‘‘ప్రియమైన మిత్రులారా, నేను మీకు గత పన్నెండేండ్ల కాలంలో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ప్రాధాన్యతనిస్తూ, కార్పొరేట్ టాక్స్‌ను 30శాతం నుంచి 22 శాతానికి తగ్గించాను. నాకు తెలుసు, మీకు దాహం తీరలేదని, అయినప్పటికీ కూడా నేను మీరందరూ కొన్ని ఉద్యోగాలైనా సృష్టిస్తారని ఆశించాను. అదీ జరగలేదు. అంతేకాకుండా, నేను వ్యక్తిగత ఆదాయ పన్ను పన్నెండు లక్షల వరకు మినహాయించాను, మీరెంతో లాభాలు సంపాదించినప్పటికీ ఉద్యోగుల జీతాలలో ఏమాత్రం పెరుగుదల లేదు. ఇది మీకు సమంజసమేనా అని నేను అడుగుతున్నాను’’ ఈ మాటలు ఎవరో సాధారణ వ్యక్తి పలికినవి కాదు. సాక్షాత్తూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాపార సామ్రాజ్యాధిపతులకు ప్రాతినిధ్యం వహించే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఎఫ్ఐసిసిఐ) తన శత వసంతాలు నిండిన సందర్భంగా నిర్వహించిన కన్వెన్షన్‌లో మాట్లాడిన మాటలివి. కార్పొరేట్ కంపెనీల నిర్లక్ష్యాన్ని స్వయంగా ప్రధానే ఎండగట్టడం అందరినీ ఆశ్చర్య పరిచింది.
కార్పొరేట్లపై అత్యంత ప్రేమను ప్రదర్శిస్తారని ముద్రపడిన ప్రధాని ఈ విధంగా కర్రు కాల్చి కార్పోరేట్లకు వాత పెట్టే ప్రయత్నం చేయడం ఆహ్వానించదగినదే. అయినప్పటికీ దాని వెనక ఏదైనా మతలబు ఉందన్న అనుమానాలను కొట్టి పారేయలేం. ప్రధానే వారిని ప్రశ్నించడంతో ప్రభుత్వ విధానాల వైఫల్యాలను స్వయాన ఒప్పుకున్నట్టయింది.
మోడీ ఆధ్వర్యంలో కార్పొరేట్ కంపెనీలకు అందింది కేవలం పన్ను రాయితీలు మాత్రమే కాదు, అంతకుమించి గత సాధారణ బడ్జెట్లలో దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ‘‘ఎంప్లాయిమెంట్ ఇన్సెంటివ్’’ పేరున ప్రతి నెలకు రూ.3వేలు, 24 నెలల పాటు కొత్త ఉద్యోగాలు కల్పించిన కంపెనీకి చెల్లించేలా ఒక పథకాన్ని ప్రారంభించారు. అయితే ఈ పథకం కింద అనేక మంది యజమానులు ఉద్యోగాల కల్పన పేరుతో ఇంతకుముందే ఉద్యోగాలు కల్పించిన వారిని కొత్త ఉద్యోగాలు కల్పించినట్లుగా చూపించి, తాము చెల్లిస్తున్నటువంటి జీతంలో మూడు వేలు ప్రభుత్వం నుంచి రాబట్టుకోవడం జరిగిందని అనేక వార్తలు వెలువడ్డాయి.
బాధాకరం ఏంటంటే ఏ కంపెనీలు ఎన్ని ఉద్యోగాలు కల్పించాయో, ఎంత మందికి అలాంటి వెసులుబాటు దొరికిందో ప్రభుత్వం దగ్గర ఎక్కడా లెక్కలు ఉన్నట్టుగా కూడా తెలియదు. అంచేత ప్రభుత్వ పన్ను రాయితీలు, ఇన్సెంటివ్‌లు పొంది ప్రతిఫలానికి నోచుకోని వారి నుంచి ప్రతీ పైసా వసూలు చేసే విధానముంటే గాని జవాబుదారితనం కనపడదు.
కార్పొరేట్ కంపెనీల పనితీరు ఎందుకిలా ఉన్నదంటే ప్రభుత్వం కంపెనీలకు ఇస్తున్న ఇన్సెంటివ్‌లు లేదా ప్రోత్సాహకాల పర్యావసానాలను పర్యవేక్షించే యంత్రాంగం లేదు. అలా ఉంటే, కల్పించవలసిన ఉద్యోగాల సంఖ్యను, వారి వ్యాపార సామ్రాజ్య విస్తరణను ప్రభుత్వ యంత్రాంగం అంచనా వేయగలుగుతుంది. అలా కొలిచినప్పుడు కచ్చితంగా ఏ కంపెనీ ఎంతమంది ఉద్యోగులను పెట్టుకోవాలన్న నిబంధనను పాటిస్తుందో, లేదో చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇదే సందర్భంలో మోడీ గమనించాల్సిన అంశం ఏమిటంటే ప్రభుత్వం కూడా ఉద్యోగాల కల్పనలో పెద్దన్న పాత్ర పోషించాల్సి ఉంది. దాన్ని పూర్తిగా ప్రభుత్వం విస్మరించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రైల్వే వంటి డిపార్ట్మెంట్లు లెక్కలోకి తీసుకుంటే అనేక లక్షల ఉద్యోగాలు దాదాపు దశాబ్ద కాలం నుంచి ఖాళీగా ఉన్నాయి.
వాటిని భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వ విభాగాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అదేవిధంగా రైల్వే, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఇతర డిపార్ట్మెంట్లలో రిక్రూట్మెంట్లకు అనుమతులు కూడా కేంద్రం ఇవ్వడం లేదు. అంటే ఉద్యోగాల కల్పన కోసం కృషి చేయాల్సిన ప్రభుత్వం పూర్తిగా తమ కర్తవ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉన్నది. గడిచిన ఆగస్టులో నిటి ఆయోగ్ తన రిపోర్ట్‌లో స్పష్టంగా చెప్పిందేమంటే ఈ దేశంలోని యువతలో 25శాతం మంది అనగా 8.7 కోట్ల యువత ఉద్యోగంలో కానీ, చదువులో కానీ, ఏ రకమైన శిక్షణలో కానీ లేదు. అంటే పనీపాట లేక దిక్కుతోచకున్నారని అర్థం. ఇంతటి కఠోర వాస్తవాలను కేంద్ర ప్రభుత్వ సంస్థలే మనముందు పెట్టినప్పుడు కేంద్రం విధిగా దానిపై స్పందించి ప్రభుత్వం కానీ లేదా ప్రైవేటు వ్యవస్థల్లో కానీ ఉద్యోగాల కల్పన జరిగి ఉంటే ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ ఇంత నత్తనడకన సాగేది కాదు.
కార్పొరేట్లు ప్రభుత్వాల దగ్గర తీసుకున్న కన్సెషన్‌కి ప్రతిఫలంగా ఉద్యోగాల కల్పన చేస్తారన్న భ్రమ ఈ ప్రభుత్వానికి ఉండవచ్చు కానీ అలాంటిది జరగదని అనేక సందర్భాలలో నిపుణులు, కార్మిక సంఘాలూ హెచ్చరించాయి.
అంటే కార్పొరేట్లకు ఇన్సెంటివ్‌లు ఇవ్వడం ద్వారా కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుంది లేదా మార్కెట్లో వస్తువులు చౌకగా దొరుకుతాయన్నది వాస్తవ రూపం దాల్చదు. మోడీ స్పష్టంగా చెప్పిన విధంగా కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వం దగ్గర ఇన్సెంటివ్స్ తీసుకొని వారి లాభార్జనను పెంచుకున్నాయే తప్ప, ఎప్పుడు కూడా ఉద్యోగాల కల్పన గానీ, వస్తువులను చౌకగా అమ్మడం కానీ జరగలేదు. బయటపడిన గణాంకాల ప్రకారం గడిచిన ఏడేండ్ల కాలంలో కార్పొరేట్ కంపెనీల లాభాల వాటా 22.3శాతం పెరగగా ఉద్యోగుల జీతాలలో కేవలం 1.5శాతం మాత్రమే మెరుగుదల కనిపించింది. దాంతో పాటు ఉద్యోగుల జీతాలలో మెరుగుదల, ఒకవేళ ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకుంటే, అత్యంత శోచనీయంగా, అది మైనస్‌లో కూడా నమోదైంది. గణాకాల మంత్రిత్వ శాఖ అక్టోబర్ 2025 లో వెలువరించిన వివరాల ప్రకారం 2017లో రూ. 16, 538గా ఉన్న సగటు కంపనీ ఉద్యోగి జీతం, 2024 లో 21,103 వరకు పెరిగింది. అనగా 3.5శాతం పెరిగింది. ఈ కాలంలో ద్రవ్యోల్బణం 4.9శాతంగా ఉన్నది. అంచేత జీడీపీ వృద్ధి 7.8శాతం అని చెప్పినప్పటికీ కొనుగోలు శక్తిలో మార్పు కనిపించలేదు.
కార్పోరేట్ కంపనీలకిచ్చింది కేవలం పన్ను రాయితీలు మాత్రమే కాదు, వ్యాపారాల సౌలభ్యం కోసం చట్టాలలో మార్పులు తెచ్చి కార్మికులను విచ్ఛలవిడిగా వినియోగించుకునే వెసులుబాటు నూ కల్పించింది కేంద్రం.
29 కేంద్ర కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడ్స్‌గా రూపొందించడంతో ఉద్యోగుల హక్కుల పరిది (స్కోప్) కుంచించుకు పోయింది. సమానపనికి సమాన వేతనమనే (EPEW-1976) కాన్సెప్ట్ కు పాలకులు చరమగీతం పాడేశారు. వేతనాల కల్పనలో వున్న నిబంధనలను యాజమాన్యానికి వదిలేస్తూ వేతనాల కోడ్-2019 రూపొందించడంతో క్రమం తప్పకుండా వేతనాలు పెంచాలన్న బాధ్యతను యాజమాన్యాలు వదిలేశాయి. వేతనాలు నిర్ణీత క్యాడర్‌కు నిర్ణీత పద్ధతిలో కాకుండా పరస్పర అంగీకారంతో వ్యక్తులతో ఒప్పందాలు చేసుకోవచ్చనే వెసులుబాటు ఇదే కోడ్ కల్పించడంతో సంస్థలోని అందరి బాగోగుల కన్నా కావలసిన వారి కడుపు నింపే పద్ధతిని యాజమాన్యాలు పాటిస్తున్నాయి. ఉద్యోగాల కల్పనపై మేనేజ్మెంట్ల ఈ నిర్లక్ష వైఖరి రాజకీయాలతో, ఆర్థిక వ్యవస్థ గతితో ముడిపడి ఉంది. రాజకీయ పార్టీలకు ఎన్నికల నిధులూ, పార్టీ ఫండ్ లు సమకూరుస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు కార్పోరేట్లు. ఇలాంటి ఆశ్రిత విధానాలను స్వస్తి చెప్పనంతవరకు ఫలితాలలో మార్పు రాదు.
జి.తిరుపతయ్య, 9951300016






కామెంట్లు (0)