Magazines

అమ్మాయిలు చదువుకు దూరమవ్వకూడదనే...

25 నిమిషాల క్రితం

education
avatar
balaji

ప్రచురించబడింది నవం 04, 2026 | 3 నిమిషాల చదవడం

సఫీనా హుస్సేన్... అమ్మాయిల జీవితాలకు ఓ భరోసా. మహిళలు ఉన్నతంగా ఉండాలంటే ముందు బాగా చదువుకోవాలని బలంగా నమ్మిన వ్యక్తి. మధ్యలోనే చదువు మానేసిన వారు తిరిగి చదువుకునేలా కృషి చేస్తున్న అమృతమూర్తి. అమ్మాయిల చదువుకోసం ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ అనే సంస్థను స్థాపించి విద్యా సాధికారతకై ఎంతో కృషి చేస్తున్నారు. బాలికల, సామాజిక అభివృద్ధికై ఆమె చేస్తున్న కృషికిగాను ప్రతిష్టాత్మకమైన రామన్ మాగ్సేసే అవార్డు 2025 లభించింది. ఆసియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలలో ఒకటిగా ఉన్న ఈ అవార్డు అందుకోవడం నిజంగా ఓ గొప్ప విషయం.


పేదరికం, వివక్ష, హింస.. వంటి వాతావరణంలో పెరిగిన సఫీనా చదువు మధ్యలోనే ఆగిపోయింది. ఈమె పుట్టి పెరిగింది డిల్లీలో. పేదరికం వల్ల మూడేండ్లపాటు స్కూల్‌కు దూరమయ్యారు. 15 ఏండ్లకే ఇంట్లో వాళ్లు ఆమెకు పెళ్లి చేద్దామనుకున్నారు. ఇక బడి గడప తొక్కడం అసాధ్యమే అనుకుని మదనపడుతున్న సమయంలో బంధువుల్లో ఒకామె సఫీనాని చేరదీసి చదివించారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో ఆమె విద్యనభ్యసించారు. అంతేకాదు అమెరికా వెళ్లి కార్పొరేట్‌ రంగంలో కొన్నాళ్లు పనిచేశారు. అక్కడ ఇమడలేకపోయారు. దాంతో భారత్‌ తిరిగొచ్చి ముంబయి కేంద్రంగా ‘ఎడ్యుకేట్‌ గర్ల్స్‌’ను ప్రారంభించారు.

బడికి దూరమైన వారిని గుర్తించి

​‘ఏ అమ్మాయీ చదువుకునే అవకాశాన్ని కోల్పోకూడదన్న ఆలోచనకు కారణం నా నేపథ్యమే’ అంటారు సఫీనా. మన దేశంలో ప్రాథమిక స్థాయిలో బాలికల్ని బడిలో చేర్పిస్తున్నప్పటికీ ఉన్నత పాఠశాలల స్థాయికి వచ్చేసరికి డ్రాపవుట్స్‌ పెరుగుతున్నారు. అందుకే భారత్‌లో బాలికల చదువు తక్కువగా ఉన్న 26 జిల్లాల్ని ఆమె గుర్తించారు. వాటిలో ఒకటైన రాజస్థాన్ రాష్ట్రంలోని పాలి జిల్లాలోని 50 గ్రామాలను ఎంపిక చేసుకొని 2007లో ఎడ్యుకేట్‌ గర్ల్స్‌ను ప్రారంభించారు. 5-14 ఏండ్ల మధ్య వయసు బాలికలు బడికి దూరంగా ఉంటే వాళ్లను పాఠశాలల్లో చేర్పించడం మొదలుపెట్టారు. అవసరమైనచోట ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యం తీసుకున్నారు. ప్రతిచోటా ‘టీమ్‌ బాలిక’ పేరుతో వాలంటీర్లను పెట్టి.. ‘మై విలేజ్‌ మై ప్రాబ్లమ్, ఐ యామ్‌ ద సొల్యూషన్‌’ నినాదంతో పనిచేస్తున్నారు. పస్తుతం బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌లలోని 30వేల గ్రామాల్లో వీరి సేవలు అందుతున్నాయి. 20వేల మంది వాలంటీర్లు ఉన్నారు. వీళ్లు ఇంటింటికీ వెళ్లి బడికి దూరమైన పిల్లల్ని గుర్తించి వాళ్లను తిరిగి బడిలో చేర్చేలా తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పిస్తారు. చదువులో వెనకబడితే హిందీ, ఇంగ్లిష్, గణితంలో రెమిడియల్‌ క్లాసులు చెప్పిస్తారు.

భారత్‌‌లో ఇదే తొలిసారి

​కరోనా తర్వాత సఫీనా ఉత్తర్‌ప్రదేశ్‌లో పర్యటించారు. కట్నాలు తగ్గాయని ఎంతో మంది బాలికలకు పెళ్లిళ్లు చేయడం గమనించారు. దాంతో ‘ప్రాజెక్ట్‌ ప్రగతి’ని మొదలుపెట్టారు. 15-25 ఏండ్ల మధ్య వయసు వాళ్లను గుర్తించి... శిక్షణ ఇచ్చి నేరుగా పదో తరగతి పరీక్ష రాయిస్తున్నారు. వీళ్లలో విజయ శాతం 60 వరకూ ఉంటోంది. పాసైన వాళ్లను ఐటీఐల్లో చేర్పిస్తున్నారు. వీరిని అంగన్వాడీ, ఆశా కార్యకర్తలుగా, నర్సులు, స్కూల్‌ టీచర్లు అయ్యేలా ప్రోత్సహిస్తున్నారు. ఏఐను వినియోగిస్తూ... డ్రాపవుట్స్‌ సమాచారాన్ని మెరుగ్గా సేకరిస్తోంది ఎడ్యుకేట్‌ గర్ల్స్‌. ఈ సంస్థ ఇప్పటివరకూ 20 లక్షల మంది పిల్లల్ని తిరిగి బడిబాట పట్టించింది. 15-25 ఏండ్ల మధ్య వయసుండే మరో 24 లక్షల మందికి చదువు నేర్పింది. ‘గ్రామీణ భారత్‌లో బాలికా విద్యకు జరుగుతున్న అన్యాయాన్ని ఎడ్యుకేట్‌ గర్ల్స్‌ రూపుమాపుతోంది. వీళ్ల ప్రయత్నం వల్ల సమాజంలో అమ్మాయిల చదువుల విషయంలో ఎంతో మార్పు వస్తోంది’ అని రామన్‌ మెగసెసే అవార్డుల కమిటీ కొనియాడింది. భారత్‌లో ఒక సంస్థకు ఈ అవార్డు దక్కడం ఇదే తొలిసారి. తన సేవలకుగానూ 2023లో ఖతార్‌ ఫౌండేషన్‌ నుంచి ప్రఖ్యాత వైజ్‌ ప్రైజ్‌నీ అందుకున్నారు సఫీనా. ఈ ఘనత దక్కించుకున్న మొదటి భారతీయురాలామె.

అంకితభావంతోనే సాధ్యం

2025 రామన్ మెగసెసే అవార్డు ఆమె నాయకత్వాన్నే కాకుండా బాలికల అభివృద్ధి కోసం చిత్తశుద్దితో కృషి చేస్తున్న ఎంతోమంది స్వచ్ఛంద కార్యకర్తల, సమాజ సేవకుల అంకితభావాన్ని కూడా గుర్తిస్తుంది. ఆలోచన, సంకల్పం, సామూహిక కృషి సమాజంలో శాశ్వతమైన మార్పును ఎలా తీసుకురాగలవో సఫీనా స్ఫూర్తిదాయకమైన దృక్పథం నిరూపిస్తుంది. ఒక అమ్మాయి విద్యను పొందినప్పుడు, ఆమె తన భవిష్యత్తును మార్చుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, అవకాశాన్ని పొందుతుంది. ఒక బాలికకు విద్యను అందించడం ద్వారా ఒక కుటుంబాన్ని శక్తివంతం చేయవచ్చు, సమాజాన్ని బలోపేతం చేయవచ్చు. దేశం మొత్తానికి ఉజ్వల భవిష్యత్తును నిర్మించడంలో సహాయపడవచ్చు. దేశంలోని ప్రతి బాలికకు విద్యను అందించడం అనేది మరింత బలమైన, సమానత్వం కలిగిన సమాజాన్ని నిర్మించే దిశ అత్యంత ముఖ్యమైన అడుగులలో ఒకటి అని ప్రతి ఒక్కరు నమ్మినప్పుడు నిజమైన మహిళా సాధికారత సాధ్యమవుతుంది.


​కోటి మందికి చదువు మా లక్ష్యం
‘ఆడపిల్లల్ని బడి నుంచి బయటకు పంపుతున్న కారణాల్లో ప్రధానమైనవి పేదరికం, పితృస్వామ్య ఆలోచనలు. మొదట్లో తల్లిదండ్రుల నుంచి చాలా వ్యతిరేకత ఉండేది. ఇప్పుడు వాళ్ల ఆలోచనా ధోరణిలో కొంత మేర మార్పు వచ్చింది. ఏ అమ్మాయీ ఇంటి దగ్గరే ఉండాలని, మేకల్ని కాయాలని, త్వరగా పెండ్లి చేసుకోవాలని అనుకోదు. చదువుకోవాలని, స్నేహితులతో సమయం గడపాలని, ఉన్నతంగా ఎదగాలనే చూస్తుంది. వచ్చే పదేండ్లలో కోటి మందికి చదువుకునే అవకాశాన్ని కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఈ అవార్డు మా ప్రయత్నానికి మరింత గుర్తింపు తెచ్చి, బాలికలందరూ చదువుకునేలా సాయపడుతుందని ఆశిస్తున్నా’ అంటున్నారు నఫీసా. ఈమె ప్రయాణం మనకు ఓ విషయాన్ని గుర్తు చేస్తుంది. అర్థవంతమైన మార్పు ఎప్పుడైనా అట్టడుగు స్థాయి నుండే మొదలవుతుంది. అక్కడ సాధారణ వ్యక్తులు ఒక అసాధారణ లక్ష్యంతో ఏకమవుతారు.


​

​

​

​

​

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్