విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు
మిద్దెపంటలుగా సాగుచేస్తున్న స్మగ్లర్లు
అటవీ ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలకు చేరుతున్న వైనం
పరిమిత నియంత్రణలోనే ప్రభుత్వ విభాగాలు
ప్రజాచైతన్యాన్ని కోరుతున్న అధికారులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గంజాయి యువతరాన్ని మత్తులో ముంచి భవిష్యత్‌ను చిత్తుచేస్తోంది. గతంలో అటవీ ప్రాంతాలకే పరిమితమైన గంజాయి మొక్కల పెంపకం, ఇప్పుడు మిద్దె తోటల పంటగా మారింది. ఎవరికీ ఎలాంటి అనుమానాలు రాకుండా స్మగ్లర్లు బహుళ అంతస్తుల భవనాల టెర్రస్‌పై గంజాయిని సాగుచేస్తున్నారు. ఇటీవల ఎక్సైజ్ పోలీసులు జరిపిన దాడుల్లో భారీగా ఈ తరహా మిద్దెతోటలు వెలుగులోకి వచ్చాయి. గంజాయి అమ్మకాలకోసం ప్రత్యేకంగా కొన్ని కాలనీలే వెలిశాయి. చిత్ర విచిత్రమైన పద్ధతుల్లో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల డెలివరీ బార్సు రూపంలో ఇంటింటికీ వీటిని సరఫరా చేస్తున్నారు. ఎక్సైజ్ పోలీసులు ఇటీవల ఈ తరహా నేరస్తులను కూడా అరెస్టులు చేశారు. ఎక్సైజ్ పోలీసులు గంజాయి నియంత్రణకు పరిమితమవుతున్నారు తప్ప, పూర్తిగా నిర్మూలించే పరిస్థితులు కనిపించట్లేదు. స్మగ్లర్లు రకరకాల రూపాల్లో పంటలు పండిస్తున్నారు.
గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తున్నారు. పోలీసుల దాడుల్లో పట్టుపడుతున్న సరుకు కొద్దిపాటి మాత్రమే. డ్రగ్స్‌పై ఈగల్ టీం ప్రత్యేక దృష్టిపెట్టి, కేసులు నమోదు చేస్తూ, కట్టడి చేస్తుండటంతో ఇప్పుడు మత్తు ప్రియుల దృష్టి గంజాయిపై పడింది. హైదరాబాద్ వంటి పలు పబ్బులు, క్లబ్బుల్లో గంజాయి విరివిగా దొరుకుతున్నది. పోలీసుల దాడుల్లో ఇవన్నీ బయటపడుతున్నాయి. అయినా కొత్త రూపాల్లో మళ్లీ మళ్లీ సాగు, స్మగ్లింగ్ జరుగుతోంది. కొందరు యువకులు గంజాయి సేవించడమే కాకుండా, దాన్ని ఉపాధిగా కూడా మార్చుకుంటున్నారు. పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు. గతంలో గంజాయి ఔషధ మొక్కగా ఉపయోగించేవారు. వైద్యుల పర్యవేక్షణలో దీర్ఘకాలిక నొప్పులు, నిద్ర లేమికి ఔషధంగా వినియోగించే వారు.
కానీ కాలక్రమంలో ఇదో మత్తుమందుగా మారి, స్మగ్లర్లకు కామధేనువుగా మారింది. పొలాల్లో అంతర్‌పంటగా గంజాయిని సాగుచేస్తున్న ఘనులు ఉన్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో గంజాయి సాగు ఎక్కువగా ఉంది. దాన్ని తెలంగాణ మీదుగా స్మగ్లింగ్ చేస్తున్నారు. గంజాయి అమ్మకాలు చేస్తున్నవారిలో తమిళనాడు ప్రాంతానికి చెందిన కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని ఎక్సైజ్ పోలీసులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఏజెన్సీ (మన్యం) ప్రాంతాల్లో శీలావతి అనే రకం గంజాయి మొక్కను అధికంగా సాగుచేస్తున్నారు. స్వదేశీ, విదేశీ మార్కెట్లలో ఈ రకానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. మార్కెట్‌లో 5 గ్రాముల గంజాయి రూ. 500 వరకు ధర పలుకుంది. కిలో గంజాయి రూ. లక్ష ఆదాయాన్ని తెచ్చి పెడుతుంది.
సరదాగా అలవాటై…
యువతరం సరదా పేరుతో గంజాయి, డ్రగ్స్‌ను అలవాటు చేసుకుంటున్నది. అది వ్యసనంగా మారిన తర్వాత వినియోగదారుడే అమ్మకందారుడిగా మారుతు న్నారు. స్మగ్లర్లు ఈ వ్యవస్థను పెంచిపోషిస్తున్నారు. గంజాయి సేవిస్తే ఎలాంటి దుర్వాసన లేకపోవడంతో కుటుంబసభ్యులు కూడా చివరి వరకు తమ పిల్లల్ని గమనించలేకపోతున్నారు. మరికొందరు ఈజీ మనీ కోసం గంజాయి అమ్మకాలనే వృత్తిగా మార్చుకుంటున్నారు.
వందల ఎకరాల్లో సాగు.. వేల క్వింటాళ్ల దిగుబడి
విశాఖ ఏజెన్సీ ప్రాంతంతో పాటు, ఒడిశాలోని పర్వత ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో వేల ఎకరాల్లో గంజాయిని సాగు చేస్తారు. ఒక ఎకరానికి 450 నుంచి 500 గంజాయి మొక్కలు విస్తరించి ఉంటున్నాయి. ఒక ఎకరం గంజాయి సాగు చేస్తే రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు సంపాదన వస్తుండటంతో సంఘ విద్రోహులకు ఇదో లాభసాటి చట్టవ్యతిరేక వ్యాపారంగా మారింది. దానితో పాటు గంజాయి సాగు కేవలం 4 నెలల్లోనే దిగుబడిని ఇస్తుంది. ఈ పంట దిగుబడులు అధికంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో చేతికి వస్తాయని ఎక్సైజ్ పోలీసులు చెప్తున్నారు. విశాఖ ఎజెన్సీ ప్రాంతంలో కూడ ఇదే తరహాలో గంజాయి సాగు, దిగుబడి వస్తున్నాయని ఎక్సైజ్‌శాఖ అధికారులు చెప్తున్నారు.
ఒడిశాలో పండించిన గంజాయిని మల్కాన్‌గిరి జిల్లా పరిసర అటవీ ప్రాంతాల్లో డంప్‌లు ఏర్పాటు చేసుకుంటున్నారు. అటునుంచి తెలంగాణలోని ఖమ్మం, భద్రాచలం మీదుగా ఇతర రాష్ట్రాలకు అక్రమంగా వివిధ మార్గాల్లో రవాణా చేస్తున్నారు. గంజాయిని అధికంగా గోవా, మహరాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, కేరళ, బీహార్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్రాలకు రవాణా అవుతున్నది. ప్రయివేటు వాహనాలు, బస్సులు, రైళ్లలో గంజాయి రవాణ కొనసాగుతోంది. దొరికితే దొంగలు లేకుంటే లక్షాధికారులు అన్నట్టే ఈ స్మగ్లింగ్ వ్యవహారం నడుస్తోంది. ఇలాంటి కేసుల్లో అరెస్టు అయ్యి, జైలు నుంచి బయటకు వచ్చిన పాత నేరస్తులు మళ్లీ అదే బాటలో నడుస్తున్నారని తెలంగాణ ఎక్సైజ్‌శాఖ ఇటీవల చేసిన ఓ సర్వేలో వెల్లడైంది. గంజాయి ప్రాణంతకంగా మారడంతో కేంద్ర ప్రభుత్వం 1985లో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ యాక్ట్ (ఎన్‌పీడీఎస్)లో చేర్చింది.
హైదరాబాద్‌లో…
ఇటీవల హైదరాబాద్‌లో బహుళ అంతస్తుల భవనాలపై మిద్దె పంటగా గంజాయి సాగుచేస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. అక్కడ డొంక లాగితే, సిటీలో పలుచోట్ల ఇలాంటి మిద్దెసాగు జరుగుతున్నట్టు వెల్లడైంది. పత్తి, పసుపు, కంది చేనుల్లో గంజాయిని అంతరపంటగా వేసి సాగు చేస్తున్నారు. సిటీలో బీహార్, ఒరిస్సా, రాజస్థాన్ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వలస వచ్చిన కొందరు వ్యక్తులు గోదాంలు, అద్దె ఇండ్లపై మిద్దెతోటలు ఏర్పాటు చేసి గంజాయి మొక్కలు పెంచుతున్నారని విచారణలో తేలింది. తొలుత సొంత అవసరాల కోసం మిద్దె తోటల్లో గంజాయి మొక్కలు పెంచుకోవడం, ఆ తర్వాత దాన్ని వ్యాపారంగా మార్చడం పరిపాటిగా మారింది. ఈ ట్రెండ్ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్‌లో బాగా పెరిగింది.
వేలకిలోలు స్వాధీనం
తెలంగాణ ఎక్సైజ్‌శాఖ దాడుల్లో 2021 నుంచి 2025 సంవత్సరం వరకు 21,050 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. దానితోపాటు 24,245 కేజీల డ్రై గంజాయిని కూడా పట్టుకున్నారు.
ప్రజల్లో చైతన్యం రావాలి
గంజాయి మత్తు యువతరం భవిష్యత్‌ను నాశనం చేస్తున్నది. ప్రజలు దీనిపై చైతన్యవంతులు కావాలి. తమ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలపై నిఘా పెట్టాలి. అసాంఘీక కార్యక్రమాలు జరుగుతున్నట్టు అనుమానం వస్తే, తక్షణం పోలీసులు లేదా ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఫిర్యాదుదారుల వివరాల్ని గోప్యంగా ఉంచుతాం. రాష్ట్రంలోకి గంజాయి రాకుండా అరికట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాం. నవంబర్, డిసెంబర్ మాసాలు గంజాయి సాగు చేతికి వచ్చే కాలం. ఇప్పుడు ఎక్కువ మొత్తంలో స్మగ్లింగ్ జరుగుతూ ఉంటుంది. దీన్ని అడ్డుకొనేందుకు సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. మాతో పాటు టీజీ నాబ్, పోలీస్, ఈగల్ వంటి ఇతర నిఘా సంస్థలు కూడా గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పని చేస్తున్నాయి. విద్యాసంస్థల్లోకి గంజాయి ప్రవేశం కాకుండా కళాశాలల యాజమాన్యాలే చర్యలు తీసుకోవాలి. వారికి కావల్సిన సహకారాన్ని మేం అందిస్తాం. -షాన్వాజ్ ఖాసీం, డైరెక్టర్ ఆఫ్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, హైదరాబాద్
పట్టుబడింది ఇలా..
ఇటీవల ఎక్సైజ్ శాఖ హైదరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ చంద్రశేఖర్‌గౌడ్ పక్కా సమాచారంతో మలక్‌పేట గంజ్ ప్రాంతంలో ఇండ్లపై దాడులు చేశారు. అక్కడ బీహార్‌కు చెందిన కొందరు యువకులు మిద్దెతోటల్లో పదికిలోల గంజాయి మొక్కల్ని పెంచుతుండటాన్ని గమనించి, వాటిని స్వాధీనం చేసుకొని, నిందితుల్ని అరెస్టు చేశారు. అలాగే రంగారెడ్డి ఎక్సైజ్ డివిజన్‌లోని వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బర్వాద గ్రామంలో ఎక్సైజ్ పసుపు పంటలో అంతర్‌పంటగా గంజాయి సాగును గుర్తించి, దాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనివిలువ దాదాపు రూ.12 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో పలు చోట్లు ఈ తరహా సాగు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.



