Magazines

రైతన్నకు జేజేలు

14 నవంబర్, 2026

Salute to the farmer
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 3 నిమిషాల చదవడం

‘ప్రాణములొడ్డి ఘోరగహనాటవులన్‌ బడగొట్టి మంచి మాగాణములన్‌ సృజించి, ఎముకలు నుసిజేసి, ‌పొలాలు దున్ని భోషాణములన్‌ నవాబుకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము రైతుదే’ అని రైతును గానం చేసిన నేలన అఖిల భారత కిసాన్‌ సభలు జరగడం, ఒక చారిత్రక సందర్భం. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కేంద్ర స్థానమైన నల్లగొండకు, దేశం నలమూలల నుంచి రైతు ఉద్యమ నేతలు తరలిరావటం గొప్ప సంఘటన. సాయుధ రైతాంగ పోరులో నాలుగువేల మంది ప్రాణత్యాగం చేసి, దేశపు ఎజెండాలోకి భూమి సమస్యను తెచ్చిన నేల నుంచి భవిష్యత్‌ రైతాంగ ఉద్యమాలకు మరింత చైతన్యాన్ని నింపుకుని పోతారనడంలో సందేహంలేదు. నాలుగు రోజులు జరిగే మహాసభలు రైతు సమస్యలు, ఉద్యమ తీరుతెన్నులు మొదలైన విషయాలేకాక, దేశం నేడేదుర్కొంటున్న అప్రజాస్వామిక విధానాలు, ప్రజాహక్కుల నిరాకరణ, ఆర్థిక, రాజకీయ సవాళ్లు, దేశ సమగ్రత, లౌకిక, ప్రజాస్వామ్య విలువల రక్షణ విషయాలు చర్చించనున్నారు. అందుకు తెలంగాణ వేదికవడం మనందరికీ గర్వకారణం.

దేశానికి వెన్నెముక అన్నదాత అని ఎన్ని విశేషాలతో ప్రశంసాపూర్వక సంబోధన చేసినా రైతు బతుకు మారలేదు. అనాదిగా ఈ సమస్య కొనసాగుతూనే ఉంది. ‘జై జవాన్‌, జై కిసాన్‌’ అన్న నినాదమూ మసకబారి పోయింది. లక్షలాది మంది రైతులు అప్పుల బాధల కూరుకుని ఆత్మహత్యలు చేసుకుం టున్నారు. ఇప్పుడు జవాన్లు కూడా తమ హక్కులకోసం గొంతువిప్పి రోడ్ల మీదకు వస్తున్నారు. పాలకులైన వారురైతులను వారి బాధను పట్టించుకున్న పాపాన పోలేదు. కర్షకుల సమస్యలను పరిష్కరించక పోగా భూమి నుంచి రైతును దూరం చేసే ప్రయత్నాలను సాగిస్తున్నారు. వ్యవసాయరంగాన్ని బడా పెట్టుబడిదారుల కబంధ హస్తాలకు అప్పజెపుతున్నారు. ఇన్నేళ్లయినా రైతులు తను ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు, తాను ధర నిర్ణయించక లేకపోతున్నాడు. కనీస మద్దతు ధరను పొందలేక పోతున్నాడు. భూసంస్కరణల చట్టం ఉన్నప్పటికీ వందల, వేల ఎకరాల భూములు కార్పొరేట్‌ శక్తుల చేతుల్లోకి వెళ్తోంది. రైతు నేడు ప్రయివేటు శక్తుల పద్మవ్యూహంలో చిక్కిన అభిమాన్యుడిలా ఉన్నాడు. ఈ సమస్యల నుంచి బయట పడాలంటే సంఘటితంగా పోరాడటం ఒక్కటే మార్గంగా ఉంది. రైతును నిండాముంచే చట్టాలను తెచ్చిన మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఐక్యంగా ఢిల్లీలో చేసిన పోరాటం మోడీ మెడలు వంచగలిగింది. కానీ ఇప్పటికీ ప్రభుత్వం అవే విధానాలను నిరంకుశంగా సాగిస్తూనే ఉంది. ఉద్యమమొక్కటే వీటికి అసలైన మందు

రైతులపట్ల, వారు చేసే శ్రమపట్ల అధికారంలో వున్న బీజేపీ వారికి కనీస గౌరవం, మర్యాద లేదు. అసలు శ్రమ చేసే వారిపట్ల కూడా అత్యంత ఘోరమైన అభిప్రాయాలను కలిగి వున్నారు. ఇటీవల బీజేపీ పార్లమెంటు సభ్యుడు జనార్ధన్‌ మిశ్రా మాట్లాడిన మాటలు దేశానికి అన్నంపెట్టే రైతును అవమానపరిచే విధంగా ఉన్నాయి. అతగాడేమంటాడంటే, ‘రైతు సంవత్సరంలో మూడు నెలలకు మించి పనిచేయడు. మిగిలిన తొమ్మిది నెలలు.. పేకాట, రాజకీయాలు, మద్యం, పొగతాగడం, ‘జై భోలే’ అంటూ గడిపేస్తాడు’’ అని బహిరంగంగా మాట్లాడటం వారి అహంకారానికి, అజ్ఞానానికి నిదర్శనంగా నిలిచింది. ఇంత దుర్మార్గమైన ఆలోచనలున్న వారి విధానాలు ఇక ఎలా ఉంటాయో మనం చెప్పనక్కర్లేదు. పగలురాత్రి ఇంటిల్లిపాది కష్టంచేసే రైతుల గురించి ఇంతకన్నా నీచంగా ఎవరు అనగలరు! రైతునేకాదు, ఆదివాసీలను, దళితులను హీనంగా చూసే, వివక్షాపూరితంగా మాట్లాడే వారందరూ మనకు ఆ పార్టీలోనే కనపడతారు. ఇలాంటి సంస్కృతికి ప్రతినిధులు వాళ్లు. నిత్యం శ్రమచేసి ఈ దేశ సంపదకు కారణమవుతున్న వారిని అవమానించి, కార్పొరేట్‌ గద్దలకు సేవచేయడం వీరి కర్తవ్యంగా ఉంది. అంతేకాకుండా శ్రామికుల మధ్య కుల,మత విద్వేషాలను సృష్టించి, విభజన రాజకీయాలతో మోసం చేస్తున్న వారి పన్నాగాలను ఉద్యమ చైతన్యం మాత్రమే అడ్డుకోగలదు.

మానవీయ సంబంధాల అనుబంధాల సంస్కృతి వ్యవసా యం. ఇందులో ముఖ్య నాయకుడు రైతు. భూమితో సజీవ సంబంధంలో ఉండే రైతు సంక్షేమంలోనే మొత్తం సమాజ పురోగతి ఆధారపడి ఉంటుంది. ‘విరామమెరుగక పరిశ్రమించే కర్షకవీరుని కాయం నిండా కాలువ కట్టే కర్మజలానికి ఘర్మజలానికి ఖరీదు కట్టే షరాబు లేడోయ్‌’ అన్న శ్రీశ్రీ అక్షరాలు గుర్తించాల్సిన సత్యాలు. ‘‘ నర్తకుని నాట్యాలు, గాయకుని గానాలు, వాదితుని వాద్యాలు, శిల్పకుని శిల్పాలు, చిత్రకుని చిత్రాలు, కవిరాజు కావ్యాలు, కర్షకా నీ కర్రు కదిలినన్నాళ్లే’’ అని కాళోజీ చేసిన వ్యాఖ్యలు నూటికి నూరుపాళ్లు నిజం. అట్లాంటి రైతన్నల ఉద్యమ ప్రస్థానానికి జేజేలు పలుకుదాం!


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్