అడవి ఆదివాసీలకు కేవలం నివాస స్థలం కాదు. అది వారి జీవనాధారం, సంస్కృతి, సంప్రదాయం, ఆత్మగౌరవం. ప్రకృతితో కలిసి జీవించాలనే జీవన తత్వం ఆదివాసీలది. నేల, నీరు, అడవి, కొండలు, వాగులతో వారి జీవితం పెనవేసు కుని ఉంటుంది. ప్రత్యేకమైన భాషలు, సంస్కృతు లు, ఆచారాలు, సామూహిక జీవన విధానాలు, ప్రకృతి జ్ఞానం ఆదివాసీ సమాజ ప్రత్యేకతలు. పోడు వ్యవసాయం, చిరుధాన్యాల సాగు, అటవీ ఉత్పత్తుల సేకరణ, పశుపోషణ, ప్రకృతి ఆధారిత వైద్యం వారి జీవనంలో భాగంగా ఉండేవి. అయితే అడవుల విస్తీర్ణం తగ్గడం, భూముల హక్కుల సమస్యలు, ప్రాజెక్టులు, గనుల తవ్వకాలు, వలసలు, నిరుద్యో గం వారి జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. అభివృద్ధి పేరుతో ఆదివాసీల హక్కులకు, అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే వారి అస్తిత్వమే ప్రమాదంలో పడుతుంది.
చట్టాలున్నాయి.. హక్కులు అందుతున్నాయా?
ఆదివాసీల హక్కుల పరిరక్షణకు రాజ్యాంగం, పలు చట్టాలు రక్షణ కల్పించాయి. రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఆదివాసీల భూములు, ఆచారాలు, సామాజిక ప్రయోజనాలను రక్షిస్తుంది. 1996 పెసా చట్టం గ్రామసభలకు స్వయంపాలన, సామూహిక వనరుల పరిరక్షణలో అధికారాలు కల్పిస్తుంది. 2006 అటవీ హక్కుల చట్టం వ్యక్తిగత, సామూహిక అటవీ హక్కులను గుర్తిస్తుంది. 1/70 భూ బదలాయింపు నియంత్రణ చట్టం ఆదివాసీల భూములు గిరిజనేతరుల చేతుల్లోకి వెళ్లకుండా నిరోధిస్తుంది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం-1989 వివక్ష, దాడులు, భూ ఆక్రమణల నుంచి రక్షణ కల్పిస్తుంది. అయినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం, అవగాహన లోపం, ప్రక్రియల జాప్యం, భూ రికార్డుల సమస్యలతో హక్కులు పూర్తిస్థాయిలో అందడం లేదు. 2025 డిసెంబర్ 31 నాటికి తెలంగాణలో అటవీ హక్కుల చట్టం కింద 3,29,367 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2026 ఫిబ్రవరి 11న రాజ్యసభకు వెల్లడించింది. ఇందులో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 28,964, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 46,244 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అర్హులైన వారికి హక్కులు అందాలి. గ్రామసభల నిర్ణయాలకు ప్రాధాన్యతనిస్తూ పెసా చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలి.
ఆదివాసీల భాగస్వామ్యంతోనే అభివృద్ధి
ఆదివాసీ ప్రాంతాల్లో విద్య, వైద్యం, తాగునీరు, రోడ్లు, విద్యుత్, ఉపాధి వంటి మౌలిక సదుపాయా లు కల్పించాలి. ప్రతి కుటుంబానికి సాగు భూమి, వ్యక్తిగత, సామూహిక అటవీ హక్కులు అందాలి. మాతృభాషలో విద్య, ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించాలి. అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. ఆదివాసీ మహిళలకు విద్య, ఆరోగ్యం, ఉపాధి, ఆర్థిక స్వావలంబనతోపాటు గ్రామసభల్లో నిర్ణయాధికా రంలో భాగస్వామ్యం కల్పించాలి. యువతకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ప్రాజెక్టులు, గనులు, పరిశ్రమల నిర్మాణంలో గ్రామసభల పాత్రకు, ఆదివాసీల హక్కులకు, పునరావాసం, పరిహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అభివృద్ధి పేరుతో నిర్వాసితులుగా మార్చడం అభివృద్ధి కాదు. హక్కుల సాధనకు ఆదివాసీల్లో చైతన్యం పెరగాలి. తమ సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా పోరాడాలి. ఇందులో ప్రజాస్వామిక, మహిళా, విద్యార్థి, కార్మిక, రైతు సంఘాలు భాగస్వాములు కావాలి.
రాష్ట్ర మహాసభలను జయప్రదం చేద్దాం!
నవంబర్ 27, 28, 29 తేదీల్లో ఆసిఫాబాద్లో జరగనున్న తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మహాసభలు కేవలం నాయకత్వ ఎన్నికలకే పరిమితం కాకుండా ఆదివాసీ సమస్యలపై సమగ్ర చర్చకు, హక్కుల అమలులోని అడ్డంకుల విశ్లేషణకు, భవిష్యత్ పోరాటాల కార్యాచరణ రూపకల్పనకు వేదిక కావాలి. ఆదివాసీ యువత, మహిళలు, విద్యార్థులు, రైతులు, కూలీలు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలి. అడవిని కాపాడే చేతులకు భూమిపై హక్కులు దక్కాలి. వారి భాషకు గుర్తింపు, సంస్కృతికి గౌరవం, జీవితానికి భద్రత కల్పించాలి. ఆదివాసీలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే స్థాయికి ఎదగాలి. ప్రజాస్వామిక వాదులు, మేధావులు, మహిళలు, యువత, విద్యార్థులు ఈ మహాసభలకు సంఘీభావం తెలిపి విజయవంతం చేయాలి. ఆదివాసీ అస్తిత్వాన్ని కాపాడాలి! ఆదివాసీ హక్కులను సాధించాలి!
పూర్ణిమా యర్రంశెట్టి 9676439996






కామెంట్లు (0)