Tuesday, October 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజీఎస్టీ రేట్ల సవరణతో… రూ.5 వేల కోట్ల నష్టం

జీఎస్టీ రేట్ల సవరణతో… రూ.5 వేల కోట్ల నష్టం

- Advertisement -

పేదల మేలు కోసం విధాన నిర్ణయం
తగ్గుతున్న వస్తువుల ధరలు కచ్చితంగా ప్రదర్శించాలి
సమస్యలపై చర్చించేందుకు మేం ఎప్పుడూ సిద్ధమే : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జీఎస్టీ రేట్ల సవరణతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతీయేటా రూ.5 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అయినా పేద, మధ్యతరగతి, రైతు కుటుంబాల మేలు కోసం జీఎస్టీ రేషనలైజేషన్‌ చేపట్టాలంటూ సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గం ఒక విధాన నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. జీఎస్టీ రేట్ల సవరణ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో వ్యాపార వర్గాలతో డిప్యూటీ సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీ కౌన్సిల్‌ సభ్యుడిగా ప్రజల తరఫున నిర్ణయాలు తీసుకోవడంలో తాను ప్రముఖ పాత్ర పోషిస్తున్నానని తెలిపారు. జీఎస్టీ రేట్ల సవరణ కోట్లాది మందికి ఉపయోగపడే కార్యక్రమమని చెప్పారు. సవరించిన రేట్లతో పెద్ద సంఖ్యలో వస్తువులు తక్కువ ధరలకు అందుబాటులోకి వస్తున్నాయి.. ఆ ఫలాలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం, వ్యాపారులపై ఉందని తెలిపారు. జీఎస్టీలో సులభమైన విధానం తెచ్చేందుకు ఢిల్లీలో సుదీర్ఘ చర్చలు జరిగాయని వివరించారు.

బేషజాలకు పోకుండా తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం, వ్యాపారులు కలిసి నడిస్తేనే ప్రగతి సాధ్యమవుతుందని నొక్కి చెప్పారు.
పన్నుల విధానం సరళంగా, సక్రమంగా ఉండాలని డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా తెలిపారు. వ్యాపారులు మనసు కష్ట పెట్టుకోకుండా రేట్ల సవరణ ద్వారా తగ్గిన వస్తువుల ధరలను దుకాణాల ముందు ప్రదర్శించాలని సూచించారు. తద్వారా జీఎస్టీ రేట్ల రేషనలైజేషన్‌ తర్వాత, అంతకుముందు వివిధ వస్తువుల ధరలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలకు వివరించాలని కోరారు. రేట్ల సవరణతో వ్యవసాయ రంగానికి అవసరమైన పరికరాల ధరలు, ఆహార ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గుతాయని అన్నారు. సిమెంట్‌ జీఎస్టీ స్లాబ్‌ను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు, ఫలితంగా సిమెంటు ధరలు తగ్గుతాయని అన్నారు. ఫలితంగా నిర్మాణరంగంలో భారీ పెరుగుదలకు అవకాశాలు ఏర్పడతాయని డిప్యూటీ సీఎం వివరించారు. హైదరాబాద్‌ ఒక నగర రాజ్యాంగ మారుతోంది, రాష్ట్రవ్యాప్తంగా అర్బనైజేషన్‌ పెరుగు తోంది. ఇది మౌలిక వసతుల రంగంలో వ్యాపారాన్ని వ్యవస్థీకృతం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. తగ్గుతున్న సిమెంటు ధరల వివరాలను వ్యాపారులు తమ దుకాణాల ముందు ప్రదర్శించాలని కోరారు.

ఐటీసీ (ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌) అనేది వాస్తవంగా వ్యాపారం చేసే వారికి ఉపయోగకరం, అయితే అడ్డదారులు తొక్కే వారి వల్ల రాష్ట్ర ఆదాయానికి నష్టం చేకూరుతుందని ఆయన హెచ్చరించారు. నిబద్ధతతో స్వచ్ఛంగా వ్యాపారం చేసేవారు అడ్డదారులు తొక్కే వ్యాపారుల సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని విజ్ఞప్తి చేశారు. వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులున్నా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వ ద్వారాలు నిరంతరం తెరిచే ఉంటాయని డిప్యూటీ సీఎం భరోసానిచ్చారు. సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, కమిషనర్‌ హరిత తదితరులు పాల్గొన్నారు. బీమా, డెయిరీ, ఎలక్ట్రానిక్స్‌ రంగాలకు చెందిన వ్యాపారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -