omen is symbol of ShaktiÑ
Godμs first and beautiful creation
without whom no creation
is possibleÑ one who
gives and nurtures….’
‘ముచ్చట్లు పెట్టినా, మూతంతా ముడిచినా, ఎక్కేక్కి ఏడ్చినా, ఎగిరెగిరి నవ్వినా, ఉల్లాసమిచ్చినా, కల్లోలపరిచినా… మహిళలూ మీకు మీరే సాటి…. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.’
పొద్దున్న ఆరు గంటలకే ప్రియనేస్తం జయదేవ్ పంపిన ఎస్‌ఎంఎస్ చూడగానే, ప్రతి సంవత్సరం ఎక్కడున్నా, క్రమం తప్పకుండా గుర్తుపెట్టుకుని పెళ్లిరోజు, పుట్టినరోజులతో పాటు ఈ గ్రీటింగ్స్ కూడా చెప్పడం మరవని అతని క్రమశిక్షణా పద్ధతికి ‘హాట్సాఫ్’ అనిపించింది. ఆత్మీయనేస్తాన్ని గుర్తు తెచ్చుకోగానే ప్రశాంతమైన చిరునవ్వుతో పెదాలు విచ్చుకున్నాయి. మరుక్షణమే ఇలా ప్రతి ఒక్కరి పుట్టినరోజు, పెళ్లిరోజులను గుర్తుంచుకుని అందరికన్నా ముందు గ్రీట్ చేసే నాన్న ఇటీవలే జరిగిపోవడం గుర్తొచ్చి మనస్సు భాధగా మూలిగింది. కనురెప్పల నుండి అప్రయత్నంగా రెండు కన్నీటి బొట్లు కిందికి రాలాయి.
‘ఏంటోరు…. ఈ రోజంతా మీదేకదా… ఏమిటీ మూడీనెస్…. కమాన్ చీరప్.’ మనస్సు మరీ బాధతో మూడీ కాకుండా నా ఆలోచనలను బాధను గుర్తించి తేలికపరచడానికి నా భుజం చుట్టూ చేయి వేస్తూ…’శుభాకాంక్షలు’ చెప్పారు శ్రీవారు. ఇంతలో ఫోన్ మోగడంతో ఎత్తాను.
‘హలో… సునీ… ఈ రోజు ఆఫీస్‌కి మెడలోకి నువ్వేం ‘సెట్’ వేసుకొస్తున్నావు… చీరలన్నీ అందరూ ఒకేలా ఉండాలని ఒకే రకం కొనిపించావు… అలాగే మెడలో ‘సెట్’ కూడా నువ్వే కొనిస్తున్నావెమోనని……’ అల్లరిగా అంది భాను.
‘ఆశ..దోశ…. గాని అనవసరపు విషయాలకు సమయాన్ని, డబ్బును ఎందుకు దండగ చేస్తావు…ఏదో ఒకటి పెట్టుకో… వీలైతే ముత్యాల సెట్ బై….’ అంటూ కట్ చేశాను నవ్వుకుంటూ.
ప్రతి సంవత్సరం మహిళాదినోత్సవం రోజు అందరం తలా అయిదు వందలకు తక్కువ కాకుండా డబ్బులు జమ చేసి అనాధశరణాలయానికి ఏదైనా వస్తువు కొనివ్వడమో, అన్నదానం చేయడమో, వికలాంగులకు ఏదైనా ఉపయోగకర వస్తువు… అంటే వీల్ చైర్ లాంటిది కొనివ్వడమో…ఏదో ఒక మంచిపని చేస్తాం. ఇందులో మహిళలమే కాకుండా స్వచ్చందంగా విరాళాలివ్వడానికి ముందుకు వచ్చే మా ఆఫీసులోని ఇతర ఉద్యోగుల డబ్బులు కూడా కలుపుతాం. ఆఫీస్‌లో క్లబ్ తరఫున బ్రాంచ్ అందరికీ స్వీట్లు పంచుతారు. మేనేజర్ గారు అందరికీ మీటింగ్ పెట్టి, నాలుగు మాటలు మాట్లాడి, మహిళలందరికీ ఒక్కో బహుమతి ఇస్తారు.
మా ఆఫీస్‌లో రెండు వింగ్స్ ఉంటాయి. ఒకటి అడ్మినిస్ట్రేటివ్ వింగ్, ఒకటి మార్కెటింగ్ వింగ్. మేమంతా ఆఫీసులో పని చేసే అడ్మినిస్ట్రేషన్ వింగ్‌కి చెందుతాం. ఆ రోజంతా ఆఫీస్‌కి వచ్చే మార్కెటింగ్ వాళ్ళు, స్టాఫ్‌లోని తోటి ఉద్యోగులు చెప్పే శుభాకాంక్షలతో సరదాగా సంతోషంగా గడిచిపోతుంది.
ఈ రోజు కూడా మహిళా ఉద్యోగినులందరూ ప్రత్యేకంగా తయారయినందుకేమో… ఆఫీసంతా పండగ వాతావరణంలా ఉంది. నిజంగా ఎక్కడైనా ఆడవారితోనే అందం అని ఇందుకే అంటారేమో అనిపించింది. ఎక్కడికైనా మగవారు ఒక్కరే వెళితే మామూలుగా ఆహ్వానిస్తారు. కానీ అదే సతీసమేతంగా వెళితే ఆహ్వానించే విధం చాలా గొప్పగా ఉంటుంది.
యూనియన్ సెక్రెటరీ మహిళా ఉద్యోగినులందరికీ గులాబీలు ఇస్తూ గ్రీటింగ్స్ చెప్పారు. ఈలోగా మహిళలనందరినీ బ్రాంచి మేనేజర్ గారు ఛాంబర్‌లోకి పిలుస్తున్నారని పిలుపొచ్చింది. ప్రతీ సంవత్సరం అయితే లంచ్ సమయంలో స్టాఫ్ అందరికీ (ఆడ మగ) మీటింగ్ పెట్టి, ఒక నలుగురు ఆ రోజు ప్రాశస్య్రాన్ని గురించి మాట్లాడాక, శుభాకాంక్షలు తెలుపుతూ ఆడ వాళ్ళందరికీ బహుమతులు ఇచ్చి పంపేవారు. అయితే ఈసారి కొత్త మేనేజరు రావడంతో, ఆయన కేవలం మహిళా ఉద్యోగినులనే పిలిచి మీటింగ్ పెట్టారు.
ముందు అందరికీ శుభాకాంక్షలు తెలిపి, తానొక అయిదు నిమిషాలు మాట్లాడారు. అందరం తెలుపు ఎరుపు రంగుల మేళవింపుతో నున్న చీరలను ధరించి, బ్రాంచి మేనేజర్ ఛాంబర్‌లో ఆసీనులమయ్యేసరికి ఛాంబర్ నిండుగా అందంగా మెరిసిపోతుంది. కేవలం మా ఒక్క బ్రాంచిలోనే దాదాపు పదిహేనుమంది మహిళలు ఉన్నందున అందరూ మా బ్రాంచిని ‘లేడీస్ బ్రాంచ్’ అంటారు.
ఇంతలో అందరూ నన్ను మాట్లాడమని బలవంత పెట్టడంతో తప్పనిసరై లేచి నిలుచున్నాను. ‘గౌరవనీయులైన మేనేజర్ గారికి, నా తోటి ఉద్యోగినులందరికీ శుభాభివందనములు మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఏటా మార్చి 8 న జరుపుకునే ఈ దినోత్సవం మహిళలు పొరాడి సాధించుకున్న హక్కుల దినం. మార్చి 8, 1857 లో వందలాది మంది వస్త్రాలు నేసే మహిళా కార్మికులు గిట్టుబాటు ధర ఇవ్వాలనే డిమాండుతో న్యూయార్క్‌లో ప్రారంభించిన ఉద్యమం కాస్తా 1908, మార్చి 8 నాటికి వేలాది మంది మహిళలు నగరంలో రోడ్లమీదకు వచ్చి ‘ఓటుహక్కు’ ‘జీవించే హక్కు’ లు కల్పించాలని, పనిగంటలను తగ్గించాలనే డిమాండులను ముందుకు తెచ్చారు. 1910లో అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మహిళలే ప్రకటించారు.’
ఇలా మొదలైన నా ఉపన్యాసం, మహిళలు ఉద్యోగినులు కాకపోతే ఎలా, ఉద్యోగినులు కావడం వల్ల కూడా శారీరక మానసిక పరిస్థితులలో వ్యత్యాసాలు, వేధింపులు, లైగింక వేధింపులు, కుటుంబ భారం అన్నింటి మధ్యా ఎలా నలిగిపోతున్నది… ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు… ఇప్పటికీ జరిగే భ్రూణ హత్యలు, వివిధ న్యాయస్థానాల్లో, కార్యాలయాల్లో మగవారితో పోల్చితే చాలా తక్కువగా ఉన్న ఉద్యోగినుల సంఖ్య, సెకనుకు, నిమిషానికి ప్రతీ సంవత్సరం పెరిగిపోతున్న గహహింస, వరకట్న హత్యలు, వేధింపులు, అత్యాచారాలు, హత్యలు మొదలైన వారి గణాంకాలు, వాటిని అధిగమించడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు, అవి ఎంతవరకు సఫలీకతమైనదే వివరాలు…. ఇంకా మహిళలు మనుగడకై మరో పోరాటం జరపాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ ఉపన్యసించాను. అందరూ సంతప్తిగా చప్పట్లు కొట్టారు. మేనేజర్ కూడా చాలా చక్కగా మాట్లాడానని మెచ్చుకుని అందరికీ బహుమతులిచ్చారు. అయితే క్లబ్ వాళ్ళు స్వీట్లు పంచుతామన్నారని మేనేజర్ ఛాంబర్‌లో ఏమీ ఆఫర్ చేయలేదు. క్లబ్ వాళ్ళు అందరినీ (స్టాఫ్ అంతటినీ) పిలిచి మీటింగ్ పెట్టలేదని కోపంతో స్వీట్లు లోనికి పంపించలేదు. ఆఫీస్ పనివేళలు కావడం వల్ల ఇంకా ఆలస్యం అవుతుందని అందరం బయటకు వచ్చేశాం.
యూనియన్ సెక్రెటరీ, ‘కొత్త మేనేజర్ గారికి అందరినీ పిలిచి మీటింగ్ పెట్టాలని తెలియాదేమో… అయినా అడిగి పిలిపించుకోవడం ఎందుకు….’ అంటూ క్లబ్ సెక్రెటరీకి మిగతావారికి సర్ది చెప్పి స్వీట్లు ఇప్పించాడు.
స్టాఫ్‌లో కూడా మేనేజర్, అయిదుగురు ఆఫీసర్లు ప్రథమ తరగతిలోకి అనగా మొదటి తరగతిలోకి , మిగతా అసిస్టెంట్లందరూ మూడవ తరగతి కిందకు, స్వీపర్లు, అటెండర్లు నాలుగవ తరగతి కిందకు వస్తారు. మహిళలందరిలో నేను, శాంతి అనే ఆవిడ ఇద్దరమే ఆఫీసర్లం కాబట్టి మొదటి తరగతిలోకి వస్తాం. మిగతా మహిళలందరూ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు కాబట్టి మూడవ తరగతిలోకి వస్తారు. మార్కెటింగ్ వాళ్ళు రెండో తరగతి కిందకు వస్తారు.
మేనేజర్ మార్కెటింగ్‌లో ఉన్న మహిళలందరికి కూడా మూడు గంటలకు మీటింగ్ పెట్టి స్టాఫ్‌కి ఇచ్చినట్లే బహుమతులిచ్చారు. అయితే అక్కడివరకయితే ఏ గొడవా లేకపోయేది. కానీ వాళ్లందరికి బాదం మిల్క్ బాటిళ్లు తెప్పించారు. అదీ స్టాఫ్ అందరి ముందే మేనేజర్ ఛాంబర్‌లో మాలాగే మీటింగ్ పెట్టి మరీ. నిజానికి మార్కెటింగ్‌లోని మహిళలందరూ ఏజెంట్లు. కనీసం రెండవ తరగతి కిందకు కూడా రారు. రెండవతరగతి కింద ఉండే వికాసాధికారులకు వీళ్ళు ఏజెంట్‌లు. ఈ విషయం అందరి కంటా పడింది. మీటింగ్ అయిపోయాక మార్కెటింగ్ మహిళలందరూ వెళ్ళిపోయారు. ఈ విషయం అసలు నేను పని ఒత్తిడిలో గమనించలేదు.
సాయంత్రం అయిదు గంటలకు నా పనిలో బిజీగా ఉండగా వనమాల మేడమ్ నా దగ్గరకొచ్చి ‘మేడమ్ ..అర్జెంట్‌గా ఒకసారి ఇలా రండి త్వరగా….’ అంటూ హడావుడిగా వెళ్లిపోయింది. ఏమిటో ననుకుంటూ ఆమె సీటు దగ్గరకొచ్చాను. అప్పటికే ఆ సీటు చుట్టూ ఆడవాళ్ళంతా మూగి ఉన్నారు. ఆమె సీట్, బ్రాంచిమేనేజర్ ఛాంబర్ బయట కుడి వైపున మూడోసీట్. అప్పటికే ‘మేడమ్ వస్తున్నారా…’ అంటూ అక్కడినుండే, నాలాగే పనిలో ఉన్న ఆఫీసర్ శాంతిని పిలిచింది. ‘ఏమైంది’ అని నేను అడుగుతుండగానే, ‘బ్రాంచిమేనేజర్ దగ్గరకు వేళదామ్’ అంటూ శాంతి మేడమ్ రాగానే ఛాంబర్ వైపు నడిచింది. ఆమెతో పాటే ఉన్న మిగతా అందరమూ అప్పటికే ఛాంబర్ వరకి వచ్చేసాం. నాకు విషయం అర్ధం కాలేదు. పొద్దున్న మేనేజర్ బహుమతులు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పడానికేమో… కాస్సేపయితే మిగతా వాళ్ళంతా వెళ్లిపోతారని కాబోలు హడావుడి..’ అనుకున్నాను. అయినా పరిస్థితి అదోలా అనిపించి ‘ఏమిటి’ అంటూ పక్కనున్న భానుని అడిగాను. ఈలోగా చాంబర్లోకి వచ్చేశాం. అందుకే తానేం మాట్లాడలేదు.
మేనేజర్ అందరినీ చూస్తూ నవ్వుతూ ‘రండి… రండి.. కూర్చోండి…’ అంటూ ఆహ్వానించారు.
‘సర్… మేం కూర్చోవడానికి రాలేదు. ఒక విషయం చెప్పి వెళ్లడానికి వచ్చాం. పొద్దున్న మీరు అందరినీ ఛాంబర్‌లోనికి పిల్చి బహుమతులిచ్చారు. చాలా థాంక్స్… అయితే ఛాంబర్‌లోకి ఎవరు వచ్చినా కనీసం ‘టీ’ నో ‘కాఫీ’ నో ఆఫర్ చేయడం కనీస మర్యాద. మీరు మాకేం ఆఫర్ చేయలేదు పొద్దున.. అయినా మేం దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇంతకుముందు మార్కెటింగ్ లేడీస్ అందరికీ మీటింగ్ పెట్టి బహుమతులిచ్చి, వారికి మాత్రం బాదం మిల్క్ ఆఫర్ చేశారు. ఇలా మమ్మల్ని అవమానపరిచినందుకు మేం చాలా హర్ట్ అయ్యాం…’ అంది వనమాల సూటిగా.
విస్తుపోయిన మేనేజర్ తేరుకుంటూ ‘మీరు ఎందుకు, ఎప్పుడూ అలా నెగెటివ్‌గా ఆలోచిస్తారు… పాజిటీవ్‌గా ఎందుకు ఆలోచించరు. పొద్దున్న క్లబ్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారని వూరుకున్నాను. అది కొంచెం ఆలస్యమయింది. ఇప్పుడు కూడా మార్కెటింగ్ వాళ్ళకి నేనేమీ ఆఫర్ చేయలేదు. అసిస్టెంట్ మేనేజర్ చూసి ఆయనే లోపలికి డ్రింకులు పంపించారు’ అంటూ ఇంకా అనబోతుంటే…
‘మీకు మార్కెటింగ్ వాళ్ళు ఎక్కువ… మేము తక్కువ అయ్యామా…? కాఫీలు, టీలు, డ్రింకులు మేం తాగలేమని కాదు… కానీ మీరు ఆఫర్ చేయకుండా మమ్మల్ని అవమానపరిచినందుకు మేం బాధపడ్డాం. ఇంతకు ముందెన్నడూ ఇలా జరగలేదు. ఆ విషయమే చెప్పడానికి వచ్చాం’ అని చెప్పి మరేం వినకుండా బయటకు వచ్చి ఎవరి బాగ్ తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్లినంతసేపు తల కిందకు వంచుకుని, కేవలం గుమ్మం దగ్గరే ఉన్న నేను, శాంతి మేడమ్ అవాక్కై, వారితో పాటే మౌనంగా వెనుదిరిగాం.
అయితే ఇలా వచ్చి సీట్లో కూర్చున్నామో లేదో… గోడక్కొట్టిన బంతిలా వెంటనే ఛాంబర్‌కి రమ్మని నాకు, శాంతి మేడమ్‌కి పిలుపొచ్చింది.
వెళ్ళి కూర్చోగానే ‘అసలు మీరు వారితో కలిసి లోపలికి ఎందుకు రావాల్సి వచ్చింది. మీరు క్లాస్ త్రీ అనుకుంటున్నారా…’ అన్నారు నిప్పులు చెరుగుతున్న కళ్ళతో గుడ్లురుముతూ మేనేజర్.
నిర్ఘాంతపోయిన మేం ‘అసలు విషయం ఏమిటో వాళ్ళు మాకు చెప్పలేదు…’ అంటుండగానే, ‘అసలు విషయం తెలియకుండా రావడం ఇంకా పెద్ద తప్పు … అస్సలు మీరు ఆఫీసర్లలా ప్రవర్తించకుండా క్లాస్ త్రీ లా వ్యవహరిస్తున్నారు. ఇలా ఇప్పుడు జరిగింది గాని మరోసారి జరగకూడదు. నో మోర్ ఎక్స్‌ప్లనేషన్స్. ఇక మీరు వెళ్లొచ్చు’ అన్నారు వార్నింగ్ ఇస్తూ కటువుగా.
హతాశులమయిన మేం కనురెప్పల కింద కన్నీళ్లను తోసేస్తూ వెనుదిరిగాం. మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. వర్క్ చేయబుద్ధి కావడం లేదు.. ఒకవేళ విషయం తెలిసి ‘మేము ఛాంబర్ లోకి రాము’ అంటే తెల్లవారి నుండి రోజువారీ పనులు ఆఫీసులో చేయగలమా? ఎందుకంటే ఆఫీస్‌కి వస్తే మేం పనులు చేయించుకోవలసింది వారితోనే. లోనికి వెళ్లకుండా ఉంటే ‘మరి పొద్దున్న మాత్రం మాతో లోపలికి ఎందుకొచ్చారు. మహిళలు అనే కదా… అప్పుడు ఆఫీసరని వూర్కున్నారా?’ అంటారు. మింగమంటే కప్పకు కోపం, కక్కమంటే పాముకు కోపం లా, త్రిశంకు స్వర్గంలా ఉంది మా పరిస్థితి.
పొద్దున్న అంతగా మహిళలు ధైర్యంగా సమస్యలు ముందుకొచ్చి చెప్పుకుని, పరిష్కరించుకోగలగాలి అని ఢంకా భజాయించి చెప్పిన నేను, ఈ విషయాన్ని లోపల మేనేజర్ ముందర ఎందుకు వాదించలేకపోతున్నాను. అంటే ఉపన్యాసాలన్నీ కేవలం వేదికపై చెప్పడానికేనా, ఇందులో మేం చేసిన తప్పేంటి? ఆఫీసర్లు కావడమా…? ఆడవాళ్ళుగా పుట్టడమా..? ఏమీ అర్ధం కాలేదు నాకు. అందుకే గుమ్మం వరకు వచ్చిన నేను వెనుదిరిగాను.
‘excuse mee sir… ఒక్క నిమిషం … అందులో మా ప్రమేయం లేదు. అయినా వారితో రాక తప్పదు. ఎందుకంటే పొద్దున వాళ్ళతో కలిసి వచ్చినప్పుడు మేం ఆఫీసర్లమన్న విషయం గుర్తులేదా అంటారు… పైగా ప్రతీరోజు మేం వాళ్ళతో కలిసి వర్క్ చేయించుకోవాలి. అయినా మన తరపున తప్పేం లేదు. అదే విషయం అందరికీ చెబితే ఇది ఉద్దేశపూర్వకంగా చేసినది కాక, కేవలం కమ్యూనికేషన్ గాప్ వల్ల జరిగిన తప్పు అని తెలుస్తుంది. ఎంత తొందరగా కోపం వచ్చినా విషయం అర్ధం చేసుకుని క్షమించడంలో వాళ్ళను మించిన వారు లేరు సర్. దయ చేసి అర్ధం చేసుకోండి… ఇప్పుడే వారికి ఎస్‌ఎంఎస్ పెట్టినా, లేదా రేపు వారిని పిలిచి చెప్పినా అర్ధం చేసుకుంటారు సర్’ అన్నాను. కనీసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజయినా ఆడవారి (శాంతి, నేను) మనస్సు బాధపెట్టకూడని, కనీసం రేపు అడుగుదామనయినా మేనేజర్ ఆలోచించలేదేమిటి అనుకుంటూ…
నిజానికి ఆ మేనేజర్ అంటే సింహస్వప్నం. మాట్లాడడానికి భయపడతారు. కానీ నేను ఒక్కటే అనుకున్నాను… రామకష్ణ పరమహంస దగ్గరకు, ఒక తల్లి తన పిల్లవాడు రోజూ స్వీట్లు తింటున్నాడని, స్వామి చెబితే మారతాడని తీసుకొచ్చానని అంటే, రామకష్ణ పరమహంస ఒక వారం రోజులు ఏమీ చెప్పక ఆ వారం రోజులు తనకు వచ్చిన స్వీట్లు అన్నీ అందరికీ పంచి ఆ తర్వాత రోజు ఆ అబ్బాయికి స్వీట్లు రోజూ తికూడదని చెప్పారట. ఆ తల్లి ఈ మాటే వచ్చిన రోజే చెబితే బావుండేది కదా, ఇన్ని రోజుల తర్వాత ఎందుకు చెబుతున్నారని అడిగిందట. అప్పుడాయన, ‘అమ్మా.. ఏదైనా ఒకరికి చెప్పాలంటే ముందు నేను ఆచరించాలి కదా.. నిజానికి నేను అందరు తెచ్చిన స్వీట్లు రోజు తింటున్నాను కదా.. అందుకే ముందు నేను మానేశాక అంటే నేను ఆచరించాకే మరొకరికి చెప్పే అర్హత సాధించుకుంటాను. అందుకే ఈ వారం మానేసి ఆ విషయం నేను దవపరుచుకున్నాకే ఇలా చెప్పాను’ అన్నారట. నాకు నేను ఉపన్యాసమయితే ఇచ్చాను… మహిళలు పోరాడాలి, తమ సమస్యలకు ఎవరో వచ్చి పోరాడరు, తామే పరిష్కరించుకోవాలి అని ఆత్మవిశ్వాసం నింపి, ఇప్పుడు అదే సమస్య నాకు ఎదురైతే, నేను ప్రతిఘటించకుండా ఉండలేక పోయాను. మహిళలమైన మన అభిరుచి మనం రగిలించకపొతే, మరొకరెవరో మన గురించి ఎందుకు రగిలిస్తారు… ఆరోజు క్లారా జట్కిన్, రోజా లక్సన్‌బర్గ్ లాంటి మహిళామణులు రగిలించిన పోరాటస్ఫూర్తే కదా నేటి మహిళా దినోత్సవం. అందుకే ఆ మాటలు అన్నాను. ముందు మేనేజర్ హతాశుడైనా, అప్పటికే ఆయన, పాపం… ‘వాళ్ళపై కోపం వీళ్ళపై తీశాను’ అనుకున్నారేమో, తర్వాత, let us hope the best…. Take the opportunity to prove yourself..
అంటూ తల పంకించారు.
తర్వాత రోజు అందరికీ విషయం చెప్పి మేనేజర్ ఛాంబర్‌లో అందరితో కల్సి పార్టీ చేసుకుని మేమంతా ఐక్యంగా ఉంటాం అని నిరూపించుకున్నాం.
– నామని సుజనాదేవి, 7799305575



