పదవీచ్యుతుడైన అధ్యక్షుడు పెనా...గృహ నిర్బంధం
డిజిటల్ బ్యాంక్ పతనంతో కీలక పరిణామాలు
అసున్సియోన్ : దక్షిణ అమెరికా దేశమైన పరాగ్వేలో అత్యంత తీవ్రమైన రాజకీయ, ఆర్థిక సంక్షోభం నెలకొంది. దేశాధ్యక్షుడు శాంటియాగో పెనా పదవీచ్యుతుడయ్యారు. ఆయనను గృ హ నిర్బంధంలో ఉంచారు. దేశంలో ప్రముఖ డిజిటల్ బ్యాంక్ ‘యుయెనో బ్యాంక్’ పతనం కారణంగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. యుయెనో బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతల మధ్య స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేయాల్సిందిగా పెనాను ఈ నెల ఐదవ తేదీన కోరారు. అయితే అందుకు ఆయన తిరస్కరించారు. దీంతో పార్లమెంటులోని ఎగువసభ సెనెట్‌లో ఆయనపై అభిశంసన ప్రక్రియ చేపట్టారు. దీనిపై శుక్రవారం ఓటింగ్ జరగ్గా 45 మంది సెనెటర్లలో 44 మంది ఆయనను పదవి నుంచి తొలగించేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
ఓ సభ్యుడు గైర్హాజరు అయ్యారు.అధ్యక్షుడుగా పెడ్రో అలియానా
అభిశంసనకు గురై పదవీచ్యుతుడైన పెనా దేశాధ్యక్షుడిగా తనకున్న రాజ్యాంగ రక్షణలను కోల్పోయారు. దీంతో ఆయనను అధికారులు గృ హ నిర్బంధంలో ఉంచారు. విశ్వాస ఘాతుకం, నిధులు - అధికారాల దుర్వినియోగం వంటి తీవ్రమైన ఆరోపణలపై ప్రాసిక్యూటర్లు ఆయనను విచారిస్తున్నారు. పెనాను పదవీచ్యుతుడిని చేసిన తర్వాత ఉపాధ్యక్షుడు పెడ్రో అలియానా పరాగ్వే 53వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన 2028 ఆగస్టు వరకూ దేశాధ్యక్షుడిగా కొనసాగుతారు.
బ్యాంక్ సంక్షోభానికి కారణాలు
పరాగ్వే జనాభాలో దాదాపు సగం మంది... అంటే 30 లక్షల మందికి యుయెనో బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి. అయితే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, చెల్లింపులు చేయలేని పరిస్థితుల్లో ఈ బ్యాంక్ మూతపడింది. దీంతో ఈ బ్యాంకును పరాగ్వే కేంద్ర బ్యాంక్ తన నియంత్రణలోకి తీసుకుంది. బ్యాంక్ మూసివేత కారణంగా ప్రజలు తమ పొదుపు సొమ్మును వెనక్కి తీసుకోలేక పోయారు. పెన్షన్ నిధులు నిలిచిపోయాయి. ఈ బ్యాంకుతో పెనాకు సంబంధాలున్నాయన్న ఆరోపణలు కూడా వచ్చాయి. బ్యాంక్ మూసివేతతో ఇబ్బందులు పడుతున్న లక్షలాది మంది ప్రజలు రాజధాని అసున్సియోన్లో వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. పెనా సొంత పార్టీ అయిన కొలరాడో కూడా అభిశంసన తీర్మానానికి మద్దతు పలకడం గమనార్హం. పరాగ్వే చరిత్రలోనే ఇది అతి పెద్ద సంక్షోభమని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.





కామెంట్లు (0)