ప్రముఖ అడ్వకేట్ రమాదేవి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లకిë
నవతెలంగాణ-సూర్యాపేట
మహిళా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, వేధింపులు, లైంగికదాడులు, హింసను అరికట్టాలని ప్రముఖ అడ్వకేట్ రమాదేవి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లకిë ప్రభుత్వాన్ని కోరారు. ఐద్వా 14వ జాతీయ మహాసభ సందర్భంగా బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాయిగౌతమి జూనియర్ కళాశాలలో ”మహిళలు -చట్టాలు- అమలు” అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. విద్యార్థినులకు పలు చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మహిళలు ప్రతిచోటా వివక్షకు, అన్యాయానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పేరుకే చట్టాలు ఉన్నాయని, అవి నిష్పక్షపాతంగా అమలు కావడం లేదని అన్నారు. స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం కొరవడిందని, మహిళల హక్కులు కాలరాయబడుతున్నాయని తెలిపారు. రోజురోజుకూ బాల్యవివాహాలు, వరకట్న వేధింపులు, గృహహింస, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐద్వా ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేసి చట్టాలను సాధించుకున్నా అవి సక్రమంగా అమలు కావడం లేదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మహిళలను నాలుగు గోడలకు పరిమితం చేస్తూ తిరోగమన విధానాలను ముందుకు తెస్తోందని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ఈ పదేండ్ల కాలంలో మహిళలు, మైనార్టీలు, దళితులు, అట్టడుగు వర్గాలకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. మేధోవికాసాన్ని, ప్రజాస్వామ్యాన్ని, మహిళలకు ఉన్నత చదువులను మనువాదం సహించలేక పోతుందన్నారు. వేధింపులు, లైంగికదాడుల నిందితులకే కేంద్ర ప్రభుత్వం అండగా నిలవడం సభ్యసమాజాన్ని నివ్వెరపరుస్తుందన్నారు. మనువాదం మహిళలకు స్వేచ్ఛ ఉండకూడదని, బానిసలుగా బతకాలని శాసిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్త్రీలు, బాలికలపై హింస, లైంగికదాడులు ఆగాలంటే కఠినమైన చట్టాలతోపాటు సామాజిక వ్యవస్థలో మార్పు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షప్రధాన కార్యదర్శులు వెంకటచంద్ర, ఎల్గూరు జ్యోతి, రాష్ట్ర కమిటీ సభ్యులు మేకనబోయిన సైదమ్మ, జూలకంటి విజయలకిë, నాయకులు షేక్‌ఖాజాబీ, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనియాకుల శ్రీకాంత్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.
మహిళా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



