Wednesday, March 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఈసారైనా సరిహద్దులు ఖరారయ్యేనా..?

ఈసారైనా సరిహద్దులు ఖరారయ్యేనా..?

- Advertisement -

సర్వస్వం కోల్పోయాం.. న్యాయం చేయండి
సంబంధం లేనివ్యక్తులకు భూముల పట్టాలు
హద్దుల కోసం ఏండ్లుగా ఎదురుచూపు
భూముల రీసర్వేపై ఎస్సారెస్పీ ముంపు బాధితుల ఆశలు

నవతెలంగాణ – మల్లాపూర్‌
జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం నడికుడ గ్రామ ప్రజల గుండెల్లో ఏండ్లుగా రగులుతున్న భూవివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) నిర్మాణ సమయంలో ముంపునకు గురైన నిజామాబాద్‌ జిల్లా నడికుడ గ్రామస్తులు, ఇప్పటికీ తమకు కేటాయించిన భూముల విషయంలో న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఎన్నిసార్లు సర్వేలు చేసినా సరైన హద్దురాళ్లు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమవుతూనే ఉన్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం నుంచి మళ్లీ సర్వే ప్రారంభ మైనప్పటికీ, ‘ఈసారైనా మా గ్రామానికి స్పష్టమైన సరిహద్దులు ఖరారు అవుతాయా’ అన్న అనుమానంతో నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. నడికుడ గ్రామం ఐదు గ్రామాల సరిహద్దులను ఆనుకుని ఉండటంతో భూ హద్దుల విషయంలో గందరగోళం నెలకొంది. ఇతర గ్రామాలకు సరిహద్దులు ఏర్పాటు చేస్తే తమ గ్రామానికి కూడా హద్దురాళ్లు ఖరారు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

‘బై వన్‌, బై టూ’ల మాయలో భూములు
ముంపునకు గురైన నడికుడ గ్రామస్తులకు మల్లాపూర్‌ మండలంలో 1434 ఎకరాలు భూమి ఇచ్చారు. అందులో 250 ఎకరాల వరకు వేరేవారి పేరుపై ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామ రైతుల సర్వే నెంబర్లకు ఆనుకుని ‘బై వన్‌, బై టూ’ పేర్లతో ముంపునకు సంబంధం లేని వ్యక్తులకు పట్టాలు మంజూరు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేటాయింపులు ఏ ఆధారాలతో జరిగాయో అధికారులే స్పష్టత ఇవ్వాలని గ్రామ స్తులు కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యమా, లేక చేతివాటమా.. అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమందికి భూమి అసలే లేకపోయినా, రైతుబంధు వంటి పథకాల ప్రయోజనాలు అందుతున్నాయన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ రీ సర్వేలో అలాంటి అక్రమాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా, లేక మళ్లీ పాత పద్ధతే కొనసాగుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.

ప్రాజెక్టు కోసం త్యాగం..
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తమ ఇండ్లు, భూములు వదులుకుని బయటకు వచ్చిన ముంపు గ్రామాల ప్రజలు, న్యాయం కోసం ఇన్నేండ్లుగా వేచి చూస్తున్నారు. ఒకపక్క ప్రాజెక్టులో భాగస్వాములమన్న గర్వం ఉన్నప్పటికీ, మరోపక్క భూసమస్యలతో జీవనాధారం సంక్షోభంలో పడిందని వారు వాపోతున్నారు. ముంపు సమయంలో కేటాయించిన ఎకరాలన్నీ సక్రమంగా గ్రామ రైతులకు అప్పగించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్నోసార్లు అధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగినా శాశ్వత పరిష్కారం దొరకలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కూడా సమస్యకు ముగింపు లేకపోతే, ప్రజల్లో అధికారులపై నమ్మకం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది.

ముంపు బాధితులకు పూర్తి న్యాయం చేయాలి
నడికుడ గ్రామానికి ఇప్పటికైనా స్పష్టమైన సరిహద్దులు ఖరారు చేసి హద్దురాళ్లు శాశ్వతంగా ఏర్పాటు చేయాలి. సర్వే చేస్తామని ఎన్నిసార్లు వచ్చి వెళ్లిపోయినప్పటికీ సమస్య మాత్రం అలాగే ఉంటుంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో గ్రామ ప్రజలు చేసిన త్యాగాన్ని గుర్తుంచుకుని నిజమైన అర్హులకు భూములు ఇవ్వాలి. ‘బై వన్‌, బై టూ’ పేర్లతో సంబంధం లేని వ్యక్తులకు పట్టాలు మంజూరు చేశారన్న ఆరోపణలపై అధికారులు స్పష్టత ఇవ్వాలి. -ముద్దం రాజేందర్‌రెడ్డి, నడికుడ మాజీ సర్పంచ్‌

భూములు వేరే వారికి ఎలా ఇస్తారు?
మమ్మల్ని నమ్మబలికి భూములు సురక్షితంగా ఉంటాయని చెప్పి, తర్వాత ఇతరులకు పట్టాలు ఇచ్చారన్న వార్తలు కలవరపెడుతున్నాయ. ముంపు సమయంలో అన్నీ కోల్పోయి వచ్చిన రైతులకు ఇప్పటికైనా న్యాయం జరగాలి. రీ సర్వే పూర్తిగా పారదర్శకంగా ఉండి అసలైన అర్హులకు హక్కులు కల్పించాలి. -మీసాల చిన్నయ్య, గ్రామ రైతు

బై వన్‌.. బై టూలపై అనుమానాలు
నడికుడ గ్రామ సర్వే నెంబర్లకు ఆనుకుని ‘బై వన్‌, బై టూ’ల పేర్లతో భూములు నమోదు చేయడంపై తీవ్ర అనుమానాలు ఉన్నాయి. కొందరికి భూమి లేకపోయినా పథకాల డబ్బులు అందుతున్నాయన్న అంశాన్ని సమగ్రంగా విచారించాలి. ఈసారి రీ సర్వేలోనైనా నిజాలు బయటపెట్టి శాశ్వత పరిష్కారం ఇవ్వకపోతే రైతులు మళ్లీ ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి వస్తుంది.
-రైతు తలారి రాము

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -