ఓ బీజేపీ కార్పొరేటర్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు
విచారణ షురూ.. 28న తేలే అవకాశం
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
కార్పొరేటర్ పదవి కోసం ఓ బీజేపీ అభ్యర్థి కులం మార్చుకున్న ఆరోపణలు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో చర్చనీయాంశంగా మారింది. బీసీ సామాజిక తరగతికి రిజర్వ్ అయిన స్థానలో ఓసీ అభ్యర్థి పోటీ చేసినట్టు కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ కొనసాగుతుండగా.. 28వ తేదీలోగా విచారణ పూర్తికానుంది. వివరాల్లోకి వెళ్తే.. కార్పొరేషన్‌తో పాటు మున్సిపాల్టీలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించిన విషయం విధితమే. నిజామాబాద్ కార్పొరేషన్‌లో 60 స్థానాలకు కాంగ్రెస్ 18, బీజేపీ 28, ఎంఐఎం 13, బీఆర్‌ఎస్ ఒక స్థానంలో గెలుపొందారు. ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్‌ఎస్‌తో కలిపి మేయర్ సీటును కైవసం చేసుకున్న విషయం విధితమే. కాగా బీజేపీ నుంచి పోటీ చేసి గెలుపొందిన ఓ అభ్యర్థిపై కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. బీసీ సామాజిక తరగతికి రిజర్వ్ అయిన స్థానంలో.. ఓసీ కేటగిరీకి చెందిన అభ్యర్థి.. తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో పోటీ చేసినట్టు ఓడిపోయిన అభ్యర్థి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టి తప్పుడు కుల ధ్రువీకరణతో పోటీ చేసినట్టు తేలితే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో పోటీ చేసినట్టు తేలితే అనర్హుడిగా తేల్చి ఆ డివిజన్ ఎన్నికను రద్దు చేసే అవకాశం ఉంది. తిరిగి ఉప ఎన్నిక వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కలెక్టర్‌కు ఫిర్యాదు అందగా.. విచారణ చేపట్టినట్టు సమాచారం. 28వ తేదీలోగా విచారణ పూర్తి కానునన్నట్టు సమాచారం. దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.





కామెంట్‌లు (0)