Thursday, January 29, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిడబ్ల్యూహెచ్‌ఓ నుంచి వెనక్కి? ప్రజారోగ్యంపై అమెరికా దాడి!

డబ్ల్యూహెచ్‌ఓ నుంచి వెనక్కి? ప్రజారోగ్యంపై అమెరికా దాడి!

- Advertisement -

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)పై నెపం మోపుతూ అమెరికా వైదొలుగుతున్నట్టు ప్రకటించడం, ప్రజల ఆరోగ్యాన్ని కూడా వ్యాపారంగా, రాజకీయంగా మార్చే సామ్రాజ్యవాద విధానానికి ప్రతిరూపం. వ్యాధుల ముప్పు ప్రపంచాన్ని కుదిపేస్తున్న వేళ, అంతర్జాతీయ ప్రజారోగ్య బాధ్యతల నుంచి తప్పించుకోవడం ద్వారా తన కార్పొరేట్‌ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోందని ఈ నిర్ణయం బట్టబయలు చేస్తోంది. 1948లో ఐక్య రాజ్య సమితికి అనుబంధంగా ఏర్పడిన డబ్ల్యూహెచ్‌ఓ ఆరోగ్యరంగంలో అన్ని దేశాలను సమన్వయం చేసే ప్రయత్నం చేస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ప్రపంచ దేశాలు ఒక కీలక సత్యాన్ని గ్రహించాయి. అదేమంటే, వ్యాధులు దేశాల సరిహద్దులను గుర్తించవు. ఒక దేశంలో ప్రారంభమైన అంటువ్యాధి, కొద్ది కాలంలోనే ఇతర దేశాలకు వ్యాపించగలదు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు కలిసి పనిచేయాలనే ఆలోచన నుంచే డబ్ల్యూహెచ్‌ఓ జన్మించింది.

దీని ప్రధాన లక్ష్యం ప్రపంచ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం, మెరుగుపరచడం. అంటువ్యాధుల నియంత్రణ, టీకాల విస్తరణ, మాతృ,శిశు ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రత, ఆరోగ్య మార్గదర్శకాల తయారీ, అత్యవసర పరిస్థితుల్లో దేశాల మధ్య సమన్వయం-ఇవి డబ్ల్యూహెచ్‌ఓ కీలక బాధ్యతలు. పరిపూర్ణ సంస్థ కాదన్న విమర్శలున్నా, ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలో దీని అవసరం అనివార్యం. ఇలాంటి నేపథ్యంతో, అమెరికా డబ్ల్యూహెచ్‌ఓ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయితే ఈ ప్రకటనను చట్టపరంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. డబ్ల్యూహెచ్‌ఓ నిబంధనల ప్రకారం, ఏ దేశమైనా సంస్థ నుంచి బయటకు రావాలంటే కనీసం ఏడాది ముందుగా అధికారికంగా తెలియజేయాలి. ఆ కాలంలో సభ్యత్వం కొనసాగుతుంది. అలాగే పెండింగ్‌లో ఉన్న తప్పనిసరి నిధులు పూర్తిగా చెల్లించాలి. అందువల్ల, అమెరికా ఇప్పటికీ చట్టపరంగా డబ్ల్యూహెచ్‌ఓలో సభ్యదేశంగానే ఉంది. ప్రస్తుతం ఇది ఒక రాజకీయ ప్రకటనగా మాత్రమే పరిగణించబడుతోంది.

డబ్ల్యూహెచ్‌ఓపై అమెరికా చేస్తున్న ఆరోపణలు ప్రధానంగా మూడు అంశాలపై ఉన్నాయి-కోవిడ్‌ సమయంలో డబ్ల్యూహెచ్‌ఓ పాత్ర, చైనా ప్రభావం, నిధుల వ్యవస్థ. వీటిని వాస్తవాల ఆధారంగా పరిశీలిస్తే, అవి పూర్తిగా బలమైనవిగా కనిపించవు. ముందుగా డబ్ల్యూహెచ్‌ఓకి నిధులు ఎలా వస్తాయో చూడాలి. డబ్ల్యూహెచ్‌ఓ వార్షిక బడ్జెట్‌ సుమారు 6 నుంచి 7 బిలియన్‌ డాలర్లు. ఈ నిధులు ప్రధానంగా రెండుమార్గాల్లో వస్తాయి.మొదటిది తప్పనిసరి నిధులు. సభ్య దేశాలు తమ ఆర్థిక స్థితిని బట్టి నిర్ణీత మొత్తాన్ని తప్పనిసరిగా చెల్లించాలి. అయితే ఇవి డబ్ల్యూహెచ్‌ఓ మొత్తం బడ్జెట్‌లో కేవలం 20 నుంచి 25 శాతం మాత్రమే.రెండవది స్వచ్ఛంద నిధులు. దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, దాతలు ఇష్టపూర్వకంగా అందించే నిధులు ఇవి. డబ్ల్యూహెచ్‌ఓ బడ్జెట్‌లో ఎక్కువ భాగం ఈ నిధుల ద్వారానే వస్తుంది. అయితే, ఇవి సాధారణంగా నిర్దిష్ట కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది.

దేశాల వారీగా చూస్తే, అమెరికా గతంలో డబ్ల్యూహెచ్‌ఓకి అతిపెద్ద దాతగా ఉంది. మొత్తం బడ్జెట్‌లో సుమారు 15 నుంచి 18 శాతం వరకు అమెరికా నుంచే వచ్చేది. అయితే ఇందులో ఎక్కువ భాగం స్వచ్ఛంద నిధులే. చైనా గత దశాబ్దంలో తన తప్పనిసరి నిధుల వాటాను గణనీయంగా పెంచింది. ప్రస్తుతం ప్రధాన నిధులు అందించే దేశాల్లో చైనా ఒకటి. అమెరికా నిధులు తగ్గిన సమయంలో డబ్ల్యూహెచ్‌ఓకి ఆర్థిక సహకారం కొనసాగుతుందని చైనా ప్రకటించింది. జర్మనీ, బ్రిటన్‌, జపాన్‌, ఫ్రాన్స్‌ వంటి దేశాలు కూడా డబ్ల్యూహెచ్‌ఓకి స్థిరంగా నిధులు అందిస్తున్నాయి. భారత్‌ నిధుల పరంగా మధ్యస్థ స్థాయిలో ఉన్నప్పటికీ, టీకాలు, ఔషధాలు, సాంకేతిక సహకారం రూపంలో డబ్ల్యూహెచ్‌ఓకి కీలక మద్దతు ఇస్తోంది.ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. డబ్ల్యూహెచ్‌ఓ ఒకే దేశంపై ఆధారపడే సంస్థ కాదు. అనేక దేశాల సహకారంతో ఇది పనిచేస్తుంది. అందువల్ల ఒక దేశం వైదొలుగుతామని ప్రకటించినంత మాత్రాన దాని పని ఆగిపోదు.

ఇప్పుడు అమెరికా చేస్తున్న ఆరోపణల విషయానికి వస్తే- డబ్ల్యూహెచ్‌ఓ చైనాకు అనుకూలంగా వ్యవహరించిందన్న ఆరోపణ వాస్తవాలకు పూర్తిగా సరిపోదు. డబ్ల్యూహెచ్‌ఓ ఒక సమన్వయ సంస్థ మాత్రమే. దీనికి స్వతంత్రంగా దర్యాప్తు చేసే అధికారాలు లేవు. సభ్య దేశాలు అందించే సమాచారంపైనే ఆధారపడుతుంది. చైనా వైరస్‌కు సంబంధించిన జన్యుక్రమ సమాచారాన్ని తొలిదశలోనే ప్రపంచంతో పంచుకుంది. ఆ సమాచారం ఆధారంగానే ప్రపంచవ్యాప్తంగా పరీక్షలు, టీకాల పరిశోధన ప్రారంభమయ్యాయి. డబ్ల్యూహెచ్‌ఓ ఆ సమాచారాన్ని ఇతర దేశాలకు చేరవేయడం తన బాధ్యతగా చేసింది. డబ్ల్యూహెచ్‌ఓ కోవిడ్‌పై ఆలస్యంగా స్పందించిందన్న ఆరోపణ కూడా పూర్తిగా సరైనది కాదు. 2019 డిసెంబర్‌ చివర్లోనే డబ్ల్యూహెచఓ హెచ్చరికలు జారీ చేసింది. 2020 జనవరిలో అంతర్జాతీయ స్థాయి హెచ్చరికలు ప్రకటించింది. డబ్ల్యూహెచ్‌ఓ సూచనలిచ్చినా, వాటిని అమలు చేయడం ప్రతి దేశ ప్రభుత్వం బాధ్యత. అనేక దేశాలు ప్రారంభ దశలో ఈ హెచ్చరికలను పట్టించుకోలేదు.

డబ్ల్యూహెచ్‌ఓ స్వతంత్రంగా లేదన్న విమర్శ కూడా కొత్తది కాదు. సంస్థ ఒక ప్రపంచ ప్రభుత్వం కాదు. ఇది స్థాపన నుంచే సభ్య దేశాల ఆధారంగా పనిచేసేది. ఈ నిర్మాణాన్ని అంగీకరించి సభ్యత్వం తీసుకున్న దేశాలు, అదే నిర్మాణాన్ని ఇప్పుడు కారణంగా చూపడం తార్కికంగా నిలబడదు.ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ దేశాల స్పందన గమనించదగినది. యూరోప్‌, ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాల మెజారిటీ డబ్ల్యూహెచ్‌ఓకి బహిరంగ మద్దతు ప్రకటించాయి. ”లోపాలుంటే సరిదిద్దాలి, కానీ డబ్ల్యూహెచ్‌ఓని బలహీనపరచకూడదు” అన్న అభిప్రాయం స్పష్టంగా వినిపించింది. ఈ పరిస్థితి డబ్ల్యూహెచ్‌ఓ విషయంలో అమెరికా అంతర్జాతీయంగా ఒంటరిగా కనిపిస్తోందన్న సంకేతాన్ని ఇస్తోంది. ఈ సమయంలో చైనా పాత్ర ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచ ఆరోగ్యం ఒక దేశ సమస్య కాదు, ఇది సమిష్టి బాధ్యత అన్న దృక్పథంతో చైనా డబ్ల్యూహెచ్‌ఓకి ఆర్థిక, సాంకేతిక సహకారం అందిస్తోంది. వైద్య సామగ్రి, టీకాలు, ఔషధాల సరఫరా ద్వారా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకు మద్దతుగా నిలిచింది.డబ్ల్యూహెచ్‌ఓ చేసిన సానుకూల పాత్రను విస్మరించలేం.

స్మాల్‌పాక్స్‌ అనే వ్యాధి ప్రపంచం నుంచి పూర్తిగా నిర్మూలించబడింది. పోలియో నియంత్రణలో భారీ విజయం సాధించబడింది. కోట్లాది పిల్లలకు టీకాలు అందాయి. మాతృ-శిశు మరణాల రేటు అనేక దేశాల్లో గణనీయంగా తగ్గింది. చౌకైన అవసరమైన మందులు పేద దేశాలకు అందుబాటులోకి వచ్చాయి. అమెరికా డబ్లూహెచ్‌ఓ నుంచి వైదొలగే నిర్ణయం చివరికి అమెరికాకే నష్టంగా మారే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాధులపై ముందస్తు సమాచారం డబ్లూహెచ్‌ఓ ద్వారా లభిస్తుంది. ఆ వేదిక నుంచి దూరమైతే, కొత్త అంటువ్యాధుల గురించి సమయానికి తెలుసుకునే అవకాశం అమెరికాకు తగ్గుతుంది. అలాగే ప్రపంచ ఆరోగ్య విధానాలపై నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో ఆ దేశ ప్రభావం బలహీనపడుతుంది.

ప్రజారోగ్య సహకారం నుంచి తప్పుకోవడం వల్ల, అంతర్జాతీయంగా ఒంటరిగా కనిపించే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రపంచ ఆరోగ్యం పరస్పర ఆధారితమైన ఈ కాలంలో, ఈ నిర్ణయం అమెరికా ప్రజల ఆరోగ్య భద్రతకే సవాల్‌గా మారవచ్చు. ముగింపుగా చెప్పాలంటే, డబ్ల్యూహెచ్‌ఓకు లోపాలు ఉండవచ్చు. కానీ ఆ లోపాలకు పరిష్కారం సంస్థను వదిలిపెట్టడం కాదు. అమెరికా వైదొలుగుతున్నట్లు ప్రకటించినా, ప్రపంచ దేశాల మెజారిటీ డబ్ల్యూహెచ్‌ఓతోనే కొనసాగుతోంది. చైనా, యూరోప్‌ దేశాలు, భారత్‌ వంటి దేశాల మద్దతుతో డబ్ల్యూహెచ్‌ఓ ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలో కీలక పాత్రను కొనసాగిస్తోంది. ప్రపంచ ఆరోగ్యం రాజకీయ పోటీలకు బలికాకుండా, అంతర్జాతీయ సహకారంతోనే ముందుకు సాగాల్సిన అవసరం ఈ పరిణామాలు స్పష్టంగా చూపిస్తున్నాయి.

డాక్టర్‌ ఎం.రమాదేవి
9490300863

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -