ఒక్కసారిగా ప్రధాని మోడీ మీడియా కీలకపాత్రనూ, ఆరెస్సెస్ కార్యకర్తగా ఒకప్పుడు వారికి తాను కుర్చీలు వేసిన రోజులు గుర్తుచేసుకోవడం ఒకింత ఆసక్తి కలిగించింది. మీడియా విభిన్న కోణాలు ముందుకు తేవడం అవసరమంటూనే భారతదేశ సంక్లిష్లతనూ, విజయగాథలనూ బాగా ప్రచారంలో పెట్టాలని కోరడంతో మోడీ ఉద్దేశం స్పష్టమైపోయింది. హఠాత్తుగా గుజరాత్ వెళ్లి దీపావళి మిలన్ పేరిట ఎంపిక చేసిన మీడియా మిత్రులను కలవడం యాదృచ్చికంగా జరిగిందని ఎవరూ అనుకోవడం లేదు. పుష్కరంపైన గడచిన పాలనాకాలంలో ఇంతవరకూ ఒక్కసారి కూడా పూర్తిస్థాయి మీడియా గోష్టి నిర్వహించని ప్రధాని 2024 ఎన్నికల ముందు మాత్రం చిన్నచిన్న చానళ్లకు కూడా ఇంటర్వ్యలు గుప్పించి ఎన్నికల ప్రమోషన్ చేసుకున్నారు. అన్నిపాట్లు పడినా మెజార్టీ తెచ్చుకోలేకపోయారు. తర్వాత జరిగిన ఎన్నికలకు ‘సర్’ కావలసి వచ్చింది. లక్షల ఓట్లు తొలగించిన గెలుపులే ఇప్పుడు ప్రశ్నార్థకమై కూచున్నాయి. ఇలాంటి తరుణంతో తన్ను కొస్తున్న గుజరాత్, ఉత్తరప్రదేశ్ శాసనసభ సమరాలు మోడీకే గాక మొత్తం బీజేపీ-ఆరెస్సెస్‌లకు జీవన్మరణ సమస్యలుగా తయారై కూచున్నాయి. మొన్న ఇందుకు నాందిగానే డీపావళి మిలాన్ ముచ్చట. మీడియాను మళ్లీ మంచిచేసుకునే ప్రయత్నం. గోడీ మీడియా లేదా మోడియా ఎప్పుడూ సిద్ధము సుమతి అన్నట్టుగా ఆయన భజనకు రెడీగా వుంటుంది. కాకపోతే యూ ట్యూబ్ వగైరాలతో కూడిన విస్తారమైన కొత్త మీడియానే కొరకరాని కొయ్యలా తయారైంది ఆయనకు. దాన్ని కూడా 2013 ఎన్నికల కోసం బాగా వాడుకున్నారు. మత పరమైన రచ్చలు ముందుకు తెచ్చారు. అసలు దాని స్వభావాన్నే మార్చేలా దుర్వినియోగం చేశారు. ఇదంతా కొంతకాలం పనిచేసింది గానీ ఇప్పుడు అదే ఎదురుతిరిగి కూచుంది. మరీ ఇటీవల జెన్ జీ ఉద్యమాలూ సాంకేతిక సామర్థ్యం గల యువత రంగప్రవేశం మోడీని జంతర్ మంతర్‌లో నిలదీశాయి. కనుకనే మీడియాతో మిలాన్‌లు అవసరమైనాయి. కాకుంటే ఇక్కడ ఇలాంటి తియ్యటి మాటలతో చేదు మాత్రలు మింగించే ప్రయత్నం చేస్తుంటే ఖండాంతరాల నుంచి అసలు సత్యం బయటకు రానే వచ్చింది. నార్వే గోష్టిలో తన ప్రశ్నలతో పలాయనం పాడించిన జర్నలిస్టు హెల్జిత్ హైదరాబాద్‌లో జరుగుతున్న భారత్ సమిట్‌కు తనను రాకుండా అడ్డుకోవడంపై నిరసన ప్రకటించడం ప్రపంచవార్తగా మారింది. మొత్తం 115మందికి ఆ విధంగా వీసాలు నిరాకరించి నట్టు నిర్వాహకులైన కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఇదే గుజరాత్‌లో వ్రైబంట్‌గుజరాత్, ఫ్రెండ్స్ ఆఫ్ గుజరాత్ పేరిట నిరంతర జాతరలు జరిపే బీజేపీకి హైదరాబాద్ సమిట్‌కు మాత్రం అటంకాలు పెట్టడం కన్నా విపరీతం ఏముంటుంది? పైగా ఇది దేశ వ్యతిరేక సమావేశమని కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు ప్రకటించడం, నిరసనకు సిద్ధం కావడం కూడా అప్రజాస్వామికమే. ఇవన్నీ బీజేపీ శిబిరాన్ని ఆవరించిన ఆందోళనకు కంగారుకు అడ్డం పడతాయి. ఇందుకోసమే రెండురోజుల పాటు ప్రత్యేకంగా ఉన్నతస్థాయి సమావేశం జరిపి ప్రతిపక్షాలు సిజెపి, జెన్ జి సాగిస్తున్న ఉద్యమాలకు పోటీగా ఏం చేయాలన్నది మధిస్తామంటున్నారు. కాయకల్ప చికిత్సలో భాగంగా కేంద్ర మంత్రివర్గంలోనూ సంస్థాగతగా బీజేపీ-ఆరెస్సెస్‌లలోనూ కొన్ని తలలు తొలగించాలని, కొన్ని పదవులలో కొత్తవారిని తేవాలని మల్లగుల్లాలు పడుతున్నారు. దీంతోపాటే ఆఘమేఘాల మీద యూపీ, గుజరాత్‌లలో ప్రచార పర్వం ప్రారంభించడం, జాతీయంగానూ కొత్తవ్యూహాలకు తెరలేపడం జరుగుతున్నది.
భయపెడుతున్న యూపీ
403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తర ప్రదేశ్‌లో 2027 ప్రారంభంలోనే ఎన్నికలు జరగాలి. బీజేపీ 2022లోనే అంతంత మాత్రంగా గెలిచింది. కాంగ్రెస్, సమాజ్‌వాది, వామపక్షాలు కలిసి పోటీచేసినా సీట్ల సర్దుబాటు పెద్దగా పనిచేయ లేదు. కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు తీసుకుని నామమాత్రంగానే గెలవగలిగింది.111 స్థానాలు తెచ్చుకున్న ఎస్‌పి 32.76 శాతం ఓట్లు రాబట్టింది. అదే కాంగ్రెస్ కేవలం రెండు సీట్లు మాత్రమే తెచ్చుకుని 2.33శాతం ఓట్లతో సరిపెట్టింది. కానీ 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ పరిస్థితి తలకిందులైంది. 78 లోక్‌సభ స్థానాలలోనూ కేవలం 33 మాత్రమే ఆ పార్టీ తెచ్చుకోగలిగింది. అది కూడా చాలా పొత్తులతో. అదే ఎస్‌పి 37సీట్లు తెచ్చుకోగా కాంగ్రెస్ ఆరు, ఇతర మిత్రపక్షాలు మూడు స్థానాలు పొందాయి. మోడీ మెజార్టీ తెచ్చుకోలేకపోవడానికి ప్రధాన కారణం యూపీ ఫలితాలే. తర్వాత కాలం లోనూ అక్కడ పరిణామాలు బీజేపీకి మరింత అప్రతిష్ట తెచ్చిపెట్టాయి. అవినీతి, అనైక్యత, మతరాజకీయాలకు తోడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నడిపించిన బుల్డోజర్ సంస్కృతి సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా ఖండించింది. అయితే అదే పెద్ద గొప్పలాగా చాటుకున్న ఆ పార్టీ ఈ ఎన్నికలలోనూ బల్డోజర్ తమ ఎన్నికల చిహ్నమని చెప్పుకుంది. 2027 ఎన్నికల ముందు కూడా ఆ మాటే అనడం చివరకు బీజేపీ ముఖ్యనేతలే జీర్ణించుకోలేకపోతున్నారు. మోడీకి ఒక ప్రత్యామ్నాయంగా యోగి ఆదిత్యనాథ్‌ను చూపించడం వారిలో వారికి తగాదాలు పెంచింది.
అన్నిటినీ మించి అయోధ్య రామమందిరం నిధుల చౌర్యం కేసు పరివార్‌ను పూర్తిగా రచ్చకెక్కించింది. అందులోనూ ఆదిత్యనాథ్ అయోధ్య ఉద్యమానికి నాయకత్వం వహించిన గోరక్‌పూర్ మఠానికి ప్రతినిధిగా వచ్చిన నేత. మందిరం ట్రస్టు ఏకంగా ప్రధాని కార్యాలయ మాజీ బాధ్యుడితో, ఇప్పటి సిఈసి జ్ఞానేష్ కుమార్ సూచనలతో ఏర్పాటైంది. అన్ని దశల్లోనూ స్వయంగా మోడీనే పాల్గొంటూ వచ్చారు. ఇంతచేసి ఇప్పుడు దొంగతనాలు పట్టుకోకపోవడం, వచ్చాక కూడా ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించకుండా సిట్‌లతో సరిపెట్టడం, అక్కడేగాక దేశమంతటా వారి విశ్వసనీయతకు విఘాతంగా పరిణమించింది. భక్తిలో రాజకీయ కుయుక్తులు తటస్తులు కూడా బలపర్చలేకపోయారు. ఫలితంగానే కౌన్సిల్ ఎన్నికల్లో మోడీ స్వంత నియోజకవర్గమైన వారణాసిలోనూ, ఆరెస్సెస్ కేంద్ర పీఠమైన నాగ్‌పూర్‌లోనూ, అధ్యక్షుడు నితిన్ నబీన్ ఎన్నోసార్లు గెలిచిన పాట్నాలోనూ విద్యాధికులు బీజేపీని ఓడించారు. ‘ఓట్ చోరీ’ పోరుతో పాటు ఈ ఓటమి ఆదిత్యనాథ్‌కు ఆశనిపాతమైంది. దాంతో ఆయన కూడా మాటమార్చి తమ రాష్ట్రంలో కోటిన్నర హిందూ ఓట్లు తొలగించారని పాట ఎత్తుకున్నారు. దేశంలో సాధారణంగా ముస్లిములు, మహిళలు, దళితుల ఓట్లు తొలగించినట్టు వచ్చిన నివేదికలను తికమక పెట్టేందుకే యోగివర్యులు ఈ పాచిక పన్నారన్నమాట. అయితే అదీ బెడిసి కొట్టింది. ఎస్‌పి నేత అఖిలేష్ యాదవ్ హిందువుల ఓట్లే తొలగించారని మీకెలా తెలిసిందని ఎదురు సవాలు విసిరారు. నాలుగు సర్వేలు జరిపితే దేంట్లోనూ బీజేపీకి అనుకూలంగా రాకపోవడంతో ఫీడ్ బ్యాక్‌గా పేరు మార్చారు. ఈ దశలో ఇదే ఫీడ్ బ్యాక్‌ను కారణంగా చూపుతూ ఆరెస్సెస్ నేరుగా రంగంలోకి దిగి అభ్యర్థులు నినాదాలు అన్నిటా తనదే తుదిమాటని శాసిస్తున్నది. 51 నియోజకవర్గాలలో 500 నుంచి 5వేల లోపు ఓట్ల తేడాతోనే గతంలో గెలిచినందువల్ల ఇప్పటి వాతావరణంలో ఎదురు తప్పదనేదే బలమైన అభిప్రాయంగా వినిపిస్తున్నది. కాంగ్రెస్ షరామామూలుగా తమకు వందకు పైగా స్థానాలు కావలని పట్టుపట్టడమే గాక క్ష్రేత్రస్థాయిలోనూ తన వాదనను అమలులో పెట్టేందుకు హడావుడి పెంచుతున్నది. గతంలో యూపీ, బీహార్‌లలో దానికిచ్చిన స్థానాలు గెలవలేకపోవడమే బీజేపీ-ఎన్డీయేల విజయానికి ప్రధాన కారణమనే అభిప్రాయం బలంగా ఉన్నందువల్ల ఇది చివరకు ఎలా ముగుస్తుందో చూడాలి. మరోవైపున మజ్లిస్ అసదుద్దీన్ ఒవైసీ, చంద్రశేఖర్ ఆజాద్ నాయకత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీ కలిసి సామాజిక్ పరివర్తన్ మొర్చాగా ప్రకటించుకున్నారు. తామే బీజేపీని ఓడిస్తామని వారంటుంటే ఓట్ల చీలికకే ఇది కారణమవుతుందనే అంచనా కూడా వుంది. మాయావతి బిఎస్‌పి కూడా గతంలో వలె ప్రభావశీలంగా లేదు గనక చివరకు ఏం చేస్తుందో చూడాలి. కానీ ఎన్నికల్లో ఎస్‌పితో మాత్రం వారు కలిసే అవకాశముండకపోవచ్చు. రామ్‌లీలా ర్యాలీ వంటివి యూపీ ఎన్నికలపై ప్రభావం చూపిస్తానేది అభ్రిపాయం కూడా వుంది.
గుజరాత్ గుంజాటన
1995 నుంచి బీజేపీ పాలనలోనే కొనసాగుతున్న గుజరాత్ మోడీ స్వంత రాష్ర్టం. ఆయనకూ ఆయన కార్పొరేట్ మిత్రులకూ కూడా చాలా కీలకమైంది. నిజానిక అక్కడ 2027 డిసెంబరులో గానీ ఎన్నికలు జరగవు. అయినా మోడీ ముందే బయలుదేరి వెళ్లారంటే ఎంతగా ప్రాధాన్యత నిస్తున్నారో తెలుస్తుంది. 13వ తేదీన అహ్మదాబాద్‌లో దిగినప్పటినుంచి మళ్లీ తిరుగుప్రయాణం వరకూ ఊపిరి సలపకుండా మంతనాలు జరిపేశారు. ఆ రోజు రాత్రి ముఖ్యమంత్రి భోగేంద్ర పటేల్‌తో చర్చలు, తర్వాత మంత్రివర్గ సభ్యులతో విందు సమావేశం రెంటిపైనా పరిశీలకులు దృష్టిపెట్టారు. ఏదో పాలనా పరమైన సలహాలతో సరిపెట్డడంగాక రాజకీయ యంత్రాంగాన్ని కట్టుదిట్టం చేసుకోవడంపై ఆయన మాట్లాడారని సమాచారం. మొదట చెప్పుకున్నట్టు డిజిటల్ యంత్రాంగం కీలకమన్నది ఆయన సందేశం. మరోవైపున మోడీ రాకతో 55 గిరిజన సీట్లను తెచ్చుకోవడానికి పథకం రచించాలన్నది స్థానిక నాయకుల వ్యూహం. నాయకత్వ మార్పులను కూడా చర్చించారని మీడియా నివేదికలు చెబుతున్నాయి. మహిళల కోసం కూడా ఆపదమొక్కుల పథకాలు రూపొందిస్తున్నారు.
మళ్లీ ఢీ లిమిటేషన్
ఈ స్థానిక వ్యూహాలను మించి పార్లమెంటు ప్రత్యేక సమావేశం జరిపి నియోజకవర్గాల పెంపు పునర్విభజనకు ఆమోదం పొందాలనేది మోడీ అసలు వ్యూహంగా వుంది. గత ఏప్రిల్ నెలలో ఇందుకోసం చేసిన ప్రయత్నం ఫలించలేదు. సభలో వున్న 543 మంది సభ్యులలోనూ 561 మంది బలపరిస్తేనే ఆ స్థానాలను 850కి పెంచడమనే ఆలోచనకు అడుగు పడుతుంది. డిఎంకె, బీఆర్‌ఎస్, ఎస్‌పి మద్దతుతో ఆ పనిచేయగలమని అమిత్ షా వంటివారు ఊదరగొడుతున్నారు గానీ ప్రతిపక్షంతో అసలు కార్యక్రమం చర్చచేసింది లేదు. ఉన్న సీట్ల నిష్పత్తి తగ్గబోదనే హామీతో మద్దతు పొందవచ్చని ఆశ. 91 రోజులుగా సభను ప్రోరోగ్ చేయకపోవడం వల్ల ఇది జరుగుతుందనే అనుకుంటున్నారు. ప్రత్యేక సమావేశం రెండు రోజుల నోటీసు సరిపోతుంది గనక ఏదైనా సాధ్యమే. వరసగా ఎదురుదెబ్బలు తింటున్న బీజేపీ-ఎన్డీయే ఈ చివరి ఆయుధంతో తనదే పైచేయి అని చూపించుకోవడం ఒకటైతే రేపు ఏది ఎలాపోయినా తమకు బలం ఉన్న ఉత్తరాదిన సీట్లు బాగా పెంచేసుకోవాలన్నది మరింత లోతైన పథకం. అతి కొద్దిరోజుల్లోనే దాని పూర్తి చిత్రం అవిష్కృతమవచ్చు.
తిలకపల్లి రవి






కామెంట్‌లు (0)