కొనసాగుతున్న ఉద్రిక్తతలు..
లెబనాన్‌పై ఆగని ఇజ్రాయిల్ దాడులు
నేడు ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు
ఏర్పాట్లు జరుగుతున్నాయి : పాకిస్తాన్
ఒప్పందం కుదరకపోతే మళ్లీ దాడులు : ట్రంప్
యుద్ధమా? కాల్పుల విరమణా? ట్రంప్ తేల్చుకోవాలి : ఇరాన్
వాషింగ్టన్/టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు ఇస్లామాబాద్ వేదికగా శుక్రవారం జరగనున్నాయి. మరోపక్క లెబనాన్‌పై దాడులు కొనసాగుతున్నాయి. దీనిపై స్పష్టత వచ్చేవరకు హార్ముజ్ జలసంధిని తెరిచేది లేదని ఇరాన్ ప్రకటించింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిజమైన ఒప్పందం జరిగే వరకూ సైన్యం అక్కడే ఉంటుందని తెలిపారు. అయితే హిజ్బొల్లాను నిరాయుధీకరణ చేసేందుకు, ఇరు దేశాల మధ్య ”శాంతి సంబంధాలను” నెలకొల్పేందుకు లెబనాన్‌తో ప్రత్యక్ష చర్చలు ప్రారంభించాలని తన మంత్రివర్గాన్ని ఆదేశించినట్టు ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తెలిపారు.
”ఇజ్రాయిల్‌తో ప్రత్యక్ష చర్చలు జరపాలని లెబనాన్ పదేపదే అభ్యర్థనలు చేస్తుంది. దీంతో వీలైనంత త్వరగా లెబనాన్‌తో ప్రత్యక్ష చర్చలు ప్రారంభించాలని నేను నిన్న క్యాబినెట్‌ను ఆదేశించాను” అని ఆయన కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ‘అమెరికా కాల్పుల విరమణ లేదా ఇజ్రాయిల్ ద్వారా యుద్ధాన్ని కొనసాగించడమా అనేది తేల్చుకోవాలి’ అని అన్నారు. రెండూ సాధ్యం కాదు, లెబనాన్‌పై ఇజ్రాయిల్ మారణకాండను ప్రపంచం చూస్తుందని అరాగ్చీ సోషల్ మీడియా ఎక్స్‌లో గురువారం తెలిపారు. అలాగే ఈ దాడులు కొనసాగితే ఒప్పందం బలహీనపడి, ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదముందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ హెచ్చరించారు. అయితే ఇజ్రాయిల్ బరితెగింపు తీవ్ర ప్రభావం చూపుతుందని అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇరకాటంలో పాకిస్తాన్ ప్రధాని షరీఫ్..
కాల్పుల విరమణలో కీలకంగా వ్యవహరించామని ప్రచారం చేసుకుంటున్న పాకిస్తాన్ ఇజ్రాయిల్ దాడులతో ఇరకాటంలో పడింది. ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన అనంతరం పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ”ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, తమ మిత్రదేశాలతో కలిసి, లెబనాన్, ఇతర ప్రాంతాలతో సహా అన్నిచోట్లా తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది.” అని ప్రధాన మధ్యవర్తిగా వ్యవహరించిన ఆయన ఎక్స్‌లో తెలిపారు. అయితే దీనిపై అమెరికా, ఇజ్రాయిల్ భిన్నమైన వాదనలను వినిపిస్తున్నాయి.
ఇస్లామాబాద్‌లో ఇరాన్‌తో శనివారం జరిగే చర్చలకు అమెరికా నుండి అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ హాజరు కానున్నారు. శుక్రవారం హంగరీలోని బుడాపెస్ట్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ, ”యుద్ధ విరమణ ఒప్పందంలో లెబనాన్ కూడా ఉందని ఇరాన్ అనుకుంటుంది, కానీ అది నిజం కాదు” అని అన్నారు. దీంతో చర్చల్లో లెబనాన్‌పై దాడుల అంశం చేర్చాలా? వద్దా ? అనే సందిగ్ధం నెలకొంది. అంతేకాకుంగా పాక్‌లోని ఇరాన్ రాయబారి ఇస్లామాబాద్ చర్చలకు తమ దేశం నుంచి ప్రతినిధులు ఈ రాత్రికే చేరుకుంటారని ఎక్స్‌లో ప్రకటించి అనంతరం దాన్ని తొలగించారు. దీంతో అనేక చర్చలు జరుగుతాయా? లేదా? అనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.
ఖండించిన పలు దేశాలు.
”లెబనాన్ సార్వభౌమత్వాన్ని, భద్రతను ఉల్లంఘించకూడదు. పౌరుల ప్రాణాలకు, ఆస్తులకు భద్రతకు హామీ ఇవ్వాలి,” అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. సంయమనం పాటించాలని, ”ప్రాంతీయ పరిస్థితిని చల్లార్చాలని” బీజింగ్ కోరుకుంటుందని ఆమె తెలిపారు. అలాగే రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో ఫోన్‌లో మాట్లాడారని. ఈ ఒప్పందాలకు ప్రాంతీయ కోణం ఉందని, ప్రత్యేకించి ఇవి లెబనాన్‌కు వర్తిస్తాయని మాస్కో గట్టిగా విశ్వసిస్తోందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయిల్ దాడులపై యూరోపియన్ యూనియన్ అగ్రశ్రేణి దౌత్యవేత్త కాజా కల్లాస్ మాట్లాడుతూ, ”ఇజ్రాయిల్ చర్యలు అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి.
ఇరాన్ కాల్పుల విరమణ లెబనాన్‌కు కూడా వర్తించాలి” అని అన్నారు. అలాగే బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి యెవెట్ కూపర్, లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులు ”తీవ్రంగా నష్టం కలిగిస్తున్నాయని”, అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణను అస్థిరపరిచే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ”లెబనాన్‌ను కాల్పుల విరమణలో చేర్చాలని మేము కోరుకుంటున్నాము, లేకపోతే అది మొత్తం ప్రాంతాన్ని అస్థిరపరుస్తుంది” అని ఆమె అన్నారు. ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-నోయెల్ బారోట్, లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులను ”ఆమోదయోగ్యం కాదు” అని ఖండించారు. ఈ దాడులు అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణను బలహీనపరుస్తాయని హెచ్చరించారు. మరోవైపు ఇజ్రాయిల్ సైన్యం బీరుట్‌లో హిజ్బుల్లా చీఫ్ నయీం ఖాస్సేంకు సన్నిహిత సలహాదారు, మేనల్లుడు అలీ యూసుఫ్ హర్షిని హతమార్చినట్టు ప్రకటించింది.
ఒప్పందం కుదిరే వరకు సైన్యం అక్కడే : ట్రంప్
ఇరాన్‌కు సమీపంలో మోహరించిన అమెరికా బలగాలు ”నిజమైన ఒప్పందం” కుదిరే వరకు అక్కడే ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో ట్రంప్ ”అమెరికా నౌకలు, విమానాలు, సైనిక సిబ్బంది, అదనపు మందుగుండు సామగ్రి, ఆయుధాలు, ఇప్పటికే గణనీయంగా బలహీనపడిన శత్రువును నాశనం చేయడానికి అవసరమైన ప్రతిదీ, నిజమైన ఒప్పందం పూర్తిగా పాటించే వరకు ఇరాన్ లోపల, చుట్టూ మోహరించి ఉంటాయి” అని పేర్కొన్నారు. ఒప్పందం విఫలమయ్యే అవకాశం ”చాలా తక్కువ” అని ఆయన చెప్పినప్పటికీ, ఒప్పందం కుదరకపోతే ”పెద్ద, మెరుగైన, బలమైన” దాడులకు తిరిగి వెళ్తామని ట్రంప్ హెచ్చరించారు. ”ఈలోగా మన గొప్ప సైన్యం లోడ్ అవుతోంది, విశ్రాంతి తీసుకుంటోంది, నిజానికి, దాని తదుపరి విజయం కోసం ఎదురుచూస్తోంది!” అని ఆయన వెల్లడించారు.
కాల్పుల విరమణలో లెబనాన్ ఉందా? లేదా? : లెబనాన్ ప్రధాని
ఇరాన్ యుద్ధ విరమణలో లెబనాన్ ఉందో? లేదో? తేల్చాలని లెబనీస్ ప్రధాన మంత్రి నవాఫ్ సలాం పాకిస్తాన్ ప్రధానిని కోరారు. ఈ మేరకు ఆయన కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆయన షెహబాజ్ షరీఫ్‌కు ఫోన్ చేసి, కాల్పుల విరమణను సాధించడంలో ఇస్లామాబాద్ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారని, ”నిన్న జరిగిన ఇజ్రాయిల్ దాడులు పునరావృతం కాకుండా నిరోధించడానికి, కాల్పుల విరమణలో లెబనాన్ కూడా చేర్చాలని” కోరారని తెలిపింది.



