నేటి సామ్రాజ్యవాద స్వభావాన్ని, దానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న పోరాటాలను అర్థం చేసుకోవాలంటే 1917లో జరిగిన రష్యా విప్లవం వరకు వెళ్లాలి. అక్టోబర్ విప్లవం ప్రపంచంలోనే మొట్టమొదటి సామ్రాజ్య వాద వ్యతిరేక, పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యతిరేక విప్లవం. 1916లో లెనిన్ ప్రతిపాదించిన సామ్రాజ్య వాద సిద్ధాంతం ప్రకారం, పెట్టుబడిదారీ దేశాలు తమ లాభాలను పెంచుకోవడానికి కొత్త మార్కెట్లను వెతుకుతాయి. ఇతర దేశాల సహజ వనరులను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడంతో పాటు, పెట్టుబడులు పెట్టేందుకు కొత్త ప్రాంతాలను అన్వేషిస్తాయి. ఈ ఆధిపత్య పోటీ చివరకు దేశాల మధ్య వైరుధ్యాలకు, ఘర్షణలకు, యుద్ధాలకు, ప్రపంచవ్యాప్త దోపిడీకి దారితీస్తుంది. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల్లో కార్మికవర్గం సాగించే పోరాటాలను, వలస దేశాల ప్రజల జాతీయ విముక్తి ఉద్యమాలతో అనుసంధానించడం లెనిన్ సిద్ధాంతంలోని ప్రధాన అంశం. సామ్రాజ్యవాద దేశాల మధ్య ఉండే పరస్పర విభేదాలు ప్రపంచ యుద్ధాలకు ఎలా కారణమ వుతాయో కూడా ఆయన వివరించారు. రష్యా సామ్రాజ్యవాద గొలుసులో బలహీనమైన కడియమని గుర్తించిన లెనిన్, సామ్రాజ్యవాద యుద్ధాన్ని జారుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అంతర్యుద్ధంగా మార్చాలని పిలుపునిచ్చారు.
రష్యా విప్లవం ప్రపంచ చరిత్రలో రెండు కీలక మార్పులకు కారణమైంది. మొదటిది, రష్యాలో సోషలిస్టు వ్యవస్థ ఏర్పడటం. తరువాత అదే సోవియట్ యూనియన్‌గా అవతరించడం. విప్లవం విజయంతో సోషలిజం తొలిసారిగా ఒక వాస్తవ రాజకీయ, ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంది. దీంతో ప్రపంచ రాజకీయాల్లో సామ్రాజ్య వాదం, సోషలిజం మధ్య కొత్త వైరుధ్యం ఏర్పడింది. రెండవది, ప్రపంచవ్యాప్తంగా జాతీయ విముక్తి, సామ్రాజ్యవాద వ్యతిరేక విప్లవాలకు ఈ విప్లవం స్ఫూర్తినిచ్చింది. చైనా, వియత్నాం, కొరియా, క్యూబా దేశాల్లో జరిగిన విప్లవాలు ఈ క్రమంలో భాగమే. కొన్ని దేశాల్లో విదేశీ సామ్రాజ్యవాద పాలకులకు వ్యతిరేకంగా, మరికొన్ని దేశాల్లో సామ్రాజ్యవాదానికి అండగా నిలిచిన స్థానిక పాలకవర్గాలకు వ్యతిరేకంగా ఈ పోరాటాలు సాగాయి. సోషలిస్టు దేశాల బలం జాతీయ విముక్తి ఉద్యమాలకు తోడ్పడింది. ఈ రెండు ఉద్యమాలు పరస్పరం బలపడటంతో సామ్రాజ్యవాద దేశాల ఆధీనంలో ఉన్న అనేక వలస దేశాలు స్వాతంత్ర్యం సాధించాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా ప్రపంచ సామ్రాజ్యవాదానికి నాయకత్వం వహించింది. వలసవాద వ్యతిరేక ఉద్యమాలు బలపడుతున్న సమయంలో అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాద కూటమి సోషలిస్టు దేశాలపై ప్రచ్ఛన్న యుద్ధాన్ని ప్రారంభించింది.
సామ్రాజ్యవాద ప్రపంచీకరణ దాడి
ఇరవయ్యవ శతాబ్దం చివరి రెండు దశాబ్దాల్లో ప్రపంచ విప్లవోద్యమాల పురోగతికి ఎదురుదెబ్బ తగిలింది. వివిధ దేశాల్లోని ఆర్థిక పెట్టుబడులు కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమయ్యాయి. అంతర్జాతీయ ఆర్థిక పెట్టుబడుల ఆధిపత్యం పెరగడంతో ప్రపంచీకరణ వేగం పుంజుకుంది. నయా ఉదారవాద పెట్టుబడిదారీ విధానాలు ప్రపంచమంతటా విస్తరించాయి. ఇదే సమయంలో తూర్పు ఐరోపాలోని సోషలిస్టు దేశాలు కూలిపోయాయి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైంది. 1990వ దశకంలో అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాదం తిరుగులేని శక్తిగా ఎదిగింది. ప్రపంచం ఏకధ్రువ వ్యవస్థగా మారుతున్నట్లు కనిపించింది. 2001 సెప్టెంబర్ 11 దాడుల తరువాత ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో అమెరికా ఆఫ్ఘనిస్థాన్‌పై దాడి చేసింది. 2003లో ఇరాక్‌ను ఆక్రమించి భారీ విధ్వంసానికి పాల్పడింది. తరువాత లిబియా, సిరియాల్లో కూడా సైనిక జోక్యం చేసుకుంది.
ప్రపంచాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలన్న అమెరికా ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఆఫ్ఘనిస్థాన్‌లో 2021లో అమెరికా సైన్యం వెనుదిరిగిన తరువాత తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చారు. ఇది అమెరికా సైనిక జోక్యానికి ఉన్న పరిమితులను వెల్లడించింది. సామ్రాజ్యవాదం ఇప్పుడు సైనిక దాడులకే పరిమితం కావడం లేదు. తన ఆధిపత్యానికి సవాలు విసిరే లేదా తన ఆదేశాలను పాటించని దేశాలపై అమెరికా, దాని మిత్రదేశాలు ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయి. క్యూబా, వెనిజులా, ఇరాన్, ఉత్తర కొరియా వంటి దేశాలు ఈ ఆంక్షల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మరోవైపు నయా ఉదారవాద విధానాల వల్ల సంపద కొద్దిమంది చేతుల్లోనే పేరుకుపోయింది. ధనిక, పేద దేశాల మధ్య అంతరం పెరిగింది. ప్రకృతి వనరులను విచ్చలవిడిగా దోచుకోవడం, లాభాల కోసం పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల పర్యావరణ విధ్వంసం, భూతాపం తీవ్రమయ్యాయి.
అమెరికా ఆధిపత్యానికి ఎదురవుతున్న సవాళ్లు
నేటి సామ్రాజ్యవాదానికి నాయకత్వం వహిస్తున్న అమెరికా మూడు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటోంది. అవి నయా ఉదారవాద విధానాల సంక్షోభం, చైనా ఆర్థిక, సాంకేతిక ఎదుగుదల, బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థ ఆవిర్భావ క్రమం. ఈ పరిణామాలన్నీ ప్రపంచంపై అమెరికా ఆధిపత్యం క్రమంగా తగ్గుతోందని సూచిస్తున్నాయి. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం నయా ఉదారవాద పెట్టుబడిదారీ విధానంలోని వైఫల్యాలను బయటపెట్టింది. ఆ సంక్షోభం నుంచి బయటపడటానికి పాలకవర్గాలు ఇప్పటికీ సరైన పరిష్కారం చూపలేక పోతున్నాయి. ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకు వలసదారులు, మతపరమైన, జాతిపరమైన మైనారిటీలను లక్ష్యంగా చేసుకునే మితవాద, నయా ఫాసిస్టు శక్తులను ప్రోత్సహిస్తున్నాయి. ఫ్రాన్స్‌లో నేషనల్ ర్యాలీ, జర్మనీలో ఏఎఫ్‌డీ, ఇటలీలో బ్రదర్స్ ఆఫ్ ఇటలీ, స్పెయిన్‌లో వోక్స్, బ్రిటన్‌లో రిఫార్మ్ యూకే వంటి శక్తులు బలపడుతున్నాయి. లాటిన్ అమెరికాలోనూ మితవాద శక్తులకు అమెరికా మద్దతు పెరుగుతోంది. ఇజ్రాయిల్‌లో నెతన్యాహు ప్రభుత్వం సాగిస్తున్న గాజా మారణకాండకు బైడెన్, ట్రంప్ ప్రభుత్వాలు అండగా నిలిచాయి.
చైనా ఎదుగుదల, బహుళ ధ్రువ ప్రపంచ
చైనా వేగంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడం, సాంకేతిక రంగంలో ముందంజ వేయడం, పరిశోధనల్లో కొత్త ఆవిష్కరణలు చేయడం వల్ల అంతర్జాతీయంగా దాని ప్రభావం పెరిగింది. కృత్రిమ మేధస్సు, క్వాంటం కంప్యూటింగ్, రోబోటిక్స్ వంటి రంగాల్లో చైనా గణనీయమైన పురోగతి సాధిస్తూ అమెరికాకు గట్టి పోటీనిస్తోంది. చైనా సాంకేతిక అభివృద్ధిని అడ్డుకోవడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. అదే సమయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు అమెరికాపై పూర్తిగా ఆధారపడకుండా తమ జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా స్వతంత్ర వైఖరిని అనుసరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. బ్రిక్స్ విస్తరణ, షాంఘై సహకార సంస్థ, చైనా-రష్యా వ్యూహాత్మక సంబంధాలు ఈ మార్పులకు నిదర్శనం. అమెరికా ఆధిపత్యం లేని ప్రత్యామ్నాయ ప్రపంచ వ్యవస్థ కోసం ఈ దేశాలు సహకారాన్ని పెంచుకుంటు న్నాయి. అయితే ఈ దేశాలన్నింటికీ ఒకే విధమైన రాజకీయ లక్ష్యాలు లేవు. వాటి మధ్య వైరుధ్యాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ప్రపంచ శక్తి సమతుల్యత ఒకే దేశం చేతుల్లో కేంద్రీకృతం కాకుండా మారుతోందనేది స్పష్టమవుతోంది.
ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు అమెరికా ప్రయత్నాలు
అమెరికా తన ఆర్థిక, సాంకేతిక ఆధిపత్యాన్ని తిరిగి సాధించేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ‘అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అనే నినాదాలు ఈ ప్రయత్నంలో భాగమే. ఇతర దేశాలపై బలవంతంగా దిగుమతి సుంకాలు విధించడం, అమెరికాలో పెట్టుబడులు పెట్టేలా ఒత్తిడి చేయడం ద్వారా తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. పశ్చిమ అర్ధగోళంలో తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు మన్రో సిద్ధాంతాన్ని కొత్త రూపంలో ముందుకు తెస్తోంది. దక్షిణ అమెరికాలో తనకు అను కూలమైన మితవాద ప్రభుత్వాలను ప్రోత్సహిస్తోంది. వెనిజులా చమురు వనరులపై నియంత్రణ సాధించాలనే లక్ష్యం కూడా ఈ వ్యూహంలో భాగమే. ఇజ్రాయిల్‌తో కలిసి 2025 జూన్‌లో ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడులు చేసింది. ఇరాన్‌పై సైనిక దూకుడును కొనసాగిస్తోంది. అంతర్జాతీయ నిబంధనలను, దేశాల సార్వభౌమాధికారాన్ని లెక్కచేయకుండా వ్యవహరించడం గ్యాంగ్‌స్టర్ తరహా సామ్రాజ్యవాదాన్ని తలపిస్తోంది. ఆర్థిక, రాజకీయ ప్రభావం తగ్గుతున్నప్పటికీ అమెరికా ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన సైనిక శక్తిగా కొనసాగుతోంది. తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఈ శక్తిని విచ్చలవిడిగా ఉపయోగించడం దాని అభద్రతా భావానికి నిదర్శనం.
వైరుధ్యాలతో కూడిన పరిస్థితి
ప్రస్తుత పరిస్థితిలో ఒక విచిత్రమైన వైరుధ్యం కనిపిస్తోంది. ఇరాన్‌పై యుద్ధం అమెరికా సైనిక జోక్యానికి ఉన్న పరిమితులను బయటపెట్టింది. ఇరాన్ లొంగిపోకుండా ప్రతిఘటించడం, అసమాన యుద్ధ పద్ధతులతో ఎదురుదాడి చేయడం అమెరికా ఆధిపత్యం బలహీనపడుతోందని సూచిస్తున్నాయి. అయినప్పటికీ అమెరికా తన సైనిక, ఆర్థిక, సాంకేతిక శక్తిని ఉపయోగించి ఇతర దేశాల సార్వభౌమా ధికారానికి, ప్రజా ఉద్యమాలకు తీవ్ర నష్టం కలిగించ గలదు.వెనిజులాపై అమెరికా జోక్యం, ఆ దేశ చమురు వనరులపై నియంత్రణ సాధించే ప్రయత్నాలు, క్యూబాపై విధించిన ఇంధన దిగ్బంధనం ప్రజలకు తీవ్ర కష్టాలను కలిగిస్తున్నాయి. గాజాలో ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణకాండకు, వెస్ట్ బ్యాంక్ ఆక్రమణకు కూడా అమెరికా అండగా నిలుస్తోంది. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవ డానికి మావో జెడాంగ్ చెప్పిన మాటలు గుర్తుంచుకోవాలి - ‘వ్యూహాత్మకంగా శత్రువులను తక్కువగా అంచనా వేయాలి, కానీ తక్షణ పోరాటంలో వారిని ఏమాత్రం తేలికగా తీసుకోకూడదు’. అమెరికా సామ్రాజ్యవాదం విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. దీర్ఘకాలంలో అమెరికా ఆధిపత్యానికి పరిమితులు ఏర్పడుతున్నా యని గుర్తిస్తూనే, ప్రస్తుతం దానికి ఉన్న సైనిక, ఆర్థికశక్తిని కూడా తీవ్రంగా పరిగణించాలి.
పెరుగుతున్న ప్రజా ప్రతిఘటన
సామ్రాజ్యవాద దాడులకు, నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు పెరుగుతున్నాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా లక్షలాది మంది ప్రజలు నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. లండన్, పారిస్, రోమ్తో పాటు యూరప్, లాటిన్ అమెరికాలోని అనేక నగరాల్లో భారీ ఆందోళనలు జరిగాయి. ఫ్రాన్స్‌లో విద్యా సదుపాయాల మెరుగుదల కోసం విద్యార్థులు ఉద్యమించగా కార్మిక సంఘాలు వారికి మద్దతుగా నిలిచాయి. స్పెయిన్, ఇటలీ, పోర్చుగల్, జర్మనీ దేశాల్లో జీవన వ్యయం పెరుగుదల, గృహ వసతి కొరత, విద్యా సదుపాయాల లోపాలపై ప్రజలు పెద్దఎత్తున నిరసనలు తెలిపారు. హంగరీలో విక్టర్ ఓర్బన్ పార్టీ ఓటమి, సెర్బియాలో విద్యార్థి ఉద్యమ విజయం మితవాద నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పెరుగుతున్న ప్రజా ప్రతిఘటనకు ఉదాహరణలు. సామ్రాజ్యవాద ప్రపంచ వ్యవస్థకు, నయా ఉదారవాద పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా ప్రతి దేశంలో కార్మికులు, రైతులు, యువత, అణగారిన వర్గాలను సమీకరించి పోరాటాలు నిర్వహించాలి. భారతదేశంలో హిందుత్వ-కార్పొరేట్ పాలనకు వ్యతిరేకంగా జరిగే పోరాటం కూడా విస్తృతమైన సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో భాగమే. ఎందుకంటే మోడీ ప్రభుత్వం అమెరికా, ఇజ్రాయిల్‌లకు బలమైన మిత్రదేశంగా వ్యవహరిస్తోంది. 1917 అక్టోబర్ విప్లవం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వెలిగించిన పోరాట జ్వాల నేటికీ ఆరిపోలేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల విముక్తి పోరాటాలకు అది స్ఫూర్తినిస్తూనే ఉంది.
ప్రకాశ్ కారత్






కామెంట్లు (0)