మిలిటరీ బేస్‌లలో తిష్ట వేసిన అమెరికా మంత్రులు, ఉన్నతాధికారులు
ఇరాన్ హెచ్చరికలు...
స్వదేశంలో నిరసనలే కారణం
వాషింగ్టన్ : అది వాషింగ్టన్‌లో సీనియర్ సైనికాధికారులు, జనరల్స్ నివసించే ప్రాంతం. అక్కడ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. నగరంలోని మిగిలిన ప్రాంతానికీ, దీనికి మధ్య అడ్డుగోడలా ఓ కంచె ఉంటుంది. అనుమతి లేనిదే చీమ కూడా లోపలికి ప్రవేశించలేదు. అయితే ఇప్పుడు ఆ సైనిక స్థావరాలలో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యాబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు మకాం వేశారు. సైనిక స్థావరాలలో మంత్రులు తలదా చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిం దంటారా?. దేశంలో చోటుచేసుకుంటున్న రాజకీయ హింస, విదేశాల నుంచి...ముఖ్యంగా ఇరాన్ నుంచి ఎదురవుతున్న ముప్పు కారణంగా ప్రాణభయంతో వారంతా వణికిపోతుండడమే దీనికి కారణమని సీఎన్‌ఎన్ వార్తా సంస్థ ఓ కథనాన్ని అందించింది.
ప్రాణభయం ఎందుకు ?
ఇరాన్‌పై కఠినమైన ఆంక్షలు విధించి, తీవ్రమైన ఆర్థిక ఒత్తిడులు తెచ్చిన ట్రంప్ ప్రభుత్వం ఫిబ్రవరిలో ఇజ్రాయిల్‌తో కలిసి యుద్ధానికి దిగింది. ఈ నేపథ్యంలో అమెరికా మంత్రులు, ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకొని వారిని హతమార్చేందుకు ఇరాన్ ప్రణాళికలు రూపొందిస్తోందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. వాషింగ్టన్‌లో డర్టీ బాంబ్ లేదా రసాయన ఆయుధాలను పేల్చి ఉన్నతాధికారులను మట్టు పెట్టడానికి ఇరాన్ కుట్రలు పన్నుతోందని ఆ వర్గాలు ప్రభుత్వానికి నివేదికలు అందజేశాయి. ఇదిలావుంటే దేశంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. సంప్రదాయవాది అయిన చార్లీ కిర్క్ హత్య వంటి ఘటనల తర్వాత మంత్రుల నివాసాల వద్ద నిరసనలు పెరిగాయి. దీంతో మంత్రులు, ఉన్నతాధికారులు ఇప్పుడు సైనిక స్థావరాలకు మకాం మార్చారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే ఇప్పుడు మిలిటరీ బేస్‌లలో నివసిస్తున్న మంత్రులు, అధికారుల సంఖ్య ఎక్కువగా ఉంది.
వసతి కోసం సైనికాధికారుల పడిగాపులు
సాధారణంగా త్రీ-స్టార్, ఫోర్-స్టార్ జనరల్స్ కోసం కేటాయించే నివాసాలను రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు తీసేసుకోవడంతో సైనికాధికారులకు తగిన వసతి భవనాలు లభించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా పూర్తిగా కట్టుదిట్టమైన కంచెల మధ్య మంత్రులు నివసిస్తుండడంతో వారు సాధారణ ప్రజలకు దూరమవుతున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వారికి పట్టడం లేదు. నిబంధనల ప్రకారం మంత్రులు, అధికారులు ఆయా నివాసాలకు మార్కెట్ విలువకు అనుగుణంగా నెలకు సుమారు 4,600 డాలర్ల అద్దె చెల్లిస్తున్నారు.
డెమొక్రాట్ల ఆరా
ఓ వైపు వాషింగ్టన్‌పై తనదైన ముద్ర వేసేందుకు ట్రంప్ తంటాలు పడుతుంటే మంత్రులు, అధికారులు మాత్రం సైనిక బేస్‌లలో కాలక్షేపం చేస్తున్నారు. నగరంలో ఎక్కడా లేనంతా సురక్షితంగా అక్కడ ఉంటున్నామని వారు చెబుతున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులు మిలిటరీ బేస్‌లలో తిష్ట వేయడంపై డెమొక్రాట్లు ఆయా తీయడం మొదలు పెట్టారు.
సైనిక స్థావరాలలో ఉంటున్నది వీరే
తమ దేశంపై ఆంక్షలు విధించడంలో కీలక పాత్ర పోషించిన ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్‌ను హత్య చేస్తామంటూ ఇరాన్ నుంచి బెదిరింపులు వస్తున్నాయి. దీంతో ఆయన జార్జ్‌టౌన్‌లోని విలాసవంతమైన భవనాన్ని వదిలేసి ఇటీవలే సైనిక స్థావరానికి మారారు. భద్రతా కారణాల రీత్యా అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచ్ కూడా సైనిక నివాసానికి మకాం మార్చారు. భద్రతపై ఆందోళన చెందుతున్న బ్లాంచ్‌ని ఇటీవలే సైనిక స్థావరానికి తరలించారు. గతంలో అటార్నీ జనరల్‌గా పనిచేసిన పామ్ బాండీ కూడా మిలిటరీ బేస్‌లోనే ఉన్నారు. ఇక రక్షణ మంత్రి పీట్ హెగ్ సేథ్, విదేశాంగ మంత్రి మార్కో రుబియో కూడా వాషింగ్టన్‌లోని ఫోర్ట్ మెక్‌నైర్‌లో ఉన్న చారిత్రక 'జనరల్స్ రో'లో పక్క పక్కనే ఉంటున్నారు. హెగ్‌సేథ్ తన నివాసానికి గత ఏడాది మరమ్మతులు, ఆధునీకరణ పనుల కోసం 1,37,297 డాలర్లు ఖర్చు చేయడానికి సిద్ధపడగా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ గతంలో వర్జీని యాలో ఉండేవారు. అయితే ఆయన ఇంటి వెలుపల ఆందోళ నలు ఉధృత మయ్యాయి. ఆయన ఇంటి చిరునామాతో నిరసనకారులు కరపత్రాలు పంచడం మొదలు పెట్టారు. దీంతో మిల్లర్ తన భార్యా పిల్లలతో కలసి మిలిటరీ హౌసింగ్‌లోకి మారిపోయారు.







కామెంట్‌లు (0)