బరిలో ఎనిమిది మేటి జట్లు
ఆరంభ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక ఢీ
నవతెలంగాణ-గువహటి :
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ నేటి నుంచి ఆరంభం కానుంది. ప్రపంచ మేటి ఎనిమిది జట్లు పోటీపడుతున్న మెగా టోర్నమెంట్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. నేడు గుహవటిలో ఆతిథ్య జట్లు భారత్, శ్రీలంక పోరుతో టోర్నమెంట్ ఆరంభం కానుంది. 1978, 1997, 2013లో మహిళల వన్డే వరల్డ్‌కప్‌కు వేదికగా నిలిచిన భారత్ నాల్గోసారి ఉమెన్స్ ప్రపంచకప్‌ను నిర్వహిస్తుంది. మహిళల వన్డే వరల్డ్‌కప్‌కు ఆతిథ్యం ఇవ్వటం శ్రీలంకకు ఇదే ప్రథమం. 34 రోజుల పాటు 31 మ్యాచులు షెడ్యూల్ చేయగా.. అక్టోబర్ 29, 30న సెమీఫైనల్స్, నవంబర్ 2న ఫైనల్ జరుగుతుంది. పాకిస్తాన్ మ్యాచులు అన్నీ శ్రీలంకలోనే షెడ్యూల్ చేశారు. పాకిస్తాన్ సెమీస్‌కు చేరినా, ఫైనల్లో అడుగుపెట్టినా.. ఆ మ్యాచ్‌లు కొలంబోలో నిర్వహిస్తారు. ఆతిథ్య భారత్ సహా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికాలు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి.
పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు అర్హత టోర్నమెంట్‌లో మెరిసి బెర్త్‌లు దక్కించుకున్నాయి. అర్హత టోర్నమెంట్‌లో తేలిపోయిన వెస్టిండీస్ ఈసారి ప్రపంచకప్ సమరానికి దూరమైంది. మహిళల ప్రపంచకప్ ఎన్నడూ పరుగుల వరద చూడలేదు. కానీ ఇటీవల మహిళల క్రికెట్‌లో నిలకడగా భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. భారత్, ఆస్ట్రేలియా వన్డేలో రికార్డులు బద్దలైన సంగతి తెలిసిందే. వన్డే వరల్డ్‌కప్‌లోనూ అదే జోరు కనిపించే అవకాశం కనిపిస్తోంది. టైటిల్ వేటలో భారత్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంది. కానీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా ఇంగ్లాండ్‌లు భారత్‌కు సవాల్ విసిరేందుకు సిద్ధమవుతున్నాయి. గ్రూప్ దశలో ప్రతి జట్టు ఇతర జట్లతో తలపడనున్నాయి. టాప్-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. ప్రపంచకప్ మ్యాచులు మధ్యాహ్నాం 3 గంటలకు ఆరంభం అవుతాయి.