Magazines

అక్రమ చొరబాటుదారుల ఆధారాలేవీ?

12 నవంబర్, 2026

infiltrators
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026 | 2 నిమిషాల చదవడం

హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఓటర్ల జాబితాల నుంచి తొలగించిన వారిలో మూడు కోట్ల మంది బంగ్లాదేశీ చొరబాటుదారులు ఉన్నారని ప్రకటించడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దేశ భద్రతకు సంబంధించిన ఇంత తీవ్రమైన ఆరోపణ చేసినప్పుడు అందుకు తగిన ఆధారాలు, అధికారిక గణాంకాలు, గుర్తింపు వివరాలు ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. 2014 నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఉండగా, అమిత్ షా కేంద్ర హోంశాఖకు నాయకత్వం వహిస్తున్నారు. బంగ్లాదేశ్‌తో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉన్న భారతదేశంలో మూడు కోట్ల మంది చొరబాటుదారులు ప్రవేశించారంటే, ఇన్నేళ్లుగా సరిహద్దు భద్రతా వ్యవస్థలు, నిఘా సంస్థలు, కేంద్ర హోంశాఖ ఏం చేస్తున్నాయనే ప్రశ్న తలెత్తుతుంది. వారు ఎప్పుడు, ఎక్కడి నుంచి, ఏ మార్గాల ద్వారా దేశంలోకి వచ్చారు? ఇంత భారీ సంఖ్యలో చొరబాట్లు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేకపోయింది?

అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఓటర్ల జాబితాల నుంచి పేర్లు తొలగించడం, ఒక వ్యక్తి విదేశీయుడని నిర్ధారించడం రెండూ వేర్వేరు అంశాలు. మరణం, వలస, చిరునామా మార్పు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు నమోదవడం వంటి కారణాలతో కూడా పేర్లు తొలగించవచ్చు. కాబట్టి సర్‌లో పేర్లు తొలగించిన వారందరినీ బంగ్లాదేశీ చొరబాటుదారులుగా పరిగణించడం సరైంది కాదు. పౌరసత్వాన్ని చట్టబద్ధమైన విచారణ, తగిన ఆధారాల ద్వారా మాత్రమే నిర్ధారించాలి. అదే సమయంలో భారతీయ పౌరుల ఓటు హక్కులు, రాజ్యాంగ హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా చూడాలి. 2018లో రాజ్యసభలో వెల్లడించిన వివరాల ప్రకారం 2013 నుంచి 2017 వరకు డిపోర్ట్ చేసిన బంగ్లాదేశీయుల సంఖ్య వరుసగా 5,234, 989, 474, 308, 51గా ఉంది. అయితే గత 12 సంవత్సరాల్లో ఎంతమందిని గుర్తించారు, అరెస్టు చేశారు, కేసులు నమోదు చేశారు, నిర్బంధించారు, బంగ్లాదేశ్‌కు తిరిగి పంపించారు అనే సమగ్ర గణాంకాలను కేంద్రం వెల్లడించాలి. 2026 జనవరిలో ఆర్‌‌టిఐ సమాధానంపై వచ్చిన వార్తా నివేదికలు కూడా చొరబాటుదారుల గుర్తింపు, అరెస్టులు, డిపోర్టేషన్‌కు సంబంధించి కేంద్ర హోంశాఖ వద్ద సమగ్ర దేశవ్యాప్త సమాచారం లేదని పేర్కొన్నాయి. అలాంటప్పుడు మూడు కోట్ల మంది అనే ఖచ్చితమైన సంఖ్యకు ఆధారాలేమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలి.

2014, 2019, 2024 పార్లమెంటు ఎన్నికల సమయంలో వీరు ఓటర్లుగా నమోదై ఉంటే, అప్పటి ఎన్నికల వ్యవస్థలు, భద్రతా యంత్రాంగం ఎందుకు గుర్తించలేకపోయాయో సమాధానం చెప్పాలి. నిజంగా మూడు కోట్ల మంది చొరబాటుదారులు ఉంటే అది దేశ భద్రతతో పాటు పాలనా వైఫల్యాన్ని కూడా ప్రశ్నించే అంశం. గుర్తించలేకపోతే నిఘా వైఫల్యం, గుర్తించి చర్యలు తీసుకోకపోతే బాధ్యతారాహిత్యం, ఆధారాలు లేకుండా ప్రకటిస్తే రాజకీయ ప్రచారం అవుతుంది. ఈ మూడింటిలో ఏది నిజమైనా కేంద్ర ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి. మూడు కోట్ల మంది బంగ్లాదేశీ చొరబాటుదారులు ఉన్నారని అమిత్ షా ప్రకటించినప్పుడు, ఆ ప్రకటన గత 12 ఏళ్ల కేంద్ర పాలన తీరుపైనే అనేక ప్రశ్నలను సంధిస్తోంది. ఈ చొరబాట్లు ఎప్పుడు జరిగాయి? ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు గుర్తించలేకపోయింది? ఇన్నేళ్లుగా తీసుకున్న చర్యల ఫలితాలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా దేశ భద్రత పేరుతో ప్రజల మధ్య అనుమానాలు, భయాలు సృష్టించడం బాధ్యతాయుతమైన పాలన అనిపించుకోదు. ప్రజాస్వామ్యంలో పాలకుల ప్రకటనలను ప్రశ్నించడం ప్రజల హక్కు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడం ప్రభుత్వ బాధ్యత. అందుకే మోడీ-అమిత్ షా ప్రభుత్వం రాజకీయ ప్రచారానికి స్వస్తి పలికి, వాస్తవాలను దేశ ప్రజల ముందుంచి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.


ఎస్‌ఎస్‌ఆర్‌ఎ ప్రసాద్‌, 9490300867

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్