– సిరీస్‌లో 2-2పై టీమ్ ఇండియా గురి
– ఇక్కడే లెక్క తేల్చాలనే తపనలో స్టోక్స్‌సేన
– నేటి నుంచి భారత్, ఇంగ్లాండ్ నాల్గో టెస్టు
– మధ్యాహ్నం 3.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీ రసవత్తర దశకు చేరుకుంది. 2-1తో ఆతిథ్య ఇంగ్లాండ్ పైచేయి సాధించినా.. నేడు మాంచెస్టర్‌లో లెక్క సమం చేయాలని భారత్ ఎదురుచూస్తోంది. ఇక్కడే సిరీస్ ఫలితాన్ని తేల్చాలని ఇంగ్లాండ్ భావిస్తుండగా.. గాయాల బెడదతో ఇబ్బంది పడుతున్న గిల్ సేన విజయంపై పట్టుదలగా కనిపిస్తోంది. భారత్, ఇంగ్లాండ్ నాల్గో టెస్టు మ్యాచ్ నేటి నుంచి ఆరంభం.
నవతెలంగాణ-మాంచెస్టర్
ఇంగ్లాండ్ పర్యటనలో తొలి మూడు టెస్టుల్లోనూ విజయాలు సాధించగల స్థితిలో నిలిచినా.. టీమ్ ఇండియా 1-2తో వెనుకంజలో కొనసాగుతుంది. 2014 నుంచి భారత్‌పై టెస్టు సిరీస్ విజయం సాధించని ఇంగ్లాండ్.. మాంచెస్టర్‌లో ఆ ఘనత సాధించాలని తపిస్తోంది. 2019 నుంచి మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్ ఒక్క టెస్టులోనూ ఓడిపోలేదు. ఇదే సమయంలో ఇక్కడ ఆడిన తొమ్మిది టెస్టుల్లో భారత్ ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేదు. ఓ వైపు చెత్త రికార్డు, మరోవైపు గాయాల బెడద వేధిస్తుండగా టెస్టు సిరీస్‌ను సమం చేసేందుకు మాంచెస్టర్‌లో గిల్‌సేన అన్ని అస్త్రాలు సిద్ధం చేస్తోంది. ఎడ్జ్‌బాస్టన్‌లో చరిత్రను తిరగరాసినట్టే.. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లోనూ అదరగొట్టాలని భారత్ సిద్ధమవుతోంది.
కూర్పు కుదిరేనా?
తుది జట్టు కూర్పు గిల్, గంభీర్‌కు తొలి సవాల్. ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ సహా అర్ష్‌దీప్‌లు అందుబాటులో లేరు. నం.3 బ్యాటర్ కరుణ్ నాయర్ రాణించటం లేదు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఫిట్‌నెస్‌పై అనుమానాలు తొలగలేదు. బెంచ్‌పై ఉన్న ప్రసిద్ కృష్ణ, సాయి సుదర్శన్‌లు ఆశావహంగా కనిపించటం లేదు. ఈ పరిస్థితుల్లో తుది జట్టు కూర్పు కత్తిమీద సాముగా మారింది. సాయి సుదర్శన్, కరుణ్ నాయర్‌లు ఇద్దరిలో ఒకరిని ఎంచుకుని.. పంత్ ఫిట్‌నెస్ దృష్ట్యా ధ్రువ్ జురెల్‌ను సైతం తుది జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. జురెల్ బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా ఈ పరిస్థితుల్లో రాణించగలడు. పేస్ విభాగంలో బుమ్రా, సిరాజ్‌లకు తోడుగా అన్షుల్ లేదా ప్రసిద్‌లలో ఒకరిని ఎంచుకోనున్నారు. జడేజా, వాషింగ్టన్‌లు స్పిన్ బాధ్యతలు పంచుకోనుండగా.. కుల్‌దీప్‌కు మొండిచేయి తప్పదు. బ్యాటింగ్ లైనప్‌లో యశస్వి జైస్వాల్ లార్డ్స్‌లో నిరాశపరిచాడు. రాహుల్, గిల్, పంత్‌లు నిలకడగా పరుగులు రాబడుతున్నారు. జైస్వాల్ సైతం జతకలిస్తే బ్యాటింగ్ బెంగ ఉండదు. మూడో స్థానంలో కరుణ్, సాయి సుదర్శన్‌లో ఎవరు ఆడినా ఇద్దరికీ ఇదే ఆఖరు అవకాశమని చెప్పవచ్చు. భారత్‌కు గిల్, బుమ్రా, పంత్, జడేజాలు కీలకం కానున్నారు.
జోరుమీదున్న ఇంగ్లాండ్
3-1తో ఇక్కడే సిరీస్‌ను పట్టేయాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. జోఫ్రా ఆర్చర్ రాకతో పేస్ బలం రెట్టింపు కాగా.. క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. 2017 తర్వాత తొలి టెస్టు ఆడనున్న లియాం డాసన్ స్పిన్ బాధ్యతలు తీసుకోనున్నాడు. జో రూట్, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్‌లు బ్యాటింగ్ లైనప్ భారం మోస్తుండగా.. జెమీ స్మిత్ ఆఖర్లో మ్యాచ్‌ను మలుపు తిప్పే ఇన్నింగ్స్‌లు నమోదు చేస్తున్నాడు. మాంచెస్టర్‌లో స్టోక్స్, రూట్, ఆర్చర్‌తో పాటు స్మిత్ ఇంగ్లాండ్‌కు కీలకం కానున్నాడు.
పిచ్, వాతావరణం
ఇంగ్లాండ్‌లో పేస్ అనుకూల పిచ్‌ల్లో మాంచెస్టర్ ఒకటి. తొలి రోజు ఇక్కడ పేస్‌కు గొప్ప అనుకూలత ఉంటుంది. మూడో రోజు నుంచి పిచ్ నుంచి టర్న్ లభిస్తుంది. 2, 4 రోజుల్లో వర్షం సూచనలు ఉన్నాయి. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం మెండుగా ఉంది. పేస్, సీమ్‌కు అనుకూలంగా షాట్లను ఎంపిక చేసుకుంటే బ్యాటర్లకు పరుగుల వేట సులభతరం కానుంది.
తుది జట్లు :
భారత్ (అంచనా) : యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్/ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జశ్‌ప్రీత్ బుమ్రా, అన్షుల్ కంబోజ్, మహ్మద్ సిరాజ్.
ఇంగ్లాండ్ : జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జెమీ స్మిత్ (వికెట్ కీపర్), లియాం డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్.
మాంచెస్టర్‌లో వికెట్ల వేట (2022 నుంచి)
పేసర్లు : 73 వికెట్లు
సగటు : 29.3
స్పిన్నర్లు : 15 వికెట్లు
సగటు : 51.1
మాంచెస్టర్‌లో టీమ్ ఇండియా
భారత్ ఆడిన టెస్టులు : 09
విజయాలు : 00
పరాజయాలు : 04
డ్రా : 05
సమం చేస్తారా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES