వైట్‌హౌస్ వద్ద వెనిజులా జాతీయుడి కలకలం
వైట్ హౌస్ : అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ వద్ద ఓ సాయుధుడు కలకలం సృష్టించాడు. దొంగలించిన పికప్ ట్రక్కులో అనుమానాస్పదంగా తిరుగుతున్న వెనిజులా జాతీయుడిని సీక్రెట్ సర్వీస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను హత్య చేయాలనే ఉద్దేశంతో అతడు ఆయుధాలతో సంచరిస్తున్నట్టు గుర్తించారు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వైట్‌హౌస్ కాంప్లెక్స్ సమీపంలోని కాన్‌స్టిట్యూషన్ అవెన్యూ వద్ద అనుమానాస్పదంగా ఆగి ఉన్న పికప్ ట్రక్కును పెట్రోలింగ్ సమయంలో స్రీకెట్ సర్వీస్ అధికారులు తనిఖీ చేశారు. ఆ వాహనం దొంగలించినది అని గుర్తించారు. అందులో నుంచి మూడు తుపాకులు, తూటాలను స్వాధీనం చేసుకుని, 30 ఏండ్ల వెనిజులా జాతీయుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతడు చెప్పిన మాట విని అధికారులు షాకయ్యారు. ‘‘ట్రంప్‌ను చంపమని నాకు కొన్ని శబ్దాలు వినిపించాయి. అందుకే ఇంతదూరం వచ్చా’’ అని అతడు వెల్లడించడం గమనార్హం. నిందితుడు రోనీ యార్డ్రిక్స్ క్రినోస్.. 2024లో టెక్సాస్‌కు అక్రమంగా వలసవచ్చాడని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అతడిని స్థానిక కోర్టులో హాజరుపర్చారు.





కామెంట్‌లు (0)