ప్రపంచ యుద్ధ రాజకీయాలను గుప్పెట పట్టిన నాటకం ‘విశ్వశాంతి’. పెట్టుబడిదారీ వ్యవస్థలో దోపిడీయే పెట్టుబడిగా అవతరించి లాభాల వేటను సాగిస్తుంది. వ్యక్తికైనా, వ్యవస్థకైనా ‘ఇదే కాలధర్మం’ అన్న భ్రాంతి సాగుతుంది. ‘సర్వేజనా సుఖినోభవంతు’ అన్న సూక్తులు ప్రవచనాలుగా ఇక మిగిలిపోతాయి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందించే ఆధునిక భోగలాలస సౌకర్యాలను మనిషి ఒక పక్క అపరిమితంగా అనుభవిస్తూనే మరో పక్క అధిక లాభాల వేటలో సాటి మనుషులను బతికుండగా పీక్కుతినడం సర్వసాధారణమైపోతుంది. యుద్ధం ధర్మమేనంటూ ముద్దు ముద్దు మాటలు వల్లిస్తోంది. అన్నం పెట్టే అన్నదాతను, సంపదను సృష్టించే శ్రమజీవిని అనామకులుగా మార్చి తమ పాలనా పదఘట్టనల కింద చీమల్లా నలిపివేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది.
యుద్ధం నిజంగా ఓ భయంకర విధ్వంసం. వేల లక్షల సంఖ్యల్లో మృతదేహాలు, క్షతగాత్రులు, భవంతులు, ఆనకట్టలు, పచ్చటి పొలాలు, అడవులు నిట్టనిలువునా కాలి బూడిదయ్యే విపరిణామం. పిల్లా పాప, గొడ్డూగోదా… ఆకలిడప్పుల హాహాకారాలు. మరి యుద్ధమంటే కేవలం ఈ భౌతిక విధ్వంసమేనా..? అంతకుమించి మానవ మస్తిష్కాల్లో వణుకు పుట్టించే భయానకం. జీవశ్చవాలుగా మార్చే వైనం. క్షణాల్లో కకావికలం కావడం, రక్తాశ్రువులు చిందడం.. ఇది కదా… యుద్ధమంటే. ఈ యావత్ మానవ జీవన చిత్రాన్ని ఒడుపుగా ఒడిసిపట్టి ప్రతీకలుగా చూపుతూ నాటక శిల్పంగా చెక్కడం నిజంగా ‘ఆత్రేయ’కే సాధ్యం అన్న రీతిలో రుజువవుతుంది.
దాదాపు ఎనభై పేజీల సాహిత్యం గల రెండు గంటల నాటకమిది. తల్లి భూదేవి ‘భూమాత’కు ప్రతీక. చిన్న కొడుకు విశ్వం ‘శ్రామిక వర్గా’నికి ప్రతీక. పెద్ద కొడుకు పెట్టుబడిదారీ ‘క్రౌర్యా’నికి ప్రతీక. సైంటిస్టు ఆయుధ సృష్టికి ప్రతీక. మాస్టారు మధ్య తరగతి (ఊగిసలాట) వర్గానికి ప్రతీక. స్వాములవారు అజ్ఞాన పెద్దరికానికి ప్రతీక. కథానాయకి ‘శాంతి’ సాధనకు ప్రతీక కాగా చిన్నారి కూతురు ‘సమత’ ఆకాంక్షకు ప్రతీక. మరికొన్ని ఉప పాత్రలు వుంటాయి. కానీ ఏ పాత్రకి ఆ పాత్ర ఔచిత్యం నుండి పొరపాటున కూడా దారి తప్పదు. అదే సందర్భంలో ప్రతి మాటా సూక్ష్మం నుండి స్థూలానికి ప్రయాణిస్తుంది. లోకవృత్తానుకరణం నాటకం అన్న సత్యాన్ని విశదపరుస్తుంది. ఇక నాటకంలోని అంతర్నాటకం యుద్ధం మరో ఎత్తు.
కథ సాధారణమే. పెట్టుబడిదారులు అప్పుడైనా, ఇప్పుడైనా పచ్చటి పంటపొలాలను, ప్రకృతిని ధ్వంసం చేస్తూ లాభాల వేటలో పరిశ్రమలు స్థాపించడం, దానిని ప్రతిఘటిస్తూ ప్రజలు పోరాటాలు చేయడమూ తెలిసిందే. పెద్ద కొడుకు పాలకులతో మిలాఖత్ అయి ఆ గ్రామంలో పంట పొలాలు ధ్వంసం చేసే రీతిలో పింగాణి పరిశ్రమను స్థాపించడం, దానిని చిన్న కొడుకు విశ్వం నాయకత్వంలో ప్రజానీకం ప్రతిఘటించటం, చివరకు అది పింగాణి పరిశ్రమ కాకుండా, బాంబుల తయారీ కర్మాగారం కావడం, ప్రజా తిరుగుబాటుతో అది విధ్వంసమవడం చూస్తాం. యుద్ధం వలన స్వచ్ఛమైన ప్రేయసీప్రేమికులు ఏ దేశంలోనైనా ఎలాంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటారో అంతర్నాటకంలో గమనిస్తాం. రచయిత సహానుభూతి (ఎంపథీ) అర్థం చేసుకున్న కొద్దీ పాఠకులకైనా, ప్రేక్షకులకైనా, శ్రోతలకైనా కళ్లు చెమర్చకమానవు. డెబ్బై ఏళ్ల క్రితం నాటకం ఇది. నాటి శబ్ద సాంకేతిక వాద్య పరికరాలతో, షాడో లైటింగ్ హంగులతో రక్తి కట్టించిన నాటకం. రచయితతోపాటు, దర్శకుల ప్రతిభ, కళాకారుల నైపుణ్యం అంతా నాటకాంశంతో మమేకం కావడం, ఆ అంకితభావం నాటకానికే కాదు మానవత్వానికే పరాకాష్టగా నిలుస్తుంది.
‘యుద్ధం మూలాన ఆహారోత్పత్తి తగ్గిపోయింది. పండిన దానిలో చాలా భాగం మిలటరీకి సరఫరా అయిపోతుంది. మిగిలిన కాస్త దొంగ బజారుల్లోకి పోతుంది. ఫలితం కరువు. ఎక్కడ చూసినా శవాలు, ఆకలి చావులు’ – ఈ సైనికుని అమరయ్య మాటలు యుద్ధానికి – కరువుకి గల ఆంతరంగిక సంబంధాన్ని కళ్లకు కడ్తాయి. ‘నేను మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడ్డానికి యుద్ధానికి వెళ్లాను. నా ఇల్లూ, వాకిలీ అన్నీ వదులుకున్నాను. చివరకు నాకు ఒక కప్పు కాఫీ కూడా ఇవ్వరా..?’ అని ఓ సైనికుడు ప్రశ్నిస్తే… ఏమిటి నువ్వు చేసిన త్యాగం? ఎవరు చేయమన్నారు? ఎందుకీ త్యాగం? మేం యుద్ధం కావాలన్నామా? లేదే… ఎందుకోసం యుద్ధం? ఎవరికోసం యుద్ధం? పిల్లల్ని, తల్లుల్ని, భర్తలను పోగొట్టుకుని మేం ఇలా తయారుగావడానికి (వేశ్యగా) మీరు కాదా కారణం? అని ఓ యువతి ఎదురు ప్రశ్నిస్తుంది. దుర్బల జీవితానికి తార్కాణంగా నిలుస్తుంది.
ఇలా నాటకం పొడుగునా ఎన్నో యధార్థ ఉదంతాలు. శాంతి పాత్ర రంగ ప్రవేశానికి ముందు శాంతి కపోతం వస్తుంది. ఇదో అబ్బురం. మహాకవి శ్రీశ్రీ ఈ నాటకానికి ముందు మాట రాస్తూ… ఒక విషయం మీద అచంచల విశ్వాసం లేనిదే ఇందుకు పలు పూనుకోవడమే మంచిది కాదు. హితోపదేశం ఎంతైనా కష్టమైనా పని. సమస్త ప్రపంచం ఈ నాడు క్రమక్రమంగా రెండు శబిరాలుగా ఘనీభవిస్తుంది. కామందులకు లాభాలు చేకూర్చే యుద్ధం, సామాన్యులకు క్షేమం కూర్చే శాంతి. జీవితానికి ప్రాణవాయువులా సమిష్టిక్షేమానికి శాంతి అవశ్యం అని గుర్తెరగాలి’ అని కొనియాడుతూ… నాటకరంగమనే వైద్యశాలలో జరుగుతున్న ఓ చికిత్సా విధానమే ఈ ‘విశ్వశాంతి’ నాటకం అని అభివర్ణించారు. బహిరంగ బందిపోటు దోపిడీ విధానాలతో (ట్రంప్ సుంకాల రంకెలు). పాస్టిట్ ఉన్మాద ధోరణులతోయుద్ధాల అంచుల్లో జీవిస్తున్న మన భారత ప్రజానీకానికి ‘విశ్వశాంతి’ నాటకం విశిష్టతే కాదు ఆవశ్యకతను ఎప్పటికప్పుడు తెలియజెప్తూ మనల్ని అప్రమత్తత గావిస్తుంది.
- కె.శాంతారావు, 9959745723



