ఆగిపోని సుదీర్ఘ పాటలా
అంతరం లేని అనంత శ్వాసలా
మాయంకాని పచ్చదనంలా
మనిషి అంతరం అంతా లేలేత నూనూగు తాకిడితో ఆశ వడ్రంగి పిట్టలా
గుండెల్లో గాయం చేస్తూనే ఉంటుంది !
గాయాలు ఓటమి కావు
త్యాగాలు గమ్యపు దారిలో దిక్సూచులు
అవి రేపటి ధైర్యానికి విజయాలకు
తొలకరి కాలాన నేలగర్భాన
దాచిన రక్తబీజాక్షరాలు !
ఒక్కో బిందువు లక్షల అంకురాలై
తిరిగి నిటారుగా తెలెత్తి
నింగిని అందుకోక తప్పదు
అంతటా దట్టంగా చీకటి
కమ్ముకుందని చింతపడకు
వెనక వెనువెంటనే వెలుతురు
మిణుగురులు రెక్క ల్ని ఝళిపిస్తూ
కిరణాలను రగిలించనున్నాయి !
మౌనంగా రోదించే అడవి తన ఒళ్లంతా చిందిన రక్తాశ్రువుల్ని తుడిచే
ఆపన్న హస్తాల రాకకోసం
చెట్లూ పిట్టలూ అడివంతా చెదరని ఆశతో
ఎదురు చూస్తూనే ఉన్నాయి !
ఇప్పుడున్న ఈ నిశ్శబ్దం
ఈ నిర్మానుష్య చీకటి
బావురుమంటున్న ఆకుపచ్చ ఆవరణం
రేపటి రోజు మౌనం వీడి
బెరుకు భయం పాతరేసి
దిక్కులు పిక్కటిల్లేలా
భూకంపం సష్టించి
నేల పగుళ్లు నోర్లు తెరుచుకుని
దాగిన పిడికిళ్లు పైకెగసి
సతత హరిత వనాలను
మోదుగ పూల వసంతాలను
ఆవిష్కరించక తప్పదు !
డా|| కె. దివాకరాచారి,
9391018972
గాయాలు ఓటమి కాదు
- Advertisement -
- Advertisement -



