డిప్యూటీ సీఎం మల్లు, మంత్రి తుమ్మల కార్యాలయాలను ముట్టడించిన గిరిజన హాస్టల్ వర్కర్లు
జీతాలు తగ్గించే జీవోలు రద్దు చేయాలి : గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్ డైలీ వేజ్ వర్కర్స్ యూనియన్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బి.మధు
హాస్టల్ డైలీ వేజ్ వర్కర్స్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ముట్టడి
నవతెలంగాణ-ఖమ్మం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి గిరిజన హాస్టల్స్ వర్కర్ల జీతాలు తగ్గించడం మంత్రుల వైఫల్యమే అని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్ డైలీ వేజ్ వర్కర్స్ యూనియన్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బి.మధు, నాయకులు బి.నాగేశ్వరరావు, గిరిజన సంక్షేమ శాఖ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కార్యదర్శి కె.బ్రహ్మచారి అన్నారు. జీతాలు తగ్గించే జీవో 64ను, 527ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో హాస్టల్ డైలీ వేజ్ వర్కర్లు ఔట్‌సోర్సింగ్ వర్కర్లు భారీ ప్రదర్శన నిర్వహించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంప్ కార్యాలయాల ఎదుట మూడు గంటల పాటు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎక్కడైనా ప్రభుత్వం జీతాలు పెంచాలి గాని కాంగ్రెస్ ప్రభుత్వం జీతాలు తగ్గించడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. డైలీ వేజ్ వర్కర్లకు టైం స్కేల్ అమలు చేయాలని, ఔట్ సోర్సింగ్ వర్కర్లకు జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలంతా బతుకమ్మ, దసరా పండుగను జరుపుకుంటుంటే గిరిజన కార్మికులు పస్తులతో ఉండాల్సిన దుస్థితిని ప్రభుత్వం కల్పించిందని విమర్శించారు. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి గిరిజన కార్మికులను పస్తులతో ఉంచటం, జీతాలు తగ్గించడం ఏ రకమైన సామాజిక న్యాయమని ప్రశ్నించారు. కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకుండా 18 రోజులుగా సమ్మె జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండటం ప్రభుత్వ గిరిజన వ్యతిరేక వైఖరికి నిదర్శనమని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నెలనెలా లక్షల్లో జీతాలు తీసుకుంటూ 10 నెలలుగా గిరిజన కార్మికులను పస్తులు ఉంచటం రాష్ట్ర ప్రభుత్వానికి తగునా అని ప్రశ్నించారు.
30 సంవత్సరాలుగా వెట్టి చాకిరీ చేయించుకుంటూ కనీసమైన హక్కులు కల్పించకపోవడం రాజ్యాంగ వ్యతిరేక చర్య అని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. టైం స్కేలు అమలు చేయాలని, అప్పటివరకు జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గిరిజన కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో ఉన్న గిరిజన ఎమ్మెల్యేలంతా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు తాళ్లూరి కృష్ణ, డైలీ వేజ్ వర్కర్స్ యూనియన్ జేఏసీ నాయకులు మంగీలాల్ వర్కర్లు పాల్గొన్నారు.