్ లాంఛనం చేసుకున్న రాయల్ చాలెంజర్స్‌కు ప్రతికూలంగా మారనుంది. శుక్రవారం బెంగళూర్‌లో భారీ వర్షం కురువగా.. నేడు కూడా వర్షం సూచనలు ఉన్నాయి. అధునాతన డ్రైనేజీ వ్యవస్థ చిన్నస్వామి మైదానం సొంతం. దీంతో వర్షం నిలిచిన నిమిషా వ్యవధిలోనే మ్యాచ్‌ను మొదలెట్టేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయి. ఐపీఎల్ గ్రూప్ దశలో 13 మ్యాచులు, ప్లే ఆఫ్స్‌లో నాలుగు మ్యాచులకు బీసీసీఐ రీ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫైనల్ జూన్ 3న జరుగనుండగా.. వేదికను ఖరారు చేయలేదు. క్వాలిఫయర్1, ఎలిమినేటర్ మ్యాచులకు హైదరాబాద్.. క్వాలిఫయర్2, ఫైనల్‌కు కోల్‌కతలు ఆతిథ్యం ఇచ్చేందుకు ఎదురు చూస్తుండగా.. బీసీసీఐ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
కోహ్లిపైనే ఫోకస్
ఐపీఎల్18 పున ప్రారంభం కానుండగా.. విరాట్ కోహ్లిపై ఫోకస్ కనిపిస్తోంది. అనూహ్యంగా టెస్టు క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన కోహ్లి నేడు చిన్నస్వామిలో బరిలోకి దిగనున్నాడు. ప్లే ఆఫ్స్ బెర్త్ లాంఛనం చేసుకున్న బెంగళూర్ ఇప్పుడు టాప్-2లో చోటు కోసం ప్రయత్నం చేస్తోంది. 11 మ్యాచుల్లో 8 విజయాలు సాధించిన ఆర్‌సీబీ.. చివరి మూడు మ్యాచుల్లోనూ విజయంపై కన్నేసింది. రజత్ పాటిదార్‌కు గాయం కావటంతో నేడు బెంగళూర్‌కు ఎవరు కెప్టెన్సీ వహించేది ప్రశ్నార్థకంగా ఉంది. మరోవైపు కోల్‌కత నైట్‌రైడర్స్ ప్లే ఆఫ్స్ రేసులో ఆశలు నిలుపుకునేందుకు విజయమే లక్ష్యంగా ఆడనుంది. కోల్‌కత 12 మ్యాచుల్లో ఐదు విజయాలు సాధించింది.
ఆ జోరు సాగేనా?
- Advertisement -
- Advertisement -