Wednesday, December 31, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుక్యూర్‌ను క్యూట్‌గా డెవలప్‌చేయండి

క్యూర్‌ను క్యూట్‌గా డెవలప్‌చేయండి

- Advertisement -


– అందుకు ప్రణాళికలు సిద్ధం చేయండి
– గుడ్‌ గవర్నెన్స్‌ నుంచి స్మార్ట్‌ గవర్నెన్స్‌కు మారాలి
– ధ్రువపత్రాల జారీకి టెక్నాలజీని వాడండి
– పారిశుధ్యానికి తొలి ప్రాధాన్యత
– పనుల పురోగతిపై ప్రతినెలా స్వయంగా సమీక్షిస్తా
– పురపాలకశాఖ సమీక్షా సమావేశంలో అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం


నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. వచ్చే ఐదేండ్లకు యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించుకోవాలని తెలిపారు. కలిసికట్టుగా పని చేస్తేనే నగర భవిష్యత్తు మారుతుందని వ్యాఖ్యానించారు. మంగళవారం హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఉన్నతాధికారులు, కొత్త కమిషనర్లతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అన్ని విభాగాలు గుడ్‌ గవర్నెన్స్‌ నుంచి స్మార్ట్‌ గవర్నెన్స్‌కు మారాలని అన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌) పరిధిలోని కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌) ఏరియాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని ఆయన ఆదేశించారు.

హైదరాబాద్‌ మహానగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు పూర్తిస్థాయి ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం తెలిపారు. రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకునేందుకు ఇటీవల గ్లోబల్‌ సమ్మిట్‌ వేదికగా ‘తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌’ డాక్యుమెంట్‌ను విడుదల చేసినట్టు గుర్తు చేశారు. అందులో భాగంగా ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న క్యూర్‌ ఏరియాను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఆ పరిధిలోని సిటీని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా ఇప్పటికే పునర్‌ వ్యవస్థీకరించామని గుర్తు చేశారు. స్థానిక పరిపాలనను పట్టా లెక్కించాలనేదే తమ ఆలోచన అని ఆయన తెలిపారు. కోర్‌ అర్బన్‌ రీజియన్‌ను ప్రక్షాళన చేయాలనుకుంటున్నామని చెప్పారు. హైదరాబాద్‌ నగరంలో అత్యంత సంక్లిష్టమైన చెత్త నిర్వహణకు సంబంధించిన సమస్యను సమర్థవంతంగా అధిగమించాలని సూచించారు. సిటీలో కాలుష్య నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా సిటీలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని ఆదేశించారు. చెరువులు, నాలాలను ఆక్రమణల నుంచి కాపాడుకోవాలని సూచించారు. క్యూఆర్‌ పరిధిలో డీజిల్‌ బస్సులు, ఆటోల స్థానంలో ఈవీ బస్సులు, ఆటోలను తీసుకొస్తామని చెప్పారు. జోనల్‌ కమిషనర్లు ప్రతీ రోజు ఫీల్డ్‌లో ఉండాల్సిందేననీ, జోన్ల వారీగా సంబంధిత సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత వారిదేనని స్పష్టం చేశారు. చెరువులు, నాలాలు, చెత్త డంపింగ్‌ ఏరియాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. నెలకు మూడు రోజులు శానిటేషన్‌పై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలనీ, రోడ్లపై ఎక్కడా చెత్త, గుంతలు కనిపించకుండా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించాలని ఆదేశించారు.

నెలకోసారి స్వయంగా సమీక్ష
క్యూర్‌ పరిధిలోని హోటల్స్‌లో ఫుడ్‌ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్యూర్‌ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలకు అందుబాటులో ఉన్న స్థలాన్ని కేటాయించి భవనాలు నిర్మించాలని కోరారు. అద్దె భవనాల నుంచి సొంత భవనాలకు కార్యాలయాలను తరలించాలని చెప్పారు. క్యూర్‌ పరిధిలోని 12 జోన్లలో చెరువులు, కుంటలు, నాలాలను పూర్తిగా మ్యాపింగ్‌ చేయాలని సూచించారు. ఆక్రమణలను తొలగించి వర్షాకాలంలో వరదలతో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పెద్ద చెరువులను గుర్తించి వాటిని పునరుద్ధరించి యాక్టివిటీ జోన్స్‌గా అభివృద్ధి చేయాలని సూచించారు. జనవరి నుంచి ప్రతి ఒక్కరూ ఫీల్డ్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. నెలకోసారి స్వయంగా జోనల్‌ కమిషనర్లతో తాను సమీక్ష నిర్వహిస్తానని ఆయన తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, స్పెషల్‌ సీఎస్‌ జయేశ్‌ రంజన్‌, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శేషాద్రి, సెక్రెటరీ మాణిక్‌రాజ్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కర్ణన్‌, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ ఎమ్‌డీ అశోక్‌ రెడ్డి, హెచ్‌ఎమ్‌డీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, ఎఫ్‌సీడీఏ కమిషనర్‌ శశాంక, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌, జోనల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.

టెక్నాలజీని వాడుకోవాలి
కోర్‌ అర్బన్‌ రీజియన్‌ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలను అందించే దిశగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులకు సూచించారు. జనన, మరణ ధ్రువీకరణ, ట్రేడ్‌ లైసెన్సులు, ఇతర ధ్రువ పత్రాల జారీకి టెక్నాలజీని ఉపయోగించుకోవాలని తెలిపారు. తద్వారా ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని తెలిపారు. కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్లు, అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్లతో కమ్యూనికేషన్‌ ఉండేలా చూసుకోవాలని అన్నారు. సుపరిపాలనతో పాటు స్మార్ట్‌ గవర్నెన్స్‌ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. హైడ్రా, జీహెచ్‌ఎంసీ, వాటర్‌ వర్క్స్‌ విభాగాలు నాలాల పూడిక తీత పనులు జనవరి నుంచి మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు. క్యూర్‌ ఏరియాలో విభాగాల అధికారులను స్పెషల్‌ సీఎస్‌ సమన్వయం చేసుకుంటారని తెలిపారు. దోమల నివారణ, అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని, ప్రతీ పది రోజులకోసారి గార్బేజ్‌ క్లియరెన్స్‌ డ్రైవ్‌ నిర్వహించాలని జోనల్‌ కమిషనర్లకు సీఎం సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -