Magazines

గిరిజన వసతి గృహంలో కలకలం..!

12 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

డిగ్రీ విద్యార్థిని ప్రసవం.. శిశువు మృతి

పోలీసు, వైద్య, ఐసీడీఎస్‌ అధికారుల విచారణ

నవతెలంగాణ-మహబూబాబాద్

మహబూబాబాద్ జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీ హాస్టల్‌లో విద్యార్థిని ప్రసవించడం, శిశువు మృతి చెందడం కలకలం సృష్టించింది. అసలు సంక్షేమ గిరిజన హాస్టల్‌‌లో ఏం జరుగుతుందంటూ ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది జులై డిగ్రీ మొదటి సంవత్సరంలో ఒక బాలిక ట్రైబల్‌ వెల్ఫేర్‌ డిగ్రీ కాలేజీ హాస్టల్‌లో జాయినైంది. ప్రతినెలా వైద్య పరీక్షలు నిర్వహిస్తుండగా ఎలాంటి విషయం బయటపడలేదు. తల్లిదండ్రులు, బంధువులు, తోటి స్నేహితులకు కూడా సదరు విద్యార్థి ఏమీ చెప్పలేదు. కళాశాల రిజిస్టర్‌లో ప్రతినెలా రుతుస్రావం సక్రమంగా వస్తున్నట్టు సంతకం చేసింది. బుధవారం కళాశాలలో అసెంబ్లీ అనంతరం బాత్‌రూమ్‌లో మృత శిశువు ఉన్నట్టు విద్యార్థులు గుర్తించి ప్రిన్సిపాల్ బిందు మాధురికి తెలిపారు. విద్యార్థులందరినీ సమూహపరిచి వివరాలు సేకరించారు. ఇద్దరు విద్యార్థులు అనుమానాస్పదంగా కనిపించడంతో అందులో ఒక విద్యార్థిని తానే అంటూ ఒప్పుకుంది. ఆమెకు 18ఏండ్లు. ఈ ఘటనపై జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారులు శిరీష, ఐసీడీఎస్‌, పోలీస్ అధికారులు కళాశాలకు వచ్చి విచారణ చేపడుతున్నారు. మృత శిశువును పోస్టుమార్టం గదికి తరలించి విద్యార్థినిని ప్రభుత్వ ఆస్ప్రతికి తరలించారు. శిశువు వయసు సుమారు నాలుగు నెలలు ఉంటుందని అంచనా. సదరు విద్యార్థిని మైనర్‌గా ఉన్నప్పుడే గర్భం దాల్చినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై బాధ్యులు ఎవరనేది పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. ఇదే కళాశాలలో గతంలో ఇద్దరు విద్యార్థులు అర్ధరాత్రి గోడ దూకి పారిపోయిన ఘటనలున్నాయి. మూడు రోజుల తర్వాత దొరికారు. ఈ కళాశాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, ప్రిన్సిపల్ పనితీరు వివాదాస్పదంగా ఉంటుందని పలువురు విద్యార్థులు అంటున్నారు. కాగా, ​ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై, కళాశాల ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్