Magazines

సార్వభౌమాధికారం ప్రజల చేతుల్లోనే ఉందా?

19 నిమిషాల క్రితం

sovereignty
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026 | 5 నిమిషాల చదవడం

నవంబర్ 26 భారత ప్రజాస్వామిక చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. 1949లో ఇదేరోజున రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని ఆమోదిం చింది. 1950 జనవరి 26 నుంచి అది అమల్లోకి వచ్చింది. వలస పాలన నుంచి విముక్తి పొందిన దేశం ఎలాంటి వ్యవస్థను నిర్మించుకోవాలన్న స్వాతంత్య్రో ద్యమ ఆకాంక్షలకు రాజ్యాంగం ఒక రూపాన్నిచ్చింది. ప్రజలే సార్వభౌమాధి కారులుగా ఉండే గణతంత్ర వ్యవస్థకు పునాదులు వేసింది. అందుకే నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే ఈరోజు ఒక చారిత్రక ఘట్టాన్ని గుర్తుచేసుకోవడానికే పరిమితం కాకూడదు. ఏడున్నర దశాబ్దాల తర్వాత కూడా రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలు పూర్తిగా నెరవేరాయా? వాటి అమలుకు అడ్డుపడుతున్న శక్తులేవి? ఈ సందర్భంగా మనం వేసుకోవాల్సిన ప్రశ్నలివి. రాజ్యాంగ పీఠిక ‘We, the People of India’ (భారత ప్రజలమైన మేము) అనే పదాలతో ప్రారంభమవుతుంది. దేశ సార్వభౌమాధికారం ప్రజలదేనని, వారి ఆకాంక్షలే పాలనకు ప్రాతిపదిక కావాలని ఈ పదాలు స్పష్టం చేస్తున్నాయి. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం రాజ్యాంగం నిర్దేశించిన మౌలిక లక్ష్యాలు.


ఇవి విడివిడిగా ఉండే సూత్రాలు కావు. ఒకదానితో మరొకటి విడదీయలేనంతగా ముడిపడిన ప్రజాస్వామిక విలువలు. స్వేచ్ఛ లేని చోట సమానత్వానికి, సమానత్వం లేని చోట సౌభ్రాతృత్వానికి అర్థం ఉండదు. ఈ విలువల ఆధారంగా ఎలాంటి సమాజాన్ని నిర్మించుకోవాలో రాజ్యాంగం నిర్దేశించింది. రాజ్యాంగ పరిషత్‌లో జరిగిన విస్తృత చర్చలు, భిన్నాభిప్రాయాల మధ్య సాగిన సమాలోచనలు ఈ పత్రానికి ప్రజాస్వామిక స్వభావాన్ని ఇచ్చాయి. ఈ సమిష్టి కృషిలో ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కీలక పాత్ర పోషించారు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు పౌరులకు సమాన త్వాన్ని, స్వేచ్ఛను కల్పిస్తున్నాయి. 14 నుంచి 17వ అధికరణాలు చట్టం ముందు సమానత్వం, వివక్ష నిషేధం, ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు, అంటరానితనం నిర్మూలనకు హామీ ఇస్తున్నాయి. 19వ అధికరణం భావ ప్రకటనా స్వేచ్ఛ సహా పలు స్వేచ్ఛలను కల్పించింది. 21వ అధికరణం జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తోంది. ఇవి కేవలం రాజ్యాంగ పుస్తకంలో ఉన్న హామీలు కావు. ప్రతి పౌరుడి గౌరవప్రదమైన జీవితానికి అవసరమైన హక్కులు.


ఆదేశిక సూత్రాలు కూడా రాజ్యాంగ లక్ష్యాలను స్పష్టం చేస్తున్నాయి. ప్రజల మధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను తగ్గించి సంక్షేమాన్ని పెంపొందించాలని 38వ అధికరణం చెబుతోంది. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూడా లని, ప్రజా ప్రయోజనాలకు అనుగు ణంగా వనరుల పంపిణీ జరగాలని 39వ అధికరణం నిర్దేశిస్తోంది. ఈ సూత్రాలకు దేశ పాలనలో మౌలికమైన స్థానం ఉందని 37వ అధికరణం స్పష్టం చేస్తోంది. రాజ్యాంగం ఆమోదం పొందడానికి ముందు రోజు, 1949 నవంబర్ 25న రాజ్యాంగ పరిషత్‌లో అంబేద్కర్ చేసిన ప్రసంగం నేటికీ మనకు మార్గ దర్శకంగా నిలుస్తుంది. రాజకీయంగా మనకు సమానత్వం లభించినా, సామాజికంగా, ఆర్థికంగా అసమానతలు కొనసాగితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడు తుందని ఆయన హెచ్చరించారు. ఒక వ్యక్తికి ఒక ఓటు, ఒక ఓటుకు ఒక విలువ అనే రాజకీయ సమానత్వం, మన సమాజంలోని అసమానతలతో ఎంతకాలం కలిసి సాగగలదని ప్రశ్నించారు. రాజకీయ ప్రజాస్వామ్యానికి సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యం పునాది కావాలని ఆయన నొక్కిచెప్పారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఒకదానిని మరొకటి విడిచిపెట్టి మనుగడ సాగించలేవన్న ఆయన మాటల ప్రాధాన్యం నేటి పరిస్థితుల్లో మరింత పెరిగింది.

కానీ నేడు దేశంలో రాజ్యాంగ విలువలకు అనేక వైపుల నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. మతం పేరుతో సమాజాన్ని విభజించే రాజకీయాలు బలపడుతున్నాయి. మతపరమైన విద్వేషం, మైనారిటీలపై దాడులు, వివక్ష ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీ స్తున్నాయి. లౌకికతత్వం, సౌభ్రాతృత్వం బలహీనపడు తున్నాయి. మెజారిటీ మతతత్వమైనా, మైనారిటీ మతతత్వమైనా ప్రజల ఐక్యతకు, లౌకిక ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించేవే. మత విశ్వాసం వ్యక్తిగత హక్కు. దాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఈ మతతత్వ రాజకీయాలు ప్రజల మధ్య విభజనను పెంచుతుంటే, అసమ్మతిని అణచివేసే ధోరణులు ప్రజాస్వామిక స్వేచ్ఛను కుదిస్తున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యంలో కీలకమైనది. కానీ ప్రశ్నించే గొంతులపై ఒత్తిడి పెరుగుతోంది. జర్నలిస్టులు, మేధావులు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలపై నిర్బంధ ధోరణులు, ప్రజా ఉద్యమాలపై ఆంక్షలు భావప్రకటనా స్వేచ్ఛను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడం మాత్రమే కాదు. ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడగలగాలి, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించగలగాలి, తమ హక్కుల కోసం సంఘటితంగా పోరాడగలగాలి.


ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు ప్రజల పరిశీలనకు, విమర్శకు లోబడి ఉండాలి. అసమ్మతి ప్రజాస్వా మ్యానికి ముప్పు కాదు, అధికారాన్ని జవాబుదారీగా ఉంచే ప్రక్రియలో భాగం. ఈ స్వేచ్ఛలకు రక్షణ కల్పించాల్సిన ప్రజాస్వామిక సంస్థలు స్వతంత్రంగా, జవాబుదారీతనంతో పనిచేయాలి. పార్లమెంటు, న్యాయ వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థతో పాటు స్వతంత్ర మీడియా పాత్రను కాపాడటం ప్రజాస్వామ్య మనుగడకు అవసరం. ఈ సంస్థలు అధికారానికి జవాబుదారీ తనాన్ని నిర్ధారించాల్సిన చోట, అవే అధికార ప్రభావానికి లోనైతే రాజ్యాంగ వ్యవస్థ సమతుల్యత దెబ్బతింటుంది. నేడు ఈ అధికార కేంద్రీకరణ, సంస్థల స్వతంత్రతను బలహీనపరిచే ధోరణులు తీవ్రమైన సవాళ్లుగా నిలుస్తున్నాయి. రాజ్యాంగం సామాజిక, ఆర్థిక న్యాయానికి ఇచ్చిన హామీకి నేటి ఆర్థిక విధానాలు విరుద్ధంగా సాగుతున్నాయి. దేశ సంపద, ఉత్పత్తి వనరులు కొద్దిమంది కార్పొరేట్ల చేతుల్లో కేంద్రీకృతమవు తున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక హక్కులపై దాడులు, వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం, ధరల పెరుగుదల సామాన్య ప్రజల జీవితాలను కష్టాల్లోకి నెడుతున్నాయి. విద్య, వైద్యం అందని ద్రాక్షలుగా మారుతున్నాయి.


సంపదతో పాటు రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చేసే శక్తి కూడా కొద్దిమంది చేతుల్లోకి చేరుతోంది. ఆర్థిక అసమానతలు పెరుగుతున్నప్ప్పుడు రాజకీయ సమానత్వం కూడా బలహీనపడుతుంది. సంపద కేంద్రీక రణను అరికట్టాలని రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యానికి ఇది పూర్తి విరుద్ధం. కుల వివక్ష, అంటరానితనం, దళితులపై దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివాసీల భూమి, అటవీ హక్కులకు భంగం కలుగుతోంది. మహిళలపై హింస, వివక్ష సమాజంలో అసమానతలు ఎంతలోతుగా ఉన్నాయో తెలియ జేస్తున్నాయి. చట్టాలు చేయడం, హక్కులను ప్రకటించడం మాత్రమే సరిపోదు.. అవి ప్రజల జీవితాల్లో అమలైనప్ప్పుడే నిజమైన మార్పు వస్తుంది. కుల, మత, లింగ వివక్షలను నిర్మూలిం చకుండా సామాజిక సమానత్వం సాధ్యం కాదు. ఈ పరిస్థితులపై భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 24వ మహాసభ రాజకీయ తీర్మానం స్పష్టమైన వైఖరిని ప్రకటించింది. హిందూత్వ-కార్పొరేట్ కూటమి, నయా ఉదారవాద విధానాలు, ప్రజాస్వామిక హక్కులపై దాడులను దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లుగా పేర్కొంది. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, యువత ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చింది. లౌకిక, ప్రజాస్వామిక శక్తుల ఐక్యతతో పాటు ప్రజానుకూల ప్రత్యామ్నాయ విధానాల అవస రాన్ని నొక్కిచెప్పింది.


రాజ్యాంగ విలువలను కాపాడాలంటే వాటికి విరుద్ధంగా ఉన్న విధానాలను, రాజకీయాలను కూడా ప్రశ్నించాల్సిందే. రాజ్యాంగ పరిరక్షణ ప్రభుత్వాలకో, న్యాయస్థానాలకో మాత్రమే పరిమితమైన బాధ్యత కాదు. అది ప్రజలది కూడా. ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడే కార్మిక, రైతు, విద్యార్థి, మహిళా ఉద్యమాలు, కులవివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటాలు, లౌకికతత్వం, పౌర హక్కుల ఉద్యమాలు రాజ్యాంగ స్ఫూర్తిని బలోపేతం చేస్తాయి. ప్రజలు తమ హక్కుల పట్ల చైతన్య వంతులై, వాటి కోసం సంఘటితంగా నిలబడినప్ప్పుడే రాజ్యాంగం పుస్తకంలోని అక్షరాల నుంచి ప్రజల జీవితాల్లోకి వస్తుంది. రాజ్యాంగాన్ని కాపాడటం అంటే దాని ప్రతులను చేతబూని నినాదాలు చేయడం మాత్రమే కాదు. అది హామీ ఇచ్చిన స్వేచ్ఛను కాపాడటం, సమానత్వాన్ని ఆచరణలోకి తేవడం, లౌకికతత్వాన్ని నిలబెట్టడం, సంపద కేంద్రీకరణను అడ్డుకోవడం, సామాజిక-ఆర్థిక న్యాయాన్ని సాధించడం. ప్రజాస్వామ్యాన్ని ఎన్నికలకే పరిమితం చేయకుండా ప్రజల జీవన హక్కుగా విస్తరించడం. రాజ్యాంగం ప్రజల కోసం రూపొందింది. దాని నిజమైన రక్షకులు కూడా ప్రజలే. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతిఫలించినప్ప్పుడే రాజ్యాంగ లక్ష్యం నెరవేరుతుంది. సామాజిక, ఆర్థిక న్యాయం కోసం సాగించే పోరాటాలు మరింత విస్తరించాలి. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మనం తీసుకోవాల్సిన ప్రతిజ్ఞ ఇదే. రాజ్యాంగం బతకాలంటే ప్రజాస్వామ్యం బతకాలి. ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రజల హక్కులు, ప్రజల ఐక్యత, ప్రజల పోరాటాలు బతకాలి. ప్రజలే సార్వభౌములు, ప్రజల ఆకాంక్షలే పాలనకు పునాది అని చెప్పిన అంబేద్కర్‌ ఆశయ స్ఫూర్తిని నిలబెట్టడమే మన కర్తవ్యం.


రమేష్‌ రాంపల్లి

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్