సముద్రం కొన్నిసార్లు ప్రశాంతంగా కనిపించినా, క్షణాల్లో మహా విధ్వంసానికి కారణమవుతుంది. సముద్రపు అడుగుభాగంలో సంభవించే భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల భారీ తరంగాలు ఏర్పడి తీరప్రాంతాలను ముంచెత్తుతాయి. వీటినే సునామీలు అంటారు. గ్రామాలు, నౌకాశ్రయాలు, పంటభూములు, పాఠశాలలు, ఆస్పత్రులు సైతం ఈ అలల ధాటికి కొట్టుకుపోతాయి. అందుకే సునామీని ఎదుర్కోవడానికి ముందస్తు సిద్ధత, ప్రజల్లో అవగాహన ఎంతో అవసరం. ప్రతి సంవత్సరం నవంబర్ 5న ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 2004లో హిందూ మహాసముద్రంలో సంభవించిన ఘోర సునామీ విపత్తు ప్రపంచానికి ఎన్నో పాఠాలు నేర్పింది. భారతదేశంతో పాటు ఇండోనేషియా, శ్రీలంక, థాయిలాండ్, మాల్దీవుల్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రకృతి విపత్తులను ఆపలేకపోయినా, ముందస్తు హెచ్చరికలు, తగిన జాగ్రత్తలతో ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చనే సందేశాన్ని ఈ విషాదం ఇచ్చింది. సాధారణ సముద్ర అలలు గాలివల్ల ఏర్పడితే, సునామీలు సముద్ర గర్భంలో విడుదలయ్యే భారీ శక్తి కారణంగా పుడతాయి. సముద్రపు లోతుల్లో భూకంపం సంభవించినప్పుడు నీరు తీవ్రంగా కంపించి, భారీ తరంగాలు తీరంవైపు దూసుకొస్తాయి. తీరానికి చేరేకొద్దీ వాటి ఎత్తు పెరిగి విధ్వంసం సృష్టిస్తాయి.సునామీకి ముందు సముద్రపు నీరు హఠాత్తుగా వెనక్కి వెళ్లడం, అసాధారణ శబ్దాలు వినిపించడం వంటి సంకేతాలు కనిపించవచ్చు. భూకంపం వచ్చినప్పుడు లేదా ఇలాంటి సూచనలు కనిపించినప్పుడు సముద్రతీరంలో ఉండకుండా వెంటనే ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలి. ఫొటోలు, వీడియోలు తీయడానికి ప్రయత్నించడం ప్రాణాపాయానికి దారితీస్తుంది. జపాన్ వంటి దేశాలు హెచ్చరిక వ్యవస్థలు, సునామీ నిరోధక గోడలు, తరలింపు మార్గాలు, పాఠశాలల్లో భద్రతా డ్రిల్స్ ద్వారా ప్రజలను సిద్ధం చేస్తున్నాయి.
దేశంలోని తమిళనాడు, కేరళ, ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాలు కూడా సునామీ ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే సంబంధిత శాస్త్రీయ సంస్థలు సముద్ర పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. తీరప్రాంత ప్రజలు తమ సమీపంలోని ఎత్తైన ప్రదేశాలు, తరలింపు మార్గాలు, ఆశ్రయ కేంద్రాలు, అత్యవసర నంబర్ల గురించి ముందుగానే తెలుసుకోవాలి. అధికారిక హెచ్చరికలను పాటించాలి. ప్రభుత్వాల చర్యలు, శాస్త్రీయ సాంకేతికత, ప్రజల అప్రమత్తత సమన్వయంతో పనిచేసినప్పుడే సునామీ నష్టాన్ని తగ్గించగలం. ప్రకృతిని గౌరవిస్తూ, విపత్తులను ఎదుర్కొనే సంసి ద్ధతను పెంచుకోవడమే ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం ప్రధాన ఉద్దేశం.
- చిటికెన కిరణ్ కుమార్, 9490841284
సునామీ హెచ్చరిక - ప్రజల అప్రమత్తత
23 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 04, 2026 | 2 నిమిషాల చదవడం






కామెంట్లు (0)