– జులై 9 శ్రమజీవుల పోరాట చరిత్రలో నిలవాలి : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ పిలుపు
– ఘజియాబాద్ పారిశ్రామిక వాడలో ప్రచారం
ఘజియాబాద్ : దేశవ్యాప్తంగా ఈ నెల 9న చేపట్టబోయే సార్వత్రిక సమ్మె మహోద్యమంగా నిర్వహించాలని శ్రమజీవులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రధానకార్యదర్శి ఎంఎ బేబీ పిలుపునిచ్చారు. కార్మిక, కర్షక పోరాటాల చరిత్రలో 2025 జులై 9 నిలిచేలా సమ్మెను దిగ్విజయం చేయాలని ఆయన కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, వివిధ రాష్ట్రాల్లోని బీజేపీ, దాని భాగస్వామ్యపక్షాల ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, కార్మిక, కర్షక హక్కుల అణచివేత చర్యలను ప్రతిఘటించాలని పిలుపునిస్తూ కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు ఐక్యంగా సార్వత్రిక సమ్మెకు సన్నద్ధత అవుతున్న తరుణంలో వారికి సంఘీభావంగా వామపక్షాలు వివిధ రూపాల్లో సమ్మె ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని ఒక పారిశ్రామిక వాడలో నిర్వహించిన ఫ్యాక్టరీ గేటు మీటింగ్‌లో సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి ఎంఎ బేబీ పాల్గొన్నారు. అనంతరం సిపిఎం ఘజియాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు బ్రిజేష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సభకు పరిసర ప్రాంతాల నుంచి మహిళా కార్మికులు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎంఎ బేబీతో పాటు పొలిట్‌బ్యూరో సభ్యులు అరుణ్ కుమార్, ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి అనురాగ్ సక్సేనా తదితరులు ప్రసంగించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే దేశంలోని కార్మికవర్గం మొత్తం బానిసత్వంలో కూరుకుపోతుందని ఎంఎ బేబీ ఆందోళన వ్యక్తం చేశారు.మోడీ సర్కార్ అండదండలతో క్రోనీ కేపటలిస్టులు శ్రమదోపిడీని మరింత తీవ్రతరం చేస్తారని తెలిపారు. రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తామంటూ దానిని ఒక హక్కుగా ప్రపంచ ప్రజలకు అందించిన చికాగో కార్మికుల ప్రాణత్యాగాలను ఈ సందర్భంగా బేబీ గుర్తు చేశారు. అలాగే శ్రామిక వర్గం పోరాటాలకు మద్దతుగా తన కళను అంకింతం చేసి వీధి నాటకాన్ని ప్రదర్శిస్తూనే పాలకుల తూటాలకు బలైపోయిన ప్రజా కళాకారుడు సఫ్దర్ హష్మీ, నాటి ఘటనలోనే మరణించిన కార్మిక నేత రామ్ బహదూర్ త్యాగాలను ఆయన స్మరించుకున్నారు. ఘజియాబాద్‌లోని సైట్ 4లో జరిగిన ఈ సమావేశానికి వివిధ ఫ్యాక్టరీల నుంచి వందలాది కార్మికులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పొలిట్‌బ్యూరో సభ్యులు అరుణ్‌కుమార్ మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా ఉధృత పోరాటం నిర్వహించాలన్నారు. శ్రమజీవుల పక్షాన పోరునౌకగా ఉన్న పార్టీ యంత్రాంగం మొత్తం వీధుల్లోకి వచ్చి పోరాడాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. సంపద సృష్టిలో పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని మాత్రమే చూస్తున్న ప్రధాని మోడీకి సార్వత్రిక సమ్మె కనువిప్పు కలిగించాలని పిలుపునిచ్చారు.