నవతెలంగాణ-మల్హర్ రావు
మండలంలోని పెద్దతూండ్ల, గాదంపల్లి గ్రామాల్లోని అంగన్వాడీ 1,3 సెంటర్స్ టీచర్లు అన్నపూర్ణ, సౌజన్య, రమాదేవి ఆధ్వర్యంలో శుక్రవారం పోషన్ పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గర్భధారణ దశ నుంచే తల్లులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రక్తహీనత లేకుండా పోషకాహారం తీసుకోవడం ద్వారా హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుకోవచ్చన్నారు. డెలివరీ తరువాత వెంటనే శిశువుకు ముర్రుపాలు ఇవ్వడం ఎంతో ముఖ్యమని, దాని ద్వారా శిశువుకు రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు.
పుట్టిన మొదటి నెల నుంచి రెండు సంవత్సరాల వరకు తల్లిపాలను కొనసాగించడం అత్యంత అవసరమని, ఈ కాలాన్ని “గోల్డెన్ డేస్”గా పేర్కొన్నారు. అలాగే రోజువారీ ఆహారంలో చిరుధాన్యాలను భాగంగా చేర్చుకోవాలని, అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. చిన్నారులకు, కిశోర బాలికలకు పౌష్టికాహారం తీసుకునే విధానంపై అవగాహన కల్పించారు. అనంతరం చిన్నారులకు అన్నప్రసన్న, అక్షరాబ్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్ల రవిందర్, వార్డు సభ్యుడు రాజమొగిలి, ఆశలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు.



