నీటి కొరత ఆధారంగా ఎంపిక చేయాలి
కేంద్రం సాయం ప్రకటించాలి: టీఆర్‌ఎస్ చీఫ్ కవిత
భవిష్యత్తులో వామపక్షాల సహకారం తీసుకుంటాం
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
‘కరువు మీద, ఎల్‌నినో మీద రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కరువు మండలాల ప్రకటనపై కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు చేసిన తర్వాత ఇక్కడ మిగతా పక్షాలు ఒత్తిడి తీసుకొస్తేనే ఆదరబాదరగా కరువు మండలాలను ప్రకటించింది. అవి కూడా లోపభూయిష్టంగా ఉన్నాయి. వర్షపాతం ఆధారంగా కాకుండా నీటి వనరుల లోటు ఆధారంగా కరువు మండలాలను ప్రకటించాలి’ అని టీఆర్‌ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. నిజామాబాద్‌లో 18, కామారెడ్డిలో 4 మాత్రమే ప్రకటించడం దారుణం. ఇంకా నీటి కొరత ఉన్న మండలాలు చాలా ఉన్నాయి. శాస్ర్తీయంగా గుర్తించాలని అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కరువు మండలాలకు కేంద్రం ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరారు. ఎంపీలు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకొచ్చేలా వాదించాలన్నారు. ప్రస్తుతం కరువు పరిస్థితుల నేపథ్యంలో విబీ గ్రామ్ జీ కింద కనీస వేతనం రూ.350 నిర్దారించి 200 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆరుతడి పంటలు వేయాలని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఏ పంటలు వేయాలి, ఎంత మేర కొనుగోలు చేస్తారు, ధర ఎంత ఇస్తారో, కరెంట్ ఎన్ని గంటలు సరఫరా చేస్తారో ప్రకటించలేదని అన్నారు. ప్రజా సమస్యలపై ఇప్పటి వరకు ప్రశ్నిస్తూ వచ్చాం కానీ ప్రత్యక్ష పోరాటాలు చేపట్టలేకపోయామని కవిత అన్నారు. నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమించాల్సి ఉందన్నారు. త్వరలో కమిటీలను ప్రకటించి ప్రజా పోరాటాలు చేపడతామని తెలిపారు.
కార్పొరేట్ల కోసమే ఇంటర్ విలీనమన్నారు. రెండేండ్ల ఇంటర్ విద్యకు కార్పొరేట్ కాలేజీలు నాలుగు లక్షల వరకు ఫీజు వసూలు చేస్తున్నాయని కవిత అన్నారు. వాటికి రూ.8 లక్షలు వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్టుందని తెలిపారు. ఇంటర్ విద్యతో ఉన్న సమస్య ఏముందో చెప్పకుండా న్యూ ఎడ్యూకేషన్ పాలసీ పేరుతో విలీనం చేయడం సరికాదన్నారు. తాను సెంట్రిస్ట్ అయినప్పటికీ రైట్ కంటే లెఫ్ట్ భావాజాలం తనకిష్టమని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. భవిష్యత్తులో వామపక్షాల సహకారం తీసుకుంటామని తెలిపారు.





కామెంట్‌లు (0)