Magazines

రాష్ట్రానికి సీఎం రేవంత్‌‌రెడ్డి జలద్రోహం

11 నిమిషాల క్రితం

CM Revanth Reddy commits a 'water betrayal' against the state
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026 | 2 నిమిషాల చదవడం

కేఆర్‌ఎంబీ సమావేశ మినిట్స్‌ మరో సాక్ష్యం

పల్నాడు ప్రాజెక్టుపై ఎందుకు ప్రశ్నించలేదు : మాజీ మంత్రి హరీశ్‌‌రావు

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని తెలంగాణకు చేస్తున్న జలద్రోహానికి కేఆర్ఎంబీ సమావేశం మినిట్సే మరో సాక్ష్యమని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌‌రావు విమర్శిం చారు. హైదరాబాద్ కేంద్రంగా జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో ఏపీ ప్రతిపాదించిన అక్రమ పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం ప్రస్తావించకపోవడం ఏపీకి వరంగా మారితే.. తెలంగాణకు శాపంగా పరిణమిస్తోందని బుధవారం ఎక్స్‌ ‌వేదికగా స్పందించారు.

చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్న రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఏపీ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నాడు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఉండబోదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి, నాగార్జునసాగర్ జలాలను తరలించేందుకు ఏపీ నిర్మిస్తున్న పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు గురించి ఎందుకు ప్రశ్నించలేదని తెలిపారు. ఏపీ అక్రమ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎందుకు గళమెత్తలేదనీ, తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. నాడు ఢిల్లీ వేదికగా జరిగిన సమావేశంలో గోదావరి జలాలను తరలించే బనకచర్ల ప్రాజెక్టుపై నిలదీయకుండా జలద్రోహం చేశారని విమర్శించారు. నేడు హైదరాబాద్ వేదికగా జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో కృష్ణా జలాలను తరలించే పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రశ్నించకుండా మరోసారి జలద్రోహానికి పాల్పడ్డారని పేర్కొన్నారు.

నాడు బనకచర్ల.. నేడు పల్నాడు!

ప్రాజెక్టులు మారుతున్నాయి.. వేదికలు మారుతున్నాయి.. కానీ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టే రేవంత్ రెడ్డి వైఖరి మాత్రం మారడం లేదని హరీశ్‌‌రావు విమర్శించారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడాల్సిన ముఖ్యమంత్రే ఏపీకి లొంగిపోయి, ఆ రాష్ట్ర ప్రయోజనాలకు సహకరిస్తుంటే తెలంగాణ ప్రయోజనాలకు రక్షణ ఎవరని ప్రశ్నించారు. మేధావులు, తెలంగాణవాదులు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. కేఆర్ఎంబీ సమావేశంలో పల్నాడు ప్రాజెక్టు ప్రస్తావనే రాలేదంటూ ఏపీ ఇంజినీర్లే చెబుతుంటే సమావేశంలో పల్నాడు ప్రాజెక్టుపై చర్చించామని గొప్పగా ప్రచారం చేసుకున్న వారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నాడైనా నేడైనా నీళ్ల విషయంలో తెలంగాణకు తీరని ద్రోహం చేసింది, చేస్తున్నది కాంగ్రెస్సేనని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి అసలు రంగు బయటపడిందనీ, నిజస్వరూపం బట్టబయలైందని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి చారిత్రక ద్రోహం చేస్తున్నారనీ, దీన్ని తెలంగాణ సమాజం ఎన్నటికీ క్షమించబోదని స్పష్టం చేశారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్