Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఏఎన్‌ఎంలపై పని ఒత్తిడి తగ్గించాలి

ఏఎన్‌ఎంలపై పని ఒత్తిడి తగ్గించాలి

- Advertisement -

– ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పేరిట వేధింపులు ఆపాలి : తెలంగాణ యూనైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ డిమాండ్‌
– కోఠిలో కమిషనర్‌ కార్యాలయం ఎదుట ధర్నా
– కమిషనర్‌కు వినతిపత్రం అందజేత.. చర్చలు
నవతెలంగాణ-సిటీబ్యూరో

వైద్య ఆరోగ్యశాఖలో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఏఎన్‌ఎంలపై పని ఒత్తిడి తగ్గించాలని, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పేరిట వేధింపులు ఆపాలని తెలంగాణ యూనైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సీఐటీయూ) డిమాండ్‌ చేసింది. గురువారం ఆ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌ కోఠిలోని ఆర్యోగ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కార్యాలయం ఎదుట ఏఎన్‌ఎంలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్‌ మాట్లాడుతూ.. ఎల్‌సీడీ ఇతర యాప్‌ల నుంచి ఏఎన్‌ఎంలను మినహాయించాలని కోరారు. పోస్టులు పెంచి అందరికీ ప్రమోషన్‌ కల్పించాలని, ఎల్‌హెచ్‌వి ట్రైనింగ్‌తో సంబంధం లేకుండా 12, 18 సంవత్సరాల స్పెషల్‌ ప్రమోషనల్‌ పోస్ట్‌ ఇంక్రిమెంట్లు విడుదల చేయాలని అన్నారు. ఏఎన్‌ఎంల రెగ్యులర్‌ రిక్రూట్‌మెంట్‌ను వెంటనే పూర్తి చేయాలని, కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలందరికీ ఉద్యోగ భద్రత కల్పించి సమాన పనికి- సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర అధ్యక్షులు ఎండీ ఫసీయుద్దీన్‌ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటినీ వెంటనే చెల్లించాలన్నారు. ఎఫ్‌టీఏ, యూనిఫామ్‌ అలవెన్స్‌, సబ్‌ సెంటర్‌ అలవెన్స్‌లను విడుదల చేయాలని, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలకు ఆబాస్‌ హాజరు నుంచి మినహాయించాలని కోరారు. ప్రతి పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీకి ఇద్దరు డెటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాద నాయక్‌ మాట్లాడుతూ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు రెగ్యులర్‌గా వేతనాలు ఇవ్వాలని, పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని కోరారు.

ధర్నా అనంతరం 20 మంది ప్రతినిధులు కమిషనర్‌ సర్వే సంగీత సత్యనారాయణతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తమ పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తామని, మిగతా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కమిషనర్‌ హామీ ఇచ్చారు. అయితే, కొన్ని సమస్యలపై నిర్ధిష్టమైన హామీ రానందున ఈనెల 8న రాష్ట్రవ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీల ఎదుట ధర్నాలు చేసి మెడికల్‌ ఆఫీసర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని, 15న 33 జిల్లాల డీఎంహెచ్‌వో కార్యాలయాల ఎదుట ధర్నాలు చేసి వినతిపత్రాలు సమర్పించాలని ప్రతినిధులు తీర్మానించారు. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే ఈనెల చివరి వరకు ప్రభుత్వానికి గడువు ఇచ్చి ఆ తర్వాత సమ్మె చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సీఐటీయూ) రాష్ట్ర కోశాధికారి ఎ.కవిత, ఉపాధ్యక్షులు కె.బలరాం, రాష్ట్ర నాయకులు అరుణ, పుష్పలత, స్వర్ణలత, సుశీల, సరోజ, భూలక్ష్మి, పద్మ, జ్యోతి, రోజా మంజుల, లీలావతి, విజయ, సుజాత, కృష్ణవేణి, కుమారస్వామి, ప్రియాంక, రమా, జమున, సరస్వతి, చంద్రకళ, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad