Magazines

ఉల్లి ధరలకు ఉపశమనమేదీ?

13 గంటల క్రితం

onion prices
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం

నిత్యావసర వస్తువుల్లో కీలకమైన ఉల్లిపాయల ధరలు నింగినంటడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవితాలు తలకిందులవుతున్నాయి. కిలో రూ.60 నుంచి 70 పలుకుతుండటంతో పేదవారి పళ్లెంలో ఉల్లిపాయ కనిపించడమే గగనమైపోతోంది. వంటింటి బడ్జెట్ అస్తవ్యస్తమై సామాన్యుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు, తుఫాన్ల వల్ల దిగుబడి తగ్గడం ఒకవైపు, సరైన శీతల గిడ్డంగులు లేక టన్నుల కొద్దీ ఉల్లి వృథా కావడం మరోవైపు ప్రధాన సమస్యలుగా మారాయి. దీనికి తోడు దళారులు, బడా వ్యాపారులు సరుకును అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు. రవాణా వ్యయం పెరగడం, కొన్ని ప్రాంతాల సాగుపైనే దేశం ఆధారపడటం కూడా సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ప్రభుత్వాలు నాఫెడ్ ద్వారా బఫర్ స్టాక్ విడుదల చేయడం, ఎగుమతులపై ఆంక్షలు విధించడం, మొబైల్ వ్యాన్ల ద్వారా తక్కువ ధరకు ఉల్లి విక్రయించడం వంటి చర్యలు చేపడుతున్నప్పటికీ ఇవి తాత్కాలిక పరిష్కారాలుగానే మిగులుతున్నాయి. ఈ పథకాలు ఎక్కువగా నగరాలకే పరిమితమై గ్రామీణ పేదలకు అందడం లేదు. మరోవైపు ఎగుమతులపై హఠాత్తుగా ఆంక్షలు విధించడం వల్ల పంట ఎక్కువగా ఉన్నప్పుడు రైతులకు సరైన మద్దతు ధర లభించక నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఉల్లిని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిరుపేదలకు అత్యల్ప ధరకు అందించే ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లా స్థాయిలో ఆధునిక శీతలీకరణ గోదాములు నిర్మించి పంట సమృద్ధిగా ఉన్నప్పుడు నిల్వ చేసే సౌకర్యాలను పెంచాలి. దళారీ వ్యవస్థను అరికట్టి రైతు బజార్లు, సహకార సంఘాల ద్వారా రైతులు నేరుగా విక్రయించేలా ప్రోత్సహించాలి. అక్రమ నిల్వలపై నిరంతర నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలి. స్థానికంగా ఉల్లి సాగును ప్రోత్సహించి సరఫరా వ్యవస్థను బలోపేతం చేసినప్పుడే సామాన్యుడికి ఉల్లి ధరల మంట నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుంది. - కోడెపాక ప్రభాకర్, 9701577516

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్