Magazines

ఫ్రాన్సు ఆందోళనలను కమ్యూనిస్టులు రెచ్చగొట్టారా !

41 నిమిషాల క్రితం

the unrest in France?
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 21, 2026 | 6 నిమిషాల చదవడం

ఫ్రాన్సు ఎందుకు తగులబడుతోంది ! ఐరోపాలో ఏం జరగనుంది !! ఒక వైపు బ్యాంకాక్‌లో ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు సమావేశాల్లో “ పొదుపు ” అజెండాను ఎలా అమలు జరపాలని మల్లగుల్లాలు. మరోవైపు ఇప్పటికే అలాంటి చర్యలకు పాల్పడుతున్న ఫ్రాన్సుతో సహా వివిధ ప్రభుత్వాల చర్యలకు వ్యతిరేకంగా విద్యార్దులు, కార్మికుల ఆందోళన మరింతగా పెరుగుతోంది. ఫ్రెంచి ఆందోళన వెనుక కమ్యూనిస్టులు, సోషలిస్టుల కుట్ర ఉందంటూ ప్రచారదాడి. వచ్చే ఏడాది ఫ్రాన్సు, ఇటలీ, మొత్తంగా ఐరోపా ఆర్థిక మాంద్య ఊబిలో కూరుకుపోయే అవశాశం ఉందని ఆర్థికవేత్తల హెచ్చరికలు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని రిపబ్లికన్ పార్టీ పార్లమెంటు ఉభయ సభల్లోనూ మెజారిటీ కోల్పోనుందనే సంకేతాలు. ఒక దేశ లేదా సమాజంలో ఆర్థిక సంక్షోభం రాజకీయ పరిణామాలు, పర్యవసానాలకు దారి తీస్తుందని అనేక దేశాల చరిత్ర రుజువు చేసింది. సెప్టెంబరు 21న ప్రారంభమైన ఫ్రెంచి విద్యార్ధి ఉద్యమం ఎలా ముగస్తుందో తెలియదు, మరింత దమనకాండతో అణచేందుకు అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ పూనుకున్నట్లు జరుగుతున్న పరిణామాలు సూచిస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 18న జరిగే అధ్యక్ష ఎన్నికల తొలి పోలింగ్‌లో ఒడోక్సా అనే సంస్థ సెప్టెంబరు 24 అక్టోబరు ఏడవ తేదీ మధ్య జరిపిన సర్వేలో పచ్చిమితవాద నేషనల్ పార్టీ నాయకురాలు మెరినే లీపెన్ 37 లేదా 38శాతం మద్దతుతో ఆధిక్యంలో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రత్యర్ధులుగా ఉన్న సోషలిస్టు జీన్ లూస్ మెలెంచన్ 18 లేదా 18.5శాతం ఓట్లతో రెండవ స్థానంలో ఉండగా అధ్యక్షుడు మక్రాన్ నాయకత్వంలోని పార్టీ నేత, మాజీ ప్రధాని ఎడ్వర్డ్ ఫిలిఫ్ 17, అదే పార్టీకి చెందిన మరో మాజీ ప్రధాని గాబ్రియెల్ అటల్ 11శాతం ఓట్లు తెచ్చుకున్నారు. గత మూడు ఎన్నికలలో మెలెంచన్ రెండవ స్థానానికి చేరుకోలేపోయాడు. గత పార్లమెంటు ఎన్నికలలో ఏ పార్టీకి మెజారిటీ లేదు, ప్రస్తుతం మైనారిటీ సంకీర్ణ ప్రభుత్వం నడుస్తున్నది. తొలి దశ అధ్యక్ష ఎన్నికలలో ఎవరికీ మెజారిటీ రాని పక్షంలో మే రెండవ తేదీన తుదిపోరు జరుగుతుంది. మెలాంచన్ గనుక రెండవ స్థానంలో లేకపోతే పచ్చిమితవాద నేషనలిస్టు పార్టీ అధికారంలోకి రాకుండా వామపక్ష పార్టీల అభిమానులు మరోసారి మక్రాన్‌కే ఓటు వేసే అవకాశాలున్నాయి. ఈ నేపధ్యంలో ఇప్పుడు జరుగుతున్న విద్యార్ధులు, కార్మికుల ఆందోళన సరికొత్త పరిణామాలు, ఎన్నికలలో అనూహ్య పరిణామలకూ దారితీయవచ్చు.

విద్యార్ధుల ఆందోళన వెనుక కమ్యూనిస్టులు, సోషలిస్టుల కుట్ర ఉందని ఫ్రెంచి నేషనలిస్టు పార్టీ ఆరోపిస్తున్నది. అదే విధంగా అమెరికాకు చెందిన ఫాక్స్ న్యూస్ ఛానల్ పరిశోధన పేరుతో దానికి మరికొన్ని అంశాలను తగిలించి కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పూనుకుంది. పోలీసుల దమనకాండను ఎదుర్కొనే క్రమంలో జరిగిన హింసా ఘటనల వెనుక 54 సంస్థలు ఉన్నట్లు తాము కనుగొన్నామని అది గొప్పలు చెప్పుకుంది. విద్యార్దుల ఉద్యమం వెనుక కమ్యూనిస్టు మూలాలు ఉన్నట్లు పేర్కొన్నది. నిజానికి అది పేర్కొన్న ప్రతి సంస్థ బహిరంగంగానే ఉద్యమంలో భాగస్వాములు లేదా మద్దతుదారుగా ఉంది. అమెరికాలో ప్రముఖ వామపక్షవాది, జర్నలిస్టు, ప్రవాస భారతీయుడైన విజయ ప్రసాద్ నిర్వహిస్తున్న ట్రైకాంటినెంటల్ పరిశోధనా సంస్థ, ఫ్రాన్సులోని ప్రవాస భారతీయుల సంస్థ పీపుల్స్ ఫోరం ఉన్నట్లు, ఈ రెండు సంస్థలకు అమెరికాలో జన్మించి ప్రస్తుతం చైనాలో వాణిజ్యవేత్తగా ఉన్న మార్క్సిస్టు నివిల్లే రాయ్ సింగమ్ నిధులు అందచేస్తున్నట్లు ఆరోపించింది. లాభరహిత సంస్థ ట్రైకాంటినెంటల్ నిర్వాహకుడు విజయ ప్రసాద్ మూడు ఖండాల్లోని న్యూఢిల్లీ, పారిస్, బ్యూనోసఎయిర్స్‌లో జరుగుతున్న ఉద్యమాలకు పోలిక ఉందంటూ ఎక్స్‌లో చేసిన పోస్టును ఫాక్స్ ఉటంకించింది. పాలస్తీనా విమోచన కోసం పోరాడుతున్న సంస్థలు ఒక చేత్తో ఎర్రజెండా మరోచేత్తో తమ పతాకాలను పట్టుకొని మరీ వీధుల్లోకి వస్తున్నట్లు ముస్లిం ద్వేషాన్ని కూడా అది రెచ్చగొట్టింది. పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేక ఫాక్స్ న్యూస్ తానేంటో మరోసారి నిరూపించుకుంది. అది చెప్పినదాని ప్రకారం కమ్యూనిస్టు యువజనులు, ఒక ముస్లిం సంస్థతో సహా 15 యువజన సంఘాలు, పన్నెండు కార్మిక సంఘాలు, ఎనిమిది కమ్యూనిస్టు, సోషలిస్టు పార్టీలతో సహా 35 సంస్థలు, గ్రీస్, బ్రిటన్‌కు చెందిన సంస్థలు కూడా ఉన్నట్లు జాబితాను ప్రకటించింది. ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా,ఆఫ్రికా, దక్షిణ, ఉత్తర అమెరికాల్లో ఉన్న కమ్యూనిస్టు, సోషలిస్టు సంస్థలు ఒక బంధంతో కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించింది. మనదేశంలో నీట్ పరీక్షా పత్రాల లీక్‌కు బాధ్యత వహిస్తూ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ సిజెపి సాగించిన ఉద్యమంలో బాధిత విద్యార్థులు, తలిదండ్రులెవరూ లేరంటూ కాషాయ దళాలు, వాటికి వంతపాడుతున్న మీడియా సంస్థలు చేసిన ప్రచారం తెలిసిందే. అంతకు ముందు ఏడాదికిపైగా రైతు ఉద్యమంలో కూడా రైతులు లేరని, ఖలిస్తానీలు ఉన్నారంటూ ప్రచారం చేసిన ప్రబుద్దులు కూడా వారే. ఫాక్స్ మీడియా కూడా అదే పల్లవిలో ఉద్యమానికి మద్దతు లేదా పాల్గొంటున్న 54 సంస్థలలో మూడో వంతు మాత్రమే విద్యార్ధి లేదా యువజన సంఘాలు ఉన్నట్లు బురద చల్లింది. ఉద్యమాలకు నిజంగానే పోలిక ఉన్నట్లుగానే ఇలాంటి ప్రచారానికి కూడా అదే లక్షణం ఉందంటే తప్పేముంది. ఇజ్రాయెల్, లాటిన్ అమెరికాలోని అనేక దేశాల్లో పోలీసులు, భద్రతా దళాలు కిరాయి మూకలకు ఆయుధాలిచ్చి దాడులు చేయించటం, చంపటం అందరికీ తెలిసిందే. దాన్నే ఇటీవల ఢిల్లీ పోలీసులు కూడా వారు కాషాయ దళాలు కావచ్చు లేదా ఇతర అసాంఘిక శక్తులు కావచ్చు తమ వెంటపెట్టుకొని ప్రతిపక్ష ఆందోళన కారుల మీద దాడులు చేయించిన సంగతి తెలిసిందే. ఇలాంటి ప్రమాదకర అవలక్షణాలు నేర్చుకొనేందుకు భారత్‌లోని కాషాయదళం, ఐరోపాలోని పచ్చిమితవాదులు, ఇజ్రాయెల్‌లోని యూదు దురహంకారులు అందరూ ఒకే బడిలో చదువుకున్నట్లు కనిపించటం లేదూ ! పాతపడిన ఫాక్స్ వంటి రోత కథనాలు, పిట్టకతలను జనాలు నమ్మే స్థితిలో లేరన్నది వేరే చెప్పనవసరం లేదు. ఫ్రెంచి వారికి కమ్యూనిస్టు, సోషలిస్టులు, వారు సాగించిన ఉద్యమాలూ కొత్తకాదు.

ఇరవై ఎనిమిది కమ్యూనిస్టు, సోషలిస్టు ఇతర సంస్థలు కలసి ఒక అంతర్జాతీయ కూటమిగా ఏర్పడి ఐరోపాలోని పన్నెండు దేశాల్లో పని చేస్తున్నట్లు కూడా ఫాక్స్ పేర్కొన్నది. “వారి యుద్దాల కోసం కాదు మీ భవిష్యత్ కోసం పోరాడండి” అనే నినాదంతో పలురకాల ఆందోళనలకు పిలుపుచ్చినట్లు చెప్పింది. ఇవన్నీ రహస్యంగా ఒక అడవిలో కూర్చుని చేసిన నిర్ణయాలు కాదు. పొదుపు పేరుతో ఐరోపా అయినా మరొక ఖండదేశాలైనా అమలు చేస్తున్నది సంక్షేమ పథకాలపై దాడే. ప్రపంచీకరణ పేరుతో యావత్ కార్పొరేట్ శక్తులు ఏకమై దోపిడీ సాగిస్తున్నట్లుగానే దాన్ని ఎదుర్కొనే శక్తులు కూడా ఒక వేదిక మీద సమీకృతం అయితే తప్పేముంది. అమెరికా మిలిటరీ ఖర్చును తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాయ్ సింగమ్ సతీమణి జోడీ ఇవాన్స్ నాయకత్వంలో నవంబరులో ప్రచారం సాగించేందుకు పథకం వేశారని ఫాక్స్ ఆరోపించింది. ఆమె అమెరికా, భారత్, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలలో యువతను ప్రదర్శనలు చేయాలంటూ రెచ్చగొడుతున్నట్లు చెప్పింది. సరిగ్గా మనదేశంలో కూడా నరేంద్రమోడీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతులు, యువజనులు, నోయిడా కార్మికులు, ఎవరైనా సరే ప్రతి ఆందోళన వెనుక విదేశాలు, విచ్చిన్న శక్తులు ఉన్నాయనే గోబెల్స్ ప్రచారం సంగతి తెలిసిందే. పశ్చిమాసియా సంక్షోభాన్ని సృష్టించింది అమెరికా, దానితో తలెత్తిన ఇంథన ధరల పెరుగుదల, లభ్యత అంశాలపై తలెత్తిన జనాల అసంతృప్తిని సొమ్ము చేసుకుంటున్నది ఐరోపాలోని పచ్చిమితవాద శక్తులు. సోషలిస్టులు, మధ్యేవాద పార్టీలు గతంలో అధికారానికి వచ్చిన్పటికీ కాన్సర్‌కు శస్త్ర చికిత్సకు బదులు గోళీలతో వైద్యం చేసినట్లు సంస్కరణలకే పరిమితం కావటంతో వాటి మీద జనాలకు విశ్వాసం కుదరటం లేదు. దాదాపు ఐరోపాలోని ప్రతి దేశంలోనూ ఏదో ఒక తరగతి తక్షణ సమస్యల మీద వీధులకు ఎక్కుతున్నది. అందుకే తాము పరిష్కరిస్తామని మితవాద, ఫాసిస్టు శక్తులు ముందుకు వస్తుంటే వాటిని సామాన్య జనాలు కూడా నిజమే అని నమ్ముతున్నారు. తమ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తాయని కార్పొరేట్ శక్తులు కూడా వాటిని బలపరుస్తున్నాయి.

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల పర్యవసానంగా తమ సమాజం అక్టోబరు మూడోవారం నాటికి 112 బిలియన్ డాలర్ల మేర మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ఐరోపా కమిషన్ అంచనా వేసింది. నిరసనకారుల డిమాండ్లలో న్యాయసమ్మత మైనవి ఉన్నాయని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్ అంగీకరించాల్సి వచ్చింది. ఫ్రాన్సులోని ప్రభుత్వ పాఠశాలల్లో అరవైశాతం 1980కి ముందు నిర్మించినవే. సరైన నిర్వహణలేక, కొత్తవాటిని నిర్మించకపోవటంతో ఇబ్బందులు పడుతున్నారు. తరగతి గదుల్లో రద్దీని తగ్గించటానికి కొత్త 90వేల టీచర్ పోస్టులు అవసరం కాగా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. వచ్చే ఏడాది నాటికి జిడిపికి 119శాతం అప్పు ఉంటుందని అంచనా. నిరసనను అణచివేసేందుకు పూనుకోవటంతో ఇటలీలోని మిలాన్ నగరంలో ఆందోళనకారులు దుకాణాలపై దాడులకు దిగారు. గెలా ప్రాంతంలోని రైతులు నిరసనకు దిగారు. సాగుచేసి అప్పులను ప్రతిఫలంగా పొందామని చెప్పారు. దక్షిణ ఇటలీలో రైతులు, కార్మికులు అనేక ప్రాంతాల్లో రవాణా వ్యవస్థలకు ఆటంకం కలిగించారు. పోర్చుగీసు లిస్బన్ నగరంలో లక్షల మంది వేతనాలు, ఇతర సమస్యలపై నిరసన ప్రదర్శన చేశారు. స్పెయిన్‌లో 87 సంవత్సరాల వృద్దురాలిని అద్దె ఇంటి నుంచి గెంటివేయటంతో ఇండ్ల సమస్య మీద దేశవ్యాపితంగా ఆందోళనకు దారితీసింది. బెల్జియం, అల్బేనియా ఒకటేమిటి ఏ దేశంలో నిరసన తలెత్తినా దాని వెనుక ఆర్థిక దిగజారుడే ప్రధాన కారణంగా కనిపిస్తున్నది.

జనాల కొనుగోలు శక్తి తగ్గటంతో ప్రజాకర్షక రాజకీయాలు ముందుకు వచ్చాయి. పెరిగిన ఇంథన ధరలు, లోటుబడ్జెట్ సమస్యను తాను పరిష్కరిస్తానంటూ ఫ్రాన్సు పచ్చిమితవాద నాయకురాలు మెరీనె లీపెన్ ఎన్నికల ప్రచార అస్త్రంగా ఎంచుకున్నారు. ఇరాన్‌పై దాడులు ప్రారంభమైనప్పటి నుంచి ఆమె రేటింగ్స్ పెరుగుతున్నాయి. ఇంథనం మీద వ్యాట్ (పన్ను) తగ్గిస్తానని ఆమె వాగ్దానం చేశారు. జర్మనీ స్థానిక ఎన్నికలలో బలం పెంచుకున్న మితవాద ఎఎఫ్‌డి పార్టీ రష్యాతో సంబంధాలను పునరుద్దరించుకోవాలని డిమాండ్ చేసింది. ఉక్రెయిన్‌కు మద్దతు ఇచ్చి ప్రభుత్వం తప్పు చేసిందని ధ్వజమెత్తింది. వరుసగా ఐదవ ఏడాది కూడా జర్మనీలో జీవన వ్యయం పెరిగినట్లు సర్వేలు చెబుతున్నాయి. ఇటలీలో పచ్చిమితవాద పార్టీ నేత జార్జియా మెలోని అధికారాన్ని కొత్తగా పుట్టుకొచ్చిన అలాంటి మరొక పార్టీ సవాలు చేస్తున్నది, అది కూడా రష్యాతో సంబంధాలను పునరుద్దరించుకొని ఇంథనాన్ని తెచ్చుకోవాలని కోరుతున్నది. ఉక్రెయిన్‌కు గట్టి మద్దతుదారుగా ఉన్న పోలాండ్‌లో పెరుగుతున్న ఇంథన ధరల సంగతేమిటని, రష్యా నుంచి ఎందుకు కొనుగోలు చేయటం లేదని అక్కడి మితవాద పక్ష నేత ప్రశ్నిస్తున్నాడు. సంక్షోభ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవటం, నిరసనలు తెలిపేవారి వెనుక కమ్యూనిస్టులు, ఇతరులు ఉన్నారని చెప్పటం అసలు సమస్యలను పక్కదారి పట్టించటం, అణచివేతలకు సాకులు వెతకటం తప్ప వేరొకటి కాదు !

ఎం కోటేశ్వరరావు

8331013288

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్