10 శాతం యారన్ సబ్సిడీని పవర్లూమ్ కార్మికులతో పాటు వార్పిన్ , వైపని అనుబంధ రంగాల కార్మికులకు అందించాలి
త్రిఫ్ట్ నేతన్న పొదుపు పథకాన్ని వెంటనే ప్రారంభించాలి
సిఐటియు – తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ డిమాండ్
నవతెలంగాణ- రాజన్న సిరిసిల్ల
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న పవర్లూమ్, వార్పిన్, వైపని అనుబంధ రంగాల కార్మికులకు వర్కర్ టూ ఓనర్, 10 శాతం యారన్ సబ్సిడీ, త్రిఫ్ట్ పథకం వర్తింప చేయాలని సిఐటియు తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముశం రమేష్ అన్నారు. పలు డిమాండ్లపై సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బి.వై నగర్ లోని చేనేత జౌళి శాఖ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించి చేనేత జౌళి శాఖ జిల్లా ఇన్చార్జి ఎ.డి. సంతోష్ కు అందజేశారు.
ఈ సందర్భంగా సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ మాట్లాడుతూ.. కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పించాలని సిఐటియు ఆధ్వర్యంలో సుదీర్ఘకాలం చేపట్టిన పోరాటాల ఫలితంగా గత ప్రభుత్వం వర్కర్ టు ఓనర్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. దానిలో భాగంగా సిరిసిల్ల పెద్దూరులో స్థలాన్ని కేటాయించి వర్క్ షెడ్లను నిర్మించడం జరిగిందని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వర్కర్ టు ఓనర్ పథకాన్ని కార్మికులకు అందించకుండా కాలయాపన చేస్తుందని ప్రస్తుతం నిర్మించిన వర్క్ షెడ్లను ఇతర కంపెనీలు పెట్టుబడిదారులకు అప్పజెప్పే విధంగా చూస్తుందని మండిపడ్డారు.
కార్మికుల కోసం నిర్మించిన వర్క్ షెడ్లను ఇతరులకు కేటాయిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ప్రభుత్వం వెంటనే వర్కర్ టూ ఓనర్ పథకానికి సంబంధించి 1104 మంది పవర్లూమ్ కార్మికులను ఎంపిక చేసి ఒకరికి 4 పవర్లుమ్స్ చొప్పున ప్రభుత్వం మంజూరు చేసి కార్మికులకు అందించి కార్మికులను యజమానులు చేయాలని డిమాండ్ చేశారు. వర్కర్ టూ ఓనర్ షెడ్లలో 60 వార్పిన్లను వార్పిన్ కార్మికులకు అందించాలని , వైపని కార్మికులకు కూడా వర్కర్ టు ఓనర్ పథకం వర్తింపచేయాలని , ఇందిరా మహిళ శక్తి చీరలకు పవర్లూమ్ కార్మికులతో పాటు వార్పిన్ , వైపని అనుబంధ రంగాల కార్మికులందరికీ 10% యారన్ సబ్సిడీ వెంటనే ప్రకటించి అందించాలని , 2023 సంవత్సరం బతుకమ్మ చీరలకు సంబంధించి స్థానిక మరియు ఇతర రాష్ట్రాల కార్మికులకు రావాల్సిన 10% యారన్ సబ్సిడీ డబ్బులను వెంటనే అందించాలని మరియు త్రిఫ్ట్ నేతన్న పొదుపు పథకాన్ని వెంటనే ప్రారంభించాలని లేకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున కార్మికులందరితో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు – పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ నాయకులు నక్క దేవదాస్ , సిరిమల్ల సత్యం , గుండు రమేష్ , ఉడుత రవి , బెజుగం సురేష్ , బాస శ్రీధర్ , అవధూత హరిదాసు , అన్సారి , కందుకూరి రమేష్ , సబ్బని శ్రీకాంత్ , శ్రీనివాస్ , విజయ్ , సంపత్ , సుధన్ , నరేష్ , సత్యనారాయణ , పోచమల్లు , రాజేశం , యాదగిరి తదితరులు పాల్గొన్నారు.




