అమెరికాపై బాంబ్‌ సైక్లోన్‌

2 గంటల క్రితం

cyclone
avatar
balaji

ప్రచురించబడింది నవం 28, 2026 | 3 నిమిషాల చదవడం

న్యూజెర్సీ, న్యూయార్క్‌ను ముంచెత్తిన వరదలు

అంధకారంలో 9 లక్షలకుపైగా ఇండ్లు

జలదిగ్బంధంలో ముఖ్యకూడళ్లు


న్యూయార్క్ : థాంక్స్గివింగ్ వేడుకల వేళ అమెరికాను భారీ తుపాను వణికించింది. న్యూయార్క్‌, న్యూజెర్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులతో జనజీవనం స్తంభించింది. విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో 9 లక్షల మందికి పైగా ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తగా, చెట్లు విరిగిపడి ఇండ్ల పై కూలాయి. కీలక వంతెనను అధికారులు మూసివేశారు. వందల సంఖ్యలో విమాన సర్వీసుల రద్దు, ఆలస్యాలతో పండుగ ప్రయాణాలు అస్తవ్యస్తమయ్యాయి.

దెబ్బతిన్న వంతెనలు-రాకపోకలు బంద్

భారీ గాలులు, వర్షాలు, మంచు కారణంగా రవాణా, విద్యుత్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. వర్జీనియాలో అత్యధికంగా రెండు లక్షలకు పైగా వినియోగదారులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మేరీల్యాండ్‌లో 1.50 లక్షలకు పైగా కనెక్షన్లు దెబ్బతిన్నాయి. మిస్సోరిలో రాత్రి కురిసిన భారీ మంచు వర్షం కారణంగా విద్యుత్ లైన్లు దెబ్బతిని కనీసం 1.29 లక్షల మంది వినియోగదారులు సరఫరా కోల్పోయారు. పెన్సిల్వేనియాలో 70 వేలకు పైగా, న్యూజెర్సీలో 60 వేలకు పైగా కనెక్షన్లకు అంతరాయం ఏర్పడింది. నార్త్ కరోలినా, ఇల్లినాయిస్, డెలావేర్ రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.తుపాను ప్రభావంతో పెన్సిల్వేనియా, న్యూజెర్సీ రాష్ట్రాలను కలిపే కీలకమైన కొమోడోర్ బ్యారీ వంతెనను అధికారులు మూసివేశారు. గంటకు 50 నుంచి 70 మైళ్ల వేగంతో వీచిన గాలులకు వంతెనపై ప్రయాణ మార్గానికి ఎగువన ఏర్పాటు చేసిన నిర్మాణ పనుల ప్లాట్‌ఫామ్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో వంతెనపై ప్రయాణం ప్రమాదకరమని డెలావేర్ రివర్ పోర్ట్ అథారిటీ ప్రకటించింది. పరిస్థితులు అనుకూలించిన వెంటనే మరమ్మతు పనులు చేపడతామని వెల్లడించింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా, సురక్షితంగా వంతెనను తిరిగి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది.

ఇండ్ల పై కూలిన చెట్లు- రంగంలోకి సహాయక బృందాలు

మేరీల్యాండ్‌లోని మాంట్‌గొమెరీ కౌంటీలో తుపాను బీభత్సం సృష్టించింది. గురువారం ఉదయం అత్యవసర సేవల విభాగానికి 300కు పైగా ఫిర్యాదులు అందాయి. వీటిలో ఇళ్లపై చెట్లు కూలిన ఘటనలకు సంబంధించినవే అధికంగా ఉన్నట్లు సీఎన్‌ఎన్ వెల్లడించింది. ఓ ఇంటిపై భారీ చెట్టు పడిన దృశ్యాలను అగ్నిమాపక, సహాయక విభాగం విడుదల చేసింది. ఆ సమయంలో ఇంట్లో వ్యక్తులు ఉన్నప్పటికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. మరో ఘటనలో ఇంటిపై చెట్టు పడటంతో లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు సిబ్బంది రంగంలోకి దిగారు.

న్యూయార్క్‌లో వరదల్లో 
చిక్కుకున్న వాహనదారులు

న్యూయార్క్ నగరంలోనూ భారీ వర్షాలు, వర దలు ప్రజలను ఇబ్బందులకు గురిచేశాయి. వరద నీటిలో చిక్కుకున్న రెండు వాహనాల నుంచి వ్యక్తు లను రక్షించినట్లు నగర మేయర్ జొహ్రాన్ మమ్దానీ వెల్లడించారు. వరద నీటిలో నడవడం, సైకిళ్లపై వెళ్లడం, వాహనాలు నడపడం వంటివి చేయవద్దని హెచ్చరించారు. అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేసుకుని ఇండ్ల లోనే ఉండాలని సూచించారు. ఎలాంటి గమ్యస్థానమైనా ప్రాణ భద్రత కంటే ముఖ్యమైనది కాదని స్పష్టం చేశారు.

విమాన సర్వీసులకు బ్రేక్

థాంక్స్‌గివింగ్ పండుగ కోసం స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికులకు తుపాను తీవ్ర ఇబ్బందులు కలిగించింది. వందలాది విమానాలు రద్దు కాగా, మరికొన్ని ఆలస్యంగా నడిచాయి. న్యూయార్క్, ఫిలడెల్ఫియా విమానాశ్రయాల్లో వాతావరణం కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందని తొలుత అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) హెచ్చరించింది. అయితే తాజా పరిస్థితులను సమీక్షించిన అనంతరం న్యూయార్క్ మెట్రోపాలిటన్ ప్రాంతం, ఫిలడెల్ఫియా విమానాశ్రయాల్లో వాతావరణ కారణాలతో గ్రౌండ్ స్టాప్‌లు విధించాల్సిన అవసరం కనిపించడం లేదని ప్రకటించింది. మరోవైపు వాషింగ్టన్ డల్లెస్, రొనాల్డ్ రీగన్ నేషనల్, బాల్టిమోర్/వాషింగ్టన్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో గాలుల కారణంగా గురువారం రాత్రి వరకు అంతరాయాలు ఉండవచ్చని తెలిపింది.

మేసిన్ థ్యాంక్స్ గివింగ్ డే పరేడ్ రద్దు

అమెరికాలో వందేండ్లుగా జరుగుతోన్న మేసిస్‌ థ్యాంక్స్‌ గివింగ్‌ డే పరేడ్‌ కూడా బాంబ్‌ సైక్లోన్‌ కారణంగా వాయిదా పడింది. తీవ్రమైన గాలుల కారణంగా జార్జి వాషింగ్టన్‌ వంతెనపై ఖాళీ ట్రాలీలు, బైకుల ప్రయాణాలను నిషేధించారు. ఇక మేరీ ల్యాండ్‌లో 19 లక్షల మంది ప్రజలను మంచి నీరు పొదుపుగా వాడుకోవాలని హెచ్చరించారు. వాతావరణ పీడనం 24 గంటల్లోనే అసాధారణ స్థాయిలో పడిపోయే ప్రక్రియను శాస్త్రవేత్తలు ‘బాంబోజెనిసిస్‌’ అంటారు. ఈ ప్రక్రియతో ఏర్పడే తుపాన్లను ‘బాంబ్‌ సైక్లోన్లు’గా వ్యవహరిస్తారు. అయితే ఈ ముప్పు నుంచి ఎప్పుడు బయటపడతామోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్