నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
ముడాల గంగారాం మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ (జి.ఆర్.ఎం సొసైటీ)ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక ఎల్లమ్మ గుట్టలో గల మున్నూరు కాపు సంఘంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు, రాష్ట్ర ఫోటోగ్రాఫర్ల వీడియో గ్రాఫర్ల సంఘం అధ్యక్షుడు హుస్సేన్, కార్యదర్శి మాధవరెడ్డి లు 25 జిల్లాల నుండి ప్రతి జిల్లా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ముందుగా సొసైటీ అధ్యక్షుడు నరేష్ బాబు మాట్లాడుతూ, తమ తండ్రి జ్ఞాపకార్థం సొసైటీని స్థాపించి గత 15 ఏళ్లుగా వివిధ సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అందులో ప్రధానంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నానని, ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్లను ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా ఫోటోగ్రాఫర్లను సన్మానించడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.
అనంతరం ఫోటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ల చాలీ చాలని ఆదాయంతో జీవితాలు గడుపుతున్న ఫోటోగ్రాఫర్ లందరికీ సరైన జీవితాన్నందించడానికి సంఘం చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. ప్రతి ఫోటోగ్రాఫర్ కి బీమా సౌకర్యం, హెల్త్ కార్డు, సొంత ఇల్లు ప్రభుత్వాలు ఇవ్వాలని, సమాజానికి ఎంతో సేవ చేస్తున్న వారి జీవితాల్లో మార్పు కోసం ప్రయత్నించాలని ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచిస్తే బాగుంటుందని ఆయన అన్నారు.
తర్వాత 25 జిల్లాల నుంచి విచ్చేసిన ఫోటోగ్రాఫర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారులని శాలువా మొమెంటోలతో అతిథులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా సుమారు 20 మంది మహిళా ఫోటోగ్రాఫర్లను వివిధ ప్రాంతాల నుంచి ఆహ్వానించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిఆర్ఎం సొసైటీ కార్యదర్శి శ్రీనివాస్ కోశాధికారి లక్ష్మీనారాయణ అడ్వైజర్ మామిడాల మోహన్, నిశిత కళాశాల ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు, ఆక్స్ఫర్డ్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.