Saturday, November 8, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలువడ్ల కొనుగోళ్లు షురూ..

వడ్ల కొనుగోళ్లు షురూ..

- Advertisement -

ఇప్పటి వరకు 5.39 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణ
20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు ప్రణాళిక
వడ్ల కాంటాకు పట్టాదారు ఐరిష్‌ తప్పనిసరి
షరతులతో కౌలు రైతులకు తిప్పలు

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు క్రమక్రమంగా వేగం పుంజుకుంటున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రైతులు తమ ధాన్యాన్ని కల్లాల్లోనే ఉంచారు. చాలా చోట్ల పంట తడిసిపోయింది. ఈ నేపథ్యంలో వడ్ల కొనుగోళ్లు కొంత ఆలస్యమైనా…నాలుగైదు రోజుల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,226 కేంద్రాలు ఇప్పటికే అందుబాటు లోకి వచ్చాయి. మరో వెయ్యికిపైగా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు పౌరసరఫరాల శాఖ సమాయత్తమవుతున్నది. ఇప్పటివరకు 76,145 మంది రైతుల నుంచి 5.39 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. వీటి విలువ రూ.1400 కోట్లు ఉందని అధికారులు చెబుతున్నారు. నవంబర్‌ చివరివారం వరకు సుమారుగా 20 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయవచ్చని పౌరసరఫరాల శాఖ అంచనా వేస్తోంది.

క్వింటాళ్లకు గ్రేడ్‌ రూ.2,389, సాధారణ రకం ధాన్యం రూ. 2,369 కొనుగోలు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు బోనస్‌ రూ.500 ఇస్తున్నది. కొనుగోలు కేంద్రాల్లో సన్న, దొడ్డు వడ్లను వేర్వేరుగా సిబ్బంది తూకం వేస్తున్నారు. అక్టోబర్‌ మొదటి వారంలో నిజామాబాద్‌లో మొదటి కేంద్రం ప్రారంభమైంది. ఈ వారంలో కొమురంభీం ఆసిఫాబాద్‌, హన్మకొండ, ఖమ్మం, వికారాబాద్‌, మహబూబాబాద్‌ జిల్లాలో చివరిగా ప్రారంభించింది. అక్టోబర్‌లో 6.89 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. కానీ వర్షాల కారణంగా అనుకున్న టార్గెట్‌ చేరుకోలేక పోయింది. నవంబర్‌లో 32.95 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాలని ప్రణాళికలు రూపొందించింది. ఆ దిశగా సేకరణ చేపట్టేందుకు జిల్లాల అధికారులు వేగవంతం చేశారు.

కౌలు రైతులకు ఇబ్బందిగా మారిన ఆ ‘నిబంధన’
ధాన్యం కొనుగోళ్లకు పట్టాదారు ఐరిష్‌ పెట్టాలనే నిబంధన కౌలు రైతులకు ఇబ్బందికరంగా మారింది. కొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పట్టా పాస్‌బుక్‌ కలిగిన రైతులు వస్తేనే కాంటా వేస్తామంటూ అధికారులు చెబుతున్నారు. నగదు కూడా వారి ఖాతాలోనే జమ చేస్తామని అంటున్నారు. ఈ నిబంధనలతో పట్టా బుక్‌లేని కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వరిసాగు చేయని రైతుల వద్దకు వెళ్లి వారి పేర్ల మీద అమ్మకాలు చేసే దుస్థితి ఏర్పడింది. మెదక్‌, సిరిసిల్ల జిల్లాలో కొత్త నిబంధనలు పెట్టి కచ్చితంగా రైతుల ఐరిష్‌ పరీక్షలు పూర్తయితే కొనుగోళ్లు చేపడుతున్నట్టు తెలిసింది. మధ్య దళారులు ధాన్యం అమ్ముకుంటే మాత్రం ఎలాంటి నిబంధన వర్తించదు.

కానీ రైతులు, కౌలు రైతులు మాత్రం ఎన్నో షరతుల మధ్య ధాన్యాన్ని అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు రైతులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు అన్నదాతలు చెబుతున్నారు. ఆశించిన స్థాయిలో ధాన్యం రావడం లేదన్న కారణంగా అధికారులు గన్నీ బ్యాగులను సరఫరా చేయడం లేదని తెలిసింది. గతేడాది వానాకాలం సీజన్‌ కంటే ఈసారి వరి ధాన్యం ఉత్పత్తి పెరగనున్న నేపథ్యంలో 10.42 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. వడ్లలో 17 శాతం తేమ ఉన్న రైతులకే బస్తాలు పంపిణీ చేస్తున్నారు.

ఊరూరా ప్రచారం
రైతులు తమ ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రయివేటు వ్యాపారులకు అమ్ముకోవద్దంటూ ఊరురా ప్రచారం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. వారం రోజుల్లో రైతుల ఖాతాలో నగదు జమ చేస్తామని చెబుతున్నారు. పక్క రాష్ట్రాల నుంచి ధాన్యం గుట్టు చప్పుడుగా దిగుమతి చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు రైతులను కోరుతున్నారు. ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, చెక్‌పోస్టులు, పోలీసు పహరా కాస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -