ప్రపంచస్థాయిలో రాణించేలా క్రీడాకారులకు ప్రోత్సాహం
క్రీడాకారులకు ఆర్థిక సహకారంతో పాటు ఉద్యోగ అవకాశాలు
గెలుపోటములను సమానంగా స్వీకరించి లక్ష్యం దిశగా సాగాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
చర్లలో రాష్ట్రస్థాయి అండర్-17 బాలుర వాలీబాల్ పోటీల ముగింపు వేడుకలు
నవతెలంగాణ-చర్ల
తెలంగాణను క్రీడారంగంలో దేశానికే ఆదర్శంగా నిలపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రపంచస్థాయిలో రాణించేలా క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు ఆర్థిక సహకారం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. రాబోయే మూడు, నాలుగు సంవత్సరాల్లో క్రీడారంగంలో తెలంగాణను ప్రత్యేక స్థానంలో నిలుపుతామన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-17 బాలుర వాలీబాల్ పోటీల ముగింపు వేడుకల్లో మంత్రి పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. మంత్రి పర్యటనలో భాగంగా తొలుత కుదునూరు గ్రామంలో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఐటీడీఏ భద్రాచలం ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న గిరిజన బాలికల వసతి గృహ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం చర్లలో జరిగిన వాలీబాల్ పోటీల ముగింపు వేడుకలకు హాజరై నల్లగొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లా జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ను ప్రారంభించి వీక్షించారు. విజయం సాధించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా జట్టును అభినందించారు.
విజేతలు, రన్నరప్ జట్లతో పాటు మూడో స్థానం కోసం జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ.. క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఖేలో ఇండియా కార్యక్రమాన్ని రాష్ట్రంలో నిర్వహిం చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచేవారికి ఆర్థిక సహకారంతో పాటు ఉద్యోగ అవకాశాల్లోనూ ప్రోత్సాహం అందిస్తామన్నారు.
మారుమూల గిరిజన ప్రాంతమైన చర్లలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గతంలో ఈ ప్రాంతానికి రావాలంటే అనేక ఇబ్బందులు ఎదురయ్యేవని, ప్రస్తుతం ప్రశాంత వాతావరణంలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించే స్థాయికి చేరడం సంతోషకరమని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు, ఇతర ఆకర్షణలకు దూరంగా ఉండి క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. ఇందుకోసం క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి చేసిన పోలీసు అధికారులను, వారి బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని, విజయం సాధించినవారు మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలని, ఓటమి పాలైనవారు నిరుత్సాహపడకుండా పట్టుదలతో సాధన కొనసాగించాలని సూచించారు.
ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
వాలీబాల్తో పాటు అన్ని క్రీడల్లో ప్రతిభ కనబరిచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, క్రీడా ఉపాధ్యాయులు, కోచ్లు, రిఫరీలు, క్రీడాకారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.





కామెంట్లు (0)